top of page
Writer's picturePrasad Bharadwaj

ఆధ్యాత్మికుడిది జూదరి మనస్తత్వమా? The spiritualist needs a gambling mentality?


🌹. ఆధ్యాత్మికుడిది జూదరి మనస్తత్వమా? 🌹


ఆధ్యాత్మిక జీవనంలో అనుభవాలు' నిరర్థకమైనవని జిడ్డు కృష్ణమూర్తి గారు హెచ్చరిస్తూ ఉండేవారు. ఆఖరికి అంతర్దృష్టి ద్వారా కనిపించినదైనా శంకించి, తర్కించి, దాని నిజానిజాలు నిర్ధారించుకోమన్నారు. గుడ్డిగా దేనినీ సమ్మతించవద్దని చెప్తూ ఉండేవారు.


“అది ఎంత గొప్ప అనుభవమైనా, ఒక క్షణాన వచ్చి మరో క్షణాల వెళ్ళిపోయేదే కదా? అది సత్యమే అయితే, నిత్యం ఉండేదే అయి ఉండాలి కదా? వచ్చి వెళ్ళిపోయేది ఎట్లా అవుతుంది?” అనేవారు అరుణాచల రమణులు. ఈ మహనీయులు చెప్పిన మాటలే కాక, ఈ సందర్భంగా నిసర్గదత్త మహరాజ్ చెప్పిన మాటలు కూడా గమనార్హం.


గమ్యం అందుకోవడానికి మనిషి బలీయమైన, సుదృఢమైన కోరిక కలిగుండాలి అంటాడు ఆయన. ఆ ఉద్దేశం, తత్సంబంధమైన సంకల్పం లేకపోతే ఆ ప్రయత్నానికి తగినంత శక్తి జనించదు. ఇక రెండవది, తన ప్రయత్నంలో విజయం సాధించగలననే గ్యారంటీ లేకపోవడం. ఇక్కడ జూదరి యొక్క మనస్తత్వాన్ని ఉదహరిస్తాడు నిసర్గదత్త. అధ్యాత్మికుడికి కూడా ఈ జూదరి మనస్తత్వం అవసరమవుతుంది.


ఉన్నదంతా, జూదరి పందెం కాసినట్లే ఈ సాహసయాత్రలో, కలిగున్నదంతా తిరస్కరించాలి. ఊరు, పేరు, హోదా, ఆస్తి, అంతస్తు మనిషికి సంఘంలో వున్న గుర్తింపు యావత్తూ పక్కకు నెట్టేయాలి. గతమంతా తుడిచిపెట్టుకు పోవాలి. అవతల ఏమున్నదో, తన గతి ఏమి కానున్నదో తెలియకుండా అగాధమైన లోతుల్లోకి ఉరక గలిగుండాలి. అది లభిస్తుందనే దృఢ విశ్వాసంతో దూకుతున్నాడే కానీ అది దక్కి తీరుతుంది అని ఎవరూ హామీ ఇవ్వగలిగిలేరు. కానీ మహా సాహసం చేయక తప్పదు.


నిసర్గ : ఆధ్యాత్మికతానుభావం ఎంత మహత్తరమైన దైనప్పటికీ అది అసలు వస్తువు కాదు. స్వభావరీత్యా అది వస్తుంటుంది. పోతుంటుంది. ఆత్మసాక్షాత్కారం, సంపాద్యంకాదు. అది అవగాహన యొక్క స్వభావాన్ని కలిగుంటుంది. ఒకసారి అది ప్రాప్తిస్తే మనిషి దాని వద్దకు చేరితే, ఇక దానిని కోల్పోయే ప్రసక్తిలేదు. ఇక చైతన్య స్రవంతి అంటావా, అది తరచూ పరివర్తన చెందుతూ వుంటుంది, ప్రవహిస్తూ వుంటుంది. క్షణక్షణం మారిపోతూ వుంటుంది. చైతన్యమూ, దానిలోనున్న విషయాలను అంటిపెట్టుకుని వుండకు. చైతన్యాన్ని పట్టుకు కూచున్నావంటే సాక్షాత్కారం ఆగిపోతుంది. అంతర్ దృష్టి యొక్కమెరుపును, లేక ఆనందాతిశయాన్ని అలాగే శాశ్వతంగా వుండేట్లు చేద్దామనుకుంటే అది దాని వినాశనానికి కారణమవుతుంది. ఏదైతే వచ్చిందో అది పోక తప్పదు. శాశ్వతమైనది, వచ్చేదీ కాదు పోయేదీ కాదు. సమస్తమైన అనుభవాలకు మూలమయిన వ్రేళ్ళ వద్దకు, అనగా నీ సత్త వద్దకు వెళ్ళు. సత్తకూ, సత్త కానిదానికి ఆవలనున్నది. ఆ బ్రహ్మాండమైన వాస్తవం. మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూ ఉండు.


పృచ్ఛకుడు : అలా ప్రయత్నించడానికి మనిషికి విశ్వాసం వుండాలి.


నిసర్గ : ముందసలు ఆ కోరిక ఉండాలి. కోరిక బలీయంగా ఉంటే ప్రయత్నించాలనే పట్టుదల వస్తుంది. గట్టిగా కోరడం జరిగితే విజయం ఖాయమనే హామీ యొక్క అవసరం వుండదు. దానితో జూదమాడేందుకు సిద్ధపడతావు.


పృ : నేనింతకన్న చిన్నవాణ్ణయినప్పుడు నాకేదో వింత అనుభవాలు-చిన్నవే అయినప్పటికీ, జ్ఞాపకముంచుకోదగినవి కలుగుతుండేవి. నేను ఏమీ కాదని, కేవలం ఏదో శూన్యమన్నట్లుగా వుండేది. కానీ చైతన్య స్పృహలోనే వుండేవాణ్ణి. ఇక్కడొచ్చిన ప్రమాదమల్లా ఒక్కటే. అలా చెల్లిపోయిన క్షణాలను మళ్ళీ మళ్ళీ తలచుకుని వాటిని పునఃసృష్టించు కోవాలనే కోరిక బయలుదేరడం.


నిసర్గ : ఇదంతా ఊహ. చైతన్యం వెలుగులో అనేకం సంభవిస్తూ ఉంటై. వాటికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. భగవంతుడి రూపదర్శనమెంతో, ఒక పుష్పం కనిపించడం కూడా అంత అద్భుతమైనదే. వాటి పాటికి వాటినలా వుండనీ. వాటిని గుర్తు తెచ్చుకోవడం దేనికి? ఆ తర్వాత జ్ఞాపకాలు ఒక సమస్యగా చేసుకోవడం ఎందుకు? వాటియెడల మార్దవంగా ఉండిపో. వాటికి ఉచ్ఛనీచాలు ఆపాదించవద్దు. గొప్పవనీ అధమమైనవనీ, అంతర్గతమైనవనీ, బాహ్యమైనవనీ, శాశ్వతమైనవనీ, తాత్కాలిక మైనవనీ విభజిస్తూ కూచోవద్దు. ఏది సంభవిస్తున్నప్పటికీ వీటన్నిటికీ మూలమైన నీ ఆత్మ వద్దకు వెళ్ళు. నువ్వీ ప్రపంచంలో పుట్టావని నీవేర్పరచుకున్న నమ్మకం, కేవలం నీ బలహీనత. నిజానికి ఈ ప్రపంచం నీలో, నీచేత ఎల్లప్పుడూ పునఃసృష్టింపబడుతున్నది. నీ సత్తకు మూలమైన వెలుగునుండే ఇవన్నీ జనిస్తున్నవనే విషయం చూడు. ఆ వెలుగులో ప్రేమ, అనంతమైన శక్తి వున్నాయని నీవే గ్రహిస్తావు.


నేనిక్కడ జీవించి ఉంటానికే నేను చూడాల్సిన' అవసరం ఉందంటారా?


నిసర్గ : నువ్వు ఏమిటిగా వున్నావో చూడు, వారినీ వీరినీ అడుగకు. నిన్ను గురించి ఇతరులను, నీవు చెప్పనివ్వకు. నీలోనికి నువ్వు చూసుకుని గ్రహించు. మార్గ దర్శకుడు చెప్పగలిగినదంతా ఇంతే. ఒకరివద్ద నుండి మరొకరి వద్దకు వెళ్ళాల్సిన అవసరం లేదు. అన్ని బావుల్లో ఉండే నీరు ఒకటే. ఏ బావి సమీపంగా ఉంటే దాని నుండి నీరు తోడుకో, నా విషయానికొస్తే నాలో ఆ నీరు వున్నది, నేనా నీటినే.


🌹🌹🌹🌹🌹

1 view0 comments

Comments


Post: Blog2 Post
bottom of page