top of page

"గురుర్వినా గతిర్నాస్తి ..." - "गुरुरविना गथिरनास्ती..." - "Gururvina Gatirnasti..." (No Salvation

Dec 17, 2022
2 min read

🌹. "గురుర్వినా గతిర్నాస్తి" ... 🌹

గురువు తప్ప మరొక గతి లేదు అనేది అర్థమై, ఆచరించ గలిగితే అసాధ్యం లేదు. గురువు నీ చేతిని పట్టుకోవాలని అంటే ఆ అర్హతను నువ్వు సాధించుకోవాలి. గురువు ఎప్పుడూ పరమ ప్రేమ స్వరూపమే. అందులో సందేహం లేదు. ఎల్లప్పుడూ శిష్యుని అభ్యున్నతిని కోరుతాడు గురువు. అందులోనూ సందేహం లేదు. అయితే గురువు ప్రసరించే ప్రేమ శక్తిని అందుకునే స్థాయి శిష్యునికి వుండాలి. అదెలా వస్తుంది? గురువు మాత్రమే తనను ఉద్ధరించ గలడు అనే పరిపూర్ణ విశ్వాసాన్ని కలిగి వుండటమే ఆ స్థాయిని అందిస్తుంది. కానీ మనం ఏమి చేస్తున్నాం? ఏదో ఒక సమస్య పరిష్కారానికి గురువును ఆశ్రయంచి ఉంటున్నాం. ఆ సమస్య తీరితే ఆ గురువు గొప్పవాడు. తీరకపోతే మరో గురువు. ఇలా కొట్టుకు పోతున్నాం. గురువు నీ సమస్యని ఖచ్చితంగా పరిష్కరిస్తారు. ఆ శక్తి గురువులో వుందని నువ్వు మనసా, వాచా, కర్మణా నమ్మాలి. అప్పుడే అది సాధ్యం అవుతుంది. గురువు కూడా నీలాగా మామూలు మనుషిలాగే వుంటాడు, లోకంలో అందరిలాగే వ్యవహరిస్తాడు, అందరిలాగే ఇబ్బందులూ పడతాడు. కానీ ఆ గురువు తన గురువు మీద అచంచలమైన విశ్వాసంతో వుంటాడు. తనని తాను తన గురువు చేతిలో పరికరంగానే భావించుకుంటాడు. అందుకే, ఆ సేవాభావం వల్లనే , ఆ సర్వస్య శరణాగతి వల్లనే గురువు శక్తిమంతుడు అవుతాడు. నీ సమస్యని తీర్చే శక్తిని తన గురువు తనకి అందిస్తాడనే విశ్వాసమే నీ గురువు లోని శక్తి. కనుక నువ్వు ఎప్పుడు గురువే సర్వస్వం అని నమ్ము అప్పుడే నీ గురువు నీ చేతిని పట్టుకుని నడిపిస్తాడు. నమ్మకం అచంచలంగా వుందా నీలో? ఆ ప్రశ్నకి ఎవరికి వారే సమాధానం చెప్పుకోవాలి.గురువు మార్గాన్ని చూపిస్తాడు...ఆ మార్గంలో నడవటం నీ పని. గురువు జ్ఞానాన్ని అందిస్తాడు...ఆ జ్ఞానాన్ని జీవితంలో భాగం చేసుకోవటం నీ పని. గురువు ప్రేమని ప్రసరిస్తాడు...ఆ ప్రేమని నీలో నింపుకోవడం నీ పని. గురువు దగ్గరకి వెళ్ళేటప్పుడు నీ బుద్ధిని, నీ తెలివితేటలను పక్కనపెట్టి వెళ్ళాలి. గురువుతో వాదన పనికిరాదు. గురువు చెప్పే మాటలను చెవులతో కాదు...మనసుతో వినాలి. గురువును నమ్మినప్పుడు కళ్ళు మూసుకొని, ఇతర చింతనలు లేకుండా నమ్మాలి. గురువుకు నిన్ను నువ్వు సమర్పించుకోవడం అంటే నీ హృదయాన్ని పూర్తిగా తెరచి సమర్పించాలి. గురువు ఉపదేశాన్ని వినేటప్పుడు నోరు మూసుకొని వినాలి. గురువును ఏదైనా కొరేటప్పుడు కొంగు చాచి అడగాలి. ఇవన్నీ చేయగలిగితే గురువు నీవాడు అవుతాడు. ఒక గురువు ఆ గురువు అనే స్థితికి ఎలా చేరాడు? తన జీవితాన్ని తన గురువు చరణాల వద్ద సమర్పించటం వల్ల , తన జీవితంలోని చిన్న చిన్న సంతోషాలను కూడా వదులుకొని తన గురువును సేవించటం వల్ల , తన వృత్తి - ఉద్యోగ - వ్యాపారాదులను తృణప్రాయంగా వదలి తన గురువుకు అంకితం కావటం వల్ల మాత్రమే అది సాధ్యం అవుతుంది. అప్పుడే గురుకృప లభిస్తుంది. ఆ గురుకృప ా వ్యక్తిని కూడా గురు స్థానంలో నిలుపుతుంది. అయితే ఆ వ్యక్తి తనకు గురుత్వ స్థాయిని కోరుకొని చేశాడా? కానే కాదు. తన ఆత్మోన్నతి కోసమే చేస్తాడు. అది సఫలం అయినప్పుడు గురువే ఆ వ్యక్తిని తన పరికరంగా ఆయుధంగా లోకానికి సమర్పించి , ఆ వ్యక్తిని గురువుగా నిలుపుతాడు. తన పరికరంగా , తన బాధ్యతలను ఆ వ్యక్తి ద్వారా నెరవేరుస్తారు. అందువల్ల ఇప్పుడు మీ ముందు సమర్థుడైన గురువుగా నిలిచిన వ్యక్తికి ఆ స్థాయిని అందుకున్నాక కూడా వ్యక్తిగత జీవితం మిగలదు. అది తెలుసుకోగలిగితే ఒక గురువు పట్ల మనం ఎలా ప్రవర్తించాలో అర్థం అవుతుంది. నువ్వు లౌకికంగా అత్యున్నత విద్యావంతుడివి కావచ్చు. కానీ గురువు ముందు అనుక్షణమూ నీకు అక్షరాభ్యాసమే. నువ్వు సమాజంలో గురువు కన్నా ఉన్నత స్థాయిలో వుండవచ్చు. కానీ గురువు ముందు నువ్వు కేవలం ఒక సేవకుడివే. నువ్వు గురువు కన్నా అత్యధిక ధనవంతుడివి కావచ్చు. కానీ గురువు ముందు నిరుపేదవే. నువ్వు గురువు కన్నా అధిక లౌకిక జ్ఞానం కలవాడివి కావచ్చు. కానీ గురువు ముందు పరమ అజ్ఞానివే. నీ లౌకిక విద్య గురువు ముందు నిరక్షరాస్యత గా మిగులుతుంది. సమాజంలో నీ స్థాయి గురువు ముందు నిష్ప్రయోజనం గా మిగులుతుంది. నీ ధన సంపద అంతా గురు చరణ ధూళిని కూడా తాకలేదు. నీ లౌకిక జ్ఞానం సమస్తం గురువు అలౌకిక జ్ఞానం ముందు గుడ్డి గవ్వకు కూడా పనికిరాదు. ఈ విషయాన్ని మనస్సులో స్థిరంగా నిలుపుకో గలిగితే గురువు నీ వాడు అవుతాడు.

🌹 🌹 🌹 🌹 🌹


Comments


Post: Blog2 Post

©2022 by DailyBhaktiMessages. Proudly created with Wix.com

  • Facebook
  • Twitter
  • LinkedIn
bottom of page