🌹. దేవీ నవరాత్రులు - నవ దుర్గలు సాధన - 2. బ్రహ్మచారిణి - గాయత్రీ దేవి. / Worship Maa Brahmacharini - Gayatri Mata on the second day of Navaratri 🌹
📚 . ప్రసాద్ భరద్వాజ
🌷. 2. బ్రహ్మచారిణి ప్రార్ధనా శ్లోకము :
దధానా కరపద్మాభ్యాం అక్షమాలాకమండలూ ।
దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ॥
🌷. గాయత్రీ దేవి ధ్యాన స్తోత్రము :
ముక్తావిద్రుమ హేమనీల ధవళచ్ఛాయైర్ముఖై స్త్రీక్షణైః
యుక్తామిందు నిబద్ధరత్నమకుటాం తత్త్వార్థవర్ణాత్మికాం !
గాయత్రీం వరదాభయాంకుశ కళాః శుభ్రం కపాలంగదాం
శంఖంచక్ర మదారవిందయుగళం హస్తైర్వహంతీంభజే !!
🌷. అలంకారము - నివేదనం : గాయత్రీ దేవి - కాషాయం లేదా నారింజ రంగు, కొబ్బరి అన్నం, పాయసాన్నం
🌷. మహిమ :
ఒక చేత జపమాల, మరో చేత జలపాత్ర ధరించిన బ్రహ్మచారిణీ మాత సాధకునిలో సదాచారాన్ని ప్రవేశపెడుతుంది. ఈమె నామస్మరణతో కర్మబంధాలు చెదిరిపోయి మోక్షం సంప్రాప్తిస్తుంది. శివుణ్ణి పతిగా పొందేందుకు తపించిపోయిన రాజకన్య . ఈమెను ఆరాధిస్తే మనస్సుకు ఏకాగ్రత కలుగుతుంది.
దుర్గామాతయొక్క నవశక్తులలో రెండవది ‘బ్రహ్మచారిణి’ స్వరూపము. ఈ సందర్భంలో ‘బ్రహ్మ’ అనగా తపస్సు. ‘బ్రహ్మచారిణి’ అనగా తపమాచరించునది. ‘వేదస్తత్త్వం తపోబ్రహ్మ’ – ‘బ్రహ్మ’ యనగా వేదము, తత్త్వము, తపస్సు. బ్రహ్మచారిణీదేవి స్వరూపము పూర్తిగా జ్యోతిర్మయము, మిక్కిలి శుభంకరమూ, భవ్యము. ఈ దేవి కుడిచేతిలో జపమాలను, ఎడమ చేతిలో కమండలాన్నీ ధరించి ఉంటుంది.
🌷. చరిత్ర :
హిమవంతుని కూతురైన పార్వతియే ఈ బ్రహ్మచారిణీ దేవి. ఈమె పరమేశ్వరుణ్ణి పతిగా పొందటానికి నారదుడి ఉపదేశాన్ని అనుసరించి ఘోరతపము ఆచరిస్తుంది. ఈ కఠిన తపశ్చర్య కారణానే ఈమెకు ‘తపశ్చారిణి’ అనగా ‘బ్రహ్మచారిణీ’ అనే పేరు స్థిరపడింది. తపశ్చర్యకాలములో ఈమె కేవలము ఫల, కంద మూలములను మాత్రమే ఆరగిస్తూ లెక్కలేనన్ని సంవత్సరాలు గడుపుతుంది. కేవలము పచ్చికాయగూరలనే తింటూ మరికొన్ని సంవత్సరాలూ, కఠినోపవాసములతో ఎలాంటి ఆచ్ఛాదనమూ లేకుండా ఎండలలో ఎండుతూ, వానలలో తడుస్తూ కొంత కాలంపాటూ తపస్సును ఆచరిస్తుంది. ఇలాంటి కఠినతరమైన తపస్సును ఆచరించిన తరువాత, మరింకెన్నో సంవత్సరాలపాటు నేలపై రాలిన ఎండుటాకులను మాత్రమే స్వీకరిస్తూ పరమేశ్వరుణ్ణి అహర్నిశలూ ఆరాధిస్తుంది. మెల్లిగా ఎండుటాకులనుకూడా తినటం మానివేసి ‘అపర్ణ’యై చాలాకాలంపాటు ఆహారమూ, నీళ్ళు కూడా ముట్టకుండా ఘోరమైన తపస్సును ఆచరిస్తుంది.
ఇలా చాలాకాలంపాటు కఠినమైన తపస్సును కొనసాగించటం కారణాన, బ్రహ్మచారిణిదేవి శరీరము పూర్తిగా కృశించి పోతుంది. ఈవిడ స్థితిని చూసి తల్లియైన మేనాదేవి ఎంతగానో దుఃఖిస్తుంది. ఈమెను ఈ కఠిన తపస్సు నుండి మరలించడానికి తల్లి ‘ఉ మా’ – ‘బిడ్డా! వలదు, వలదు’ అని పలికినందున, బ్రహ్మచారిణిదేవి పేరు ‘ఉమా’ అని ప్రసిద్ధి కెక్కింది.
బ్రహ్మచారిణీదేవి చేసిన ఘోరతపస్సు కారణాన, ముల్లోకాలలో హాహాకారాలు చెలరేగుతాయి. దేవతలూ, ఋషులూ, సిద్ధులూ, మునులూ మొదలైనవారందరూ ఈవిడ తపస్సు కనీవినీ యెరుగనటువంటి పుణ్యకార్యమని పలుకుతూ ఈవిడను కొనియాడతారు. చివరికి పితామహుడైన బ్రహ్మదేవుడు, అశరీరవాణి ద్వారా ఈమెను సంబోధిస్తూ ప్రసన్నమైన స్వరంలో ఇలా పలుకుతారు “దేవీ! ఇట్టి కఠోర తపస్సును ఇంతవరకునూ ఎవ్వర్రునూ ఆచరింపలేదు. ఇది నీకే సాధ్యమైనది. అలౌకికమైన నీ తపశ్చర్య సర్వత్ర శ్లాఘించబడుచున్నది. నీ మనోవాంఛ సంపూర్ణముగా నెరవేరును. చంద్రమౌళియైన పరమేశ్వరుడు అవశ్యముగా నీకు పతియగును. ఇక నీవు తపస్సును విరమించి ఇంటికి మరలుము. త్వరలోనే నీ తండ్రి నిన్ను ఇంటికి తీసికొనిపోవుటకై వచ్చును.“
దుర్గామాతయొక్క ఈ రెండవ స్వరూపము భక్తులకూ, సిద్ధులకూ అనంతఫలప్రదము. ఈమెను ఉపాసించటంవల్ల మానవులలో తపస్సూ, త్యాగమూ, వైరాగ్యమూ, సదాచారమూ, సంయమమూ వృద్ధి చెందుతాయి. జీవితంలో ఎలాంటి ఒడుదొడుకులు ఎదురైనా దేవి అనుగ్రహముతో వారి మనస్సులు కర్తవ్యమార్గం నుండి మరలవు. లోకమాత అయిన బ్రహ్మచారిణీదేవి కృపవలన ఉపాసకులకు సర్వత్ర సిద్ధీ, విజయాలూ ప్రాప్తిస్తాయి. దుర్గానవరాత్రి పూజలలో రెండవరోజున ఈమె స్వరూపము ఉపాసించబడుతుంది. ఈ రోజు సాధకుని మనస్సు స్వాధిష్ఠాన చక్రములో స్థిరమవుతుంది. ఈ చక్రంలో స్థిరమైన మనస్సుగల యోగి, ఈమె కృపకు పాత్రుడగుతాడు. అతనికి ఈమె యెడల భక్తి ప్రపత్తులు దృఢమవుతాయి.
🌹 🌹 🌹 🌹 🌹
Comentarios