🙏ఓం శ్రీ గురుభ్యోనమః🙏
🌹🌹
శ్రీరస్తు,శుభమస్తు, అవిఘ్నమస్తు.
ఓం సర్వ జగద్రక్షాయ గురు దత్తాత్రేయ
శ్రీ పాద శ్రీ వల్లభ పరబ్రహ్మాణేినమః
శ్రీపాద శ్రీవల్లభ చరితామృతములో దండిస్వామికి పాములు ఆడించుకొనే అబ్బయ్య ద్వారా పెరుగన్నం ప్రసాదంగా పంపించి, కుక్కుటేశ్వర ఆలయము నుండి శ్రీపాదుల వారు తన వద్దకు పిలిపించుకొని, శ్రీపాదుల వారు: ఓయీ! దండిస్వామినని ఎంత గర్వించితివి. నీవు ఆరాధించు దత్తుడే ఇక్కడ శ్రీపాద శ్రీవల్లభ రూపములో ఉండగా గుర్తు ఎరుంగలేని పరమమూర్ఖుడివి నీవు. గంతకు తగ్గ బొంత అనునట్లు నీకు శిష్యగణము ఒకటి. పీఠికాపురమున ఏర్పడిన నూతన శిష్యగణము ఒకటి.
నీవు నన్ను ఏమి చేయగలవు!? సమస్తసృష్టిని శాసించు ఏకైక సత్తా ముందు నీ అస్థిత్వము ఎంత? నీ సామర్ధ్యము ఎంత?
దైవదూషణ చేయుటవలన నీకూ, నిన్నాశ్రయించిన వారికి మహాపాపము చుట్టుకొనినది. మిమ్ములను అందరినీ కొన్ని వందల సంవత్సరములు పిశాచజన్మలో ఉండవలసినదిగా చిత్రగుప్తుల వారు నిర్ణయించిరి. అవ్యాజ కరుణతో నేను దానిని రద్దుపరచితిని.
మానవజన్మకు వచ్చినప్పుడు కూడా మీరందరూ నీచజన్మలకు వచ్చి కడగండ్లు పడవలెనని తీర్మానించబడినది. దానిని కూడా అత్యంత స్వల్పశిక్షలో నేను పరిహరించితిని.
శ్రీపాద శ్రీవల్లభ స్వరూపము మహాగ్ని సదృశమైనది. నిప్పుతో చెలగాటమాడుట ప్రమాదములకు దారితీయును.
నేనునూ, నా మాయయునూ అభిన్నస్వరూపులమై ఉండగా మోక్షము అనునది ఏమో ఆలోచించుము.
మోహము క్షయించుటయే మోక్షము.
ఏ జీవుడైనా సచ్చిదానంద స్వరూపమును అనుభవించవలెనని కోరిన యెడల, వారికి యోగ్యత ఉన్నచో నేనే అనుగ్రహించెదను.
దివ్యానంద పారవశ్యంలో మాయకు అతీతంగా సుఖస్వరూపముగా ఉండవలెనని కోరిన, అట్లే అనుగ్రహింపబడును.
నా దృష్టిలో నిర్గుణ నిరాకారమునకు, సగుణ సాకారమునకు, మోక్షమునకు, బంధనమునకు వ్యత్యాసము ఏమి ఉండును?
ప్రతిక్షణము అసంఖ్యాకములైన నూతన లోకముల సృష్టి, స్థితి, లయములు నొందుచుండును.
జీవులు పొందగలిగిన ఉన్నత స్థితులకు గాని, ఉన్నత ఆనందభూమికలకు గాని, పరిమితి గాని, హద్దులు గాని లేవు.
మరణానంతరం నా వద్దకు రాగోరువారు తప్పక రాగలరు. వారు ఎన్ని వందల దివ్యవర్షములు ఆయా స్థితులలో ఉండవలెనో, ఏయే లోకములకు తిరిగి పంపబడవలెనో, నా సంకల్పము నిర్ణయించును.
కపటనాటక సూత్రధారి అయిన నేను ప్రస్తుతము నరాకారముగా మీ ముందు ఉన్నాను. మీరు నన్ను చూచుచున్నారు.
ఈ ఆకారము లేని స్థితిలో కూడా నేను మిమ్మల్ని సదా చూచుచుందును అని తెలియజేయుటకు మాత్రమే నరాకారములో ఆ మహోన్నతస్థితి నుండి నేను దిగి వచ్చితిని.
మహాయోగుల యొక్క యోగశక్తులు అన్నియు లోకకల్యాణము కొరకే వినియోగపడవలెను.
లోకము అనగా ఒక్క ఈ భూలోకమే కాదు.
నీ కంటే తక్కువ స్థితిలో ఉన్న నిస్సహాయ జీవులకు సహాయము చేయుట నీ ధర్మము.
నేను ధర్మమార్గమును, కర్మమార్గమును, యోగమార్గమును, భక్తిమార్గమును, జ్ఞానమార్గమును బోధించుటకే అవతరించునది.
నేను సర్వసత్యములకు మూలమైన ఏకైక సత్యమును, సర్వధర్మములకు మూలమైన ఏకైక ధర్మమును. సర్వకారణములకు మూలమైన ఏకైక కారణమును.
నా సంకల్పములో లేనిది ఈ సృష్టిలో కానరాదు. నేను లేనిదే సృష్టి లేదు. నేను ఉన్నాను కనుకనే నీవు ఉన్నావు. సృష్టి ఉన్నది. ఇంతకంటే సత్యమును ఏ విధముగా తెలుపమందువు.
నీవు హిమాలయములకు పోయి, నిస్సంగుడవై, తపము ఆచరించుము. శిష్యజంఝాటము నీకు వలదు.
నీవు మోక్షమును పొందక పోయిననూ, ఉద్దరింప బడక పోయిననూ, సృష్టికి గాని, నాకు గాని కలిగెడి నష్టము ఏమియూలేదు. సృష్టిలోని కార్యక్రమములు యధావిధిగా నిర్వర్తింప బడుచుచూనే ఉండును. ఇది అసలు ఉన్న విషయము.
సర్వం శ్రీ పాద శ్రీ వల్లభ చరణారవిందమస్తు.🙏
Comments