🌹. పూరీ జగన్నాధ రథయాత్ర. 🌹
రథయాత్ర అనగానే అందరికీ ఠక్కున గుర్తుకు వచ్చేది పూరీజగన్నాథ రథయాత్ర. ప్రతీ సంవత్సరమూ అత్యంత వైభవంగా జరిగే ఈ రథయాత్రలో దేశం నలుమూలల నుంచీ అసంఖ్యాక భక్తులు పాల్గొంటారు. అత్యద్భుతంగా అలంకరించిన రథంలో దివ్యమూర్తుల విగ్రహాల్ని ప్రతిష్ఠించి నృత్యగానాలతో పురవీథుల్లో ఊరేగిస్తారు. భక్తులు ఆనందపారవశ్యంతో రథయాత్రను తిలకిస్తారు. ఫలపుష్పాదులను అర్పించి, భక్తిప్రపత్తులతో రథం ముందు ప్రణమిల్లుతారు. రథానికి వేలాదిమంది భక్తులు తమ శిరస్సులు వంచి ప్రణతులర్పించడానికి కారణం అందులో భగవంతుని దివ్యమూర్తులు కొలువుతీరి ఉండడం అని మనకు విదితమే. సంవత్సానికి ఒకసారి జరిగే ఈ రథయాత్రకు ఇంత ప్రాముఖ్యం ఉంటే, మరి మన జీవన యాత్రలో నిత్యం జరిగే రథయాత్రకు మరెంత ప్రాముఖ్యత ఉండాలి? అయితే మన జీవనయాత్ర కొనసాగించేందుకు ఉపయోగించే రథం ఏది? ఆ రథంలో ఆసీనుడై ఉన్న రథికుడెవరు?
బాహ్యప్రపంచంలో గమ్యాన్ని చేరుకోవడానికి ఎన్నో రకాల వాహనాలు ఉన్నాయి. కానీ అంతర ప్రపంచంలో పయనించి పరమపదాన్ని చేరుకోవడానికి మనకున్న ఒకే ఒక వాహనం ఈ ’శరీరం’. శరీరం అనే రథంలో ఆసీనుడై ఉన్న రథికుడు చైతన్య స్వరూపుడైన భగవంతుడు (ఆత్మ).
రథంయెక్క బాహ్యాలంకారాల్ని తిలకిస్తూ రథికుణ్ణి మరచిపోతే అలాంటి రథయాత్ర నిష్ప్రయోజనం. అలాగే మనం దేహాలంకారాల్లోనూ, దేహ సౌందర్య ఆకర్షణల్లోనూ మునిగి దేహాంతర్గతంగా ఉన్న ఆత్మస్వరూపాన్ని ఆదమరచిన నాడు మన జీవనయాత్ర నిరర్థకం.
ఆత్మ సాక్షాత్కార యాత్రలో మనిషిని పశుప్రవృత్తి నుంచి పశుపతి స్థితికి చేర్చే ఏకైక సాధనం ఈ మానవ దేహం. ఎన్నోజన్మల సుకృత ఫలమైన ఈ మానవ దేహమనే రథాన్ని బాహ్య విషయాలవైపు పరుగులు తీయనీయకుండా అంతర్ముఖంగా ప్రయాణం కొనసాగించి అంతరాత్మను చేరుకోవడానికి ప్రయత్నించినపుడు మానవ జన్మ సార్థకమవుతుంది.
🌹 🌹 🌹 🌹 🌹
コメント