🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 259 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. ఆనందించే వాళ్ళ శక్తి పెరుగుతుంది. వాళ్ళు సజీవ చైతన్యంతో వుంటారు. ఈ చురుకుదనం నించీ, సున్నితత్వం నించీ, తెలివితేటల నించీ యింకో క్షణం పుడుతుంది. వాళ్ళు గత క్షణం కన్నా ఈ క్షణం ఆనందించే సామర్థ్యం ఎక్కువ కలిగి వుంటారు. 🍀
ప్రపంచంలో కేవలం రెండు రకాల మనుషులున్నారు. ఎప్పుడూ యింకా యింకా కావాలంటూ వున్నదాంతో సంతృప్తి పడని వాళ్ళు. వున్నది అనుభవించలేని వాళ్ళు. వాళ్ళు ఆశించింది అందినా యింకా కావాలని కోరతారు. వాళ్ళు అనుభవించరు. జీవితమంతా వాళ్ళ ఆనందాన్ని వాయిదా వేస్తూ వుంటారు. వాళ్ళ జీవితం సుదీర్ఘమయిన వాయిదా తప్ప మరేమీ కాదు. అదెప్పుడూ రేపే. ఈ రోజు వాళ్ళు కష్టపడాలి. ఈ రోజు సంపాందించాలి. రేపు వాళ్ళు విశ్రాంతి పొందుతారు. సుఖపడతారు. కానీ రేపన్నది ఎప్పటికీ రాదు. అందువల్ల వాళ్ళు జీవితమంటే తెలీకుండా కాలం గడిపేస్తారు.
రెండో రకం వాళ్ళు వాళ్ళకున్న దాన్ని వాళ్ళు అనుభవించేవాళ్ళు. యింకా కావాలన్న ఆలోచన వాళ్ళకుండదు. అద్భుతమెక్కడంటే వాళ్ళకు రోజంతా ఆనందించడానికి మరింత మరింత అందుతుంది. ఆనందించే వాళ్ళ శక్తి పెరుగుతుంది. వాళ్ళు నిరంతరం దాన్ని ఆచరిస్తారు. ప్రతిక్షణం అనందిస్తారు.వాళ్లు ఆనందించడంలో ప్రావీణ్యం పొందుతారు. వాళ్ళు ఆనంద విషయాల పట్ల సున్నితంగా స్పందిస్తారు. సజీవచైతన్యంతో వుంటారు. ఈ చురుకుదనం నించీ, సున్నితత్వం నించీ, తెలివితేటల నించీ యింకో క్షణం పుడుతుంది. వాళ్ళు గత క్షణం కన్నా ఈ క్షణం ఆనందించే సామర్థ్యం ఎక్కువ కలిగి వుంటారు. వాళ్ళ జీవితం నిరంతర గాఢ ప్రవాహం లోతుల్లోకి వెళ్ళే ప్రవాహం.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Commenti