top of page

జ్యేష్ఠ ఏరువాక పూర్ణిమ, కబీరుదాసు జయంతి శుభాకాంక్షలు - Good Wishes on Jyeshtha Eruvaka Purnima, Kabi

Writer's picture: Prasad BharadwajPrasad Bharadwaj


🍀🌹. జ్యేష్ఠ ఏరువాక పూర్ణిమ, కబీరుదాసు జయంతి శుభాకాంక్షలు, Jyeshtha Eruvaka Purnima, Kabirdas Jayanti Good Wishes to All. 🌹🍀


ప్రసాద్‌ భరధ్వాజ


భగవంతుని కొరకు అక్కడ - ఇక్కడ వెతకవలసిన పనిలేదు, అతడు నీలోనే ఉన్నాడు . నీలో వున్న ఆత్మారాముని కనుగొనలేక కస్తూరి మృగం చందంబున అక్కడక్కడ వెదకులాడిన ఏమి లాభం? పూవులోని వాసనలా దేవుడు నీలోనే ఉన్నాడు. తన నాభి నుండి బయట పడుతున్న కస్తూరి గంధాన్ని, తెలుసుకొనలేని జింక, దాన్నిబయట గడ్డిలో వెతుకుతుంది. అలాగే నీలోని భగవంతుని బయట వెతకవద్దు. - మహాత్మా శ్రీ కబీరుదాసు.


🌻. కబీరుదాసు జీవిత విశేషాలు :


భక్తి ఉద్యమకారుడుగా, సామాజిక సంస్కర్తగా, సమతా ఉద్యమకారునిగా ప్రజాకవిగా సంత్‌ కబీర్‌దాస్‌ పేరు పొందాడు. కాశీ కేంద్రంగా క్రీ.శ.1455-1518 మధ్య వారు జీవించారు. వారు జేష్ఠ పౌర్ణమి నాడు జన్మించారు. వారి జీవనానికి సంబంధించి అనేక వైరుధ్య కథనాలు వినపడు తున్నాయి. వారి జీవన కాలం విదేశీ ముస్లిం పాలకుల దౌర్జన్యం తీవ్రంగా ఉన్న సమయం. సమాజంలో దురాచారాలకూ కొదవలేదు. విదేశీ పాలకుల దుర్మార్గం ముందు సమాజం నిలబడలేని నిస్సహాయ స్థితిలో ఆ కాలంలో దేశం నలుమూలలా భక్తి ఉద్యమం ఉద్భవించింది. ఆ రోజుల్లో సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా భక్తి ఉద్యమాన్ని అందివ్వడంతో పాటు, ఆడంబరాలు, మూఢాచారాలు, పటాటోపాలకు దూరంగా సంస్కరణలను, సామాజిక సమతా ఫలాలను అందించిన మహాకవి సంత్‌ కబీర్‌దాస్‌.


సమతామూర్తి శ్రీరామానుజుల శిష్యుడు రామానందుడు. రామానందునికి ఉత్తర భారతంలో అనేక కులాల్లో అనేక మంది శిష్యులున్నారు. వారిలో కాశీకి చెందిన కబీర్‌దాస్‌, రవిదాస్‌ ప్రముఖులు. వీరిద్దరూ సమకాలీనులు.


తల్లి తండ్రులకు దూరమై అనాథగా ఉన్న శిశువును చేనేత వృత్తిలో ఉన్న ముస్లిం దంపతులు నీరు, నీమా పెంచి పెద్దచేశారు. కబీర్‌దాస్‌పై ముస్లిం, హిందూ సమాజాల రెండింటి ప్రభావం ఉంది. కబీర్‌ పెద్ద చదువులకు నోచుకోలేదు. చిన్ననాటి నుండే ఆయనలో ఆధ్యాత్మిక పిపాస పెంపొందింది. తెల్లవారు ఝామునే చీకట్లో గంగాస్నానం చేసి వస్తున్న రామానందుని కాళ్ళకు మెట్ల మధ్య కబీర్‌దాస్‌ దేహం తగిలింది. ‘రామ రామ’ రామానందుని నోటి నుండి వెలువడ్డ వాక్యాలే కబీర్‌దాస్‌కు ‘మంత్రోపదేశ’ మయింది.


కబీర్‌దాస్‌కు చిన్ననాటనే అనేక అద్భుతాలు కనబడ్డాయి. ఆకలిగా ఉన్న శిశు కబీర్‌కు ఆవులు స్వయంగా తమ పొదుగుల నుండి పాలను అందిచ్చేవట! తోటి బాలురకంటె భిన్నంగా కబీర్‌ జీవించాడు. చేనేత అతని కుటుంబ వృత్తి. ఆశువుగా కవిత్వం చెప్పేవాడు. కబీర్‌ ఆనాటి హిందూ, ముస్లిం, సిఖ్‌ ప్రజలను ఎంతగానో ప్రభావితం చేశాడు. ఎప్పుడూ సంపాదన కోసం తాపత్రయ పడలేదు.


కులము, మతము, పాండిత్యాలకు అతీతంగా అందరికీ అందుబాటులోకి భగవంతుణ్ణి తీసుకురావడం కబీర్‌దాస్‌ ప్రధాన జీవన లక్ష్యం. ఆడంబరాలు, పూజా పద్ధతులు, పాండిత్యాలు వంటివాటికి దూరంగా భక్తి భావంతో భగవంతునికి సమర్పించుకోవడం ఏకైక మార్గంగా కబీర్‌దాస్‌ జీవించాడు. పురాణపురుషులైన హనుమంతుడు, వశిష్ఠుడు, చారిత్రిక పురుషులైన గోరఖ్‌నాధ్‌, మక్దూమ్‌ జహారియా వంటి మహాపురుషుల దర్శనం పొంది వారితో ఆధ్యాత్మిక చర్చలు చేసినవాడు. కబీర్‌దాస్‌ మానవతావాది, అహింసావాది, సామాజిక సంస్కర్త, నిరాడంబర జీవనం, అత్యంత పరిమిత కోరికలు, అపరిగ్రహత, భగవత్‌ సమర్పిత జీవనం – ఇలా అనేక విశేషాలు వారి జీవనంలో దర్శనమిస్తాయి.


కబీర్‌దాస్‌ రచించిన 225 గీతాలు, 250 సఖిలు (రెండు పంక్తుల పద్యాలు) సిక్కుల పవిత్ర గ్రంథమైన ‘ఆదిగ్రంధసాహెబ్‌’ లో చేర్చబడ్డాయి. కబీర్‌దాస్‌ రచించిన అన్ని రచనలు కలిపి ‘బీజక్‌’ అనే గ్రంధరూపంగా సంకలనం అయ్యాయి. ‘కబీర్‌ గ్రంధావళి’, ‘కబీర్‌ వచనావళి’ పేరుతో 1930లో గ్రంథాలుగా వెలువడ్డాయి. కబీర్‌దాస్‌ చెప్పిన, ఎంపిక చేసిన 100 గేయాలను రవీంద్రుడు అనువాదం చేశారు. కబీర్‌దాస్‌ సాహిత్యం విదేశీ భాషల్లో సైతం అనువాదమయింది.


🌹 🌹 🌹 🌹 🌹


Comments


  • Facebook
  • Twitter
  • LinkedIn

©2023 by Dailybhaktimessages2. Proudly created with Wix.com

bottom of page