🌹. గురువు మీ ప్రారబ్ధాన్ని ఎలా తొలగిస్తారు? 🌹
కొన్నిసార్లు గురువు మీపై అరుస్తారు. ఎందుకో తెలుసా? మీపై అరవడం ఆయనకు ఇష్టమని మీరు భావిస్తున్నారా? సంచిత కర్మ స్థాయిలో ఉంది కాబట్టి ఆయన మీద అరవడం ద్వారా దాన్ని తీసేసుకుంటారు. గురువు అటువంటి త్యాగం చేస్తారు. అందుకే ఆయన నిజమైన గురువు, సద్గురువు. అప్పటి కృష్ణుడు అటువంటి గురువు, బుద్ధుడు మరొక గురువు.అందుకే మనం 'గురుమధ్యే స్ధితం విశ్వం, విశ్వ మధ్యే స్ధితో గురుః, గురుఃవిశ్వం నాచాన్యోస్తి, తస్మైశ్రీ గురవేన్నమః' అంటాము. గురువులోనే విశ్వముంది, విశ్వానికి మధ్యలో గురువున్నారు.
ఇక్కడ ద్వంద్వాలు ఉండవు, గురువు విశ్వ చైతన్యంనుంచి వేరుగా ఉండరు. అటువంటి దక్షిణామూర్తి స్వామికి, సాక్షాత్తూ హయగ్రీవుడికి, వందనాలు, ప్రణామాలు. ఆయన ఉన్నతమైన జ్ఞానానికి, తెలివికి ప్రతిరూపం. గురువంటే ప్రస్తుతం, ఈరోజు. ఆయన మీతో జీవిస్తారు, నాట్యం చేస్తారు. ఆయన మీతో విశ్వ నృత్యం చేస్తారు. ప్రతిసారి ఆయన మీ సహవాసాన్ని ఆస్వాదిస్తారు. ఆయనకు, మీకు మధ్యన దూరమనేది ఉండదు. గురువు మీనుంచి దూరంగా వెళ్ళారని భావించడం, మీ దృక్పథం మాత్రమే. మేము దేన్నీ లెక్కచెయ్యని దృక్పథంతో జీవిస్తాము. యజ్ఞం పేరుతో కొన్ని చిన్న ప్రార్ధనలు జరుగుతాయి. నేను మిమ్మల్ని అక్కడికి రమ్మని అడుగుతాను, ఏదో సమిధ ఇవ్వబడుతుంది; మీరు దైవం యొక్క నామాన్ని జపిస్తూ, దాన్ని యాగాగ్నిలో వెయ్యవచ్చు. మీరు ఆనందంగా ఉండవచ్చు. మీ గురువు మీకోసం ప్రార్ధిస్తారు. దైవమే గురువు రూపంలో మీకోసం ప్రార్థనలు చేస్తారు.
విశ్వాసం కలిగి ఉన్న భక్తులలో అద్వైతానికి, అద్వైతానికి, విశిష్టాద్వైతానికి మధ్య అంతర్గత కుమ్ములాటలు ఉండకూడదు, ఎందుకంటే అవన్నీ సాధనలోనే వివిధ దశలు మాత్రమే. మనందరం ఆలయానికి వెళ్ళి దైవాన్ని ప్రార్థిస్తాము కనుక, మన జీవితాన్ని ద్వైతంతో మొదలు పెట్టాము. దీనివల్ల దైవాన్ని, మన నుంచి వేరుగా భావిస్తున్నామని స్పష్టంగా తెలుస్తుంది. అందుకే ఇది ద్వైతం. ఆ తర్వాత మనం ఇలా ప్రార్థిస్తాము, ' ఓ దైవమా! నేను నీ భక్తుణ్ణి.' ఇలా క్రమంగా మనం దైవంతో ఒక చనువును ఏర్పరచుకుంటాము, ఇదే విశిష్టాద్వైతం. చివరికి మనం ఇలా అనే దశకు వస్తాం,' ఓ దైవమా, నువ్వు నేను ఇద్దరం ఒకటే.' ఇదే అద్వైతం. మరొక విధంగా చెప్పాలంటే 'దాసోహం' తో మొదలయ్యి 'సోహం' అనే దశకు ఆ తర్వాత 'శివోహం' అనే దశకు మనం చేరుకుంటాము.
🌹 🌹 🌹 🌹 🌹
Comments