🌹. దేవీ నవరాత్రులు - నవ దుర్గలు సాధన - 4. కూష్మాండ - లలితా త్రిపుర సుందరి దేవి / Worship Maa Kushmanda - Lalitha Tripur Sundari on the 4th day of Navaratri 🌹
📚 . ప్రసాద్ భరద్వాజ
🌷. కూష్మాండ దేవి ప్రార్ధనా శ్లోకము :
సురాసంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ ।
దధానా హస్తపద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తు మే ॥
🌷. శ్రీ లలితా ఆవిర్భావ స్తోత్రము :
విశ్వరూపిణి సర్వాత్మే విశ్వభూతైకనాయకి |
లలితా పరమేశాని సంవిద్వహ్నేః సముద్భవ
ఆనందరూపిణి పరే జగదానందదాయిని |
లలితా పరమేశాని సంవిద్వహ్నేః సముద్భవ
🌷. అలంకారము - నైవేద్యం : శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి - కుంకుమ రంగు, దద్దోజనం, క్షీరాన్నం
🌷. మహిమ :
జ్ఞానరూపిణి,సరస్వతీశక్తిగా స్తుతించబడే కూష్మాండ రూపంతో అలరారే దేవీమాత అభయముద్రలను ధరించి భక్తులను కాపాడుతుంది. నమ్మిన భక్తులకు బహురూపాలుగా కనిపించి రక్షిస్తుంది. ఆయుష్యును, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. సంసారమనే జగత్తు యొక్క అందాన్ని ఉదరాన ధరించే మాయారూపిణి .. ఈమె .
దుర్గామాత నాలుగవ స్వరూప నామము ‘కూష్మాండ’. దరహాసముతో అంటే అవలీలగా బ్రహ్మాండమును సృజించుతుంది కాబట్టి ఈ దేవి ‘కూష్మాండ’ అనే పేరుతో విఖ్యాతి చెందింది.
🌻. సాధన :
ఈ జగత్తు సృష్టి జరుగక ముందు అంతటా గాఢాంధకారమే అలముకొని ఉండేది. అప్పుడు ఈ దేవి తన దరహాసమాత్రంతో ఈ బ్రహ్మాండాలను సృజించింది. కాబట్టి ఈ స్వరూపమే ఈ సృష్టికి ఆదిశక్తి. ఈ సృష్టిరచనకు పూర్వము బ్రహ్మాండమునకు అస్తిత్వమే లేదు.
ఈమె సూర్యమండలాంతర్వర్తిని. సూర్య మండలంలో నివసింపగల శక్తిసామర్థ్యములు ఈమెకే గలవు. ఈమె శరీరకాంతిచ్ఛటలు సూర్యకిరణ ప్రభలలాగా దేదీవ్యమానముగా వెలుగొందుతూ ఉంటాయి. ఈమె తేజస్సు నిరుపమానము. దానికి అదే సాటి. ఇతర దేవతాస్వరూపాలేవీ ఈమె తేజః ప్రభావములతో తులతూగలేవు. ఈమె తేజోమండల ప్రభావమే దశదిశలూ వెలుగొందుతూ ఉంటుంది. బ్రహ్మాండములోని అన్ని వస్తువులలో, ప్రాణులలో ఉన్న తేజస్సు కూష్మాండ ఛాయయే.
ఈ స్వరూపము ఎనిమిది భుజాలతో విరాజిల్లుతూ ఉంటుంది. అందువల్లనే ఈమె ‘అష్టభుజాదేవి’ అనే పేరుతో కూడా వాసిగాంచింది. ఈమె ఏడు చేతులలో వరుసగా కండలమూ, ధనుస్సూ, బాణమూ, కమలమూ, అమృతకలశమూ, చక్ర గదలు తేజరిల్లుతూ ఉంటాయి. ఎనిమిదవ చేతిలో సర్వ సిద్ధులనూ, నిధులనూ ప్రసాదించే జపమాల ఉంటుంది. సింహవాహన. సంస్కృతంలో ‘కూష్మాండము’ అంటే గుమ్మడికాయ. కూష్మాండబలి ఈమెకు అత్యంత ప్రీతికరము. ఇందువల్ల కూడా ఈమెను ‘కూష్మాండ’ అని పిలుస్తారు.
నవరాత్రి ఉత్సవాలలో నాల్గవరోజు కూష్మాండాదేవీ స్వరూపమే దుర్గామాత భక్తుల పూజలను అందుకొంటుంది. ఈనాడు సాధకుని మనస్సు అనాహత చక్రంలో స్థిరమవుతుంది. కాబట్టి ఈ రోజు ఉపాసకుడు పవిత్రమైన, నిశ్చలమైన మనస్సుతో కూష్మాండాదేవి స్వరూపాన్నే ధ్యానిస్తూ పూజలు చేయాలి. భక్తులు ఈ స్వరూపాన్ని చక్కగా ఉపాసించడంవల్ల పరితృప్తయై ఈమె వారి రోగాలనూ, శోకాలనూ రూపుమాపుతుంది. ఈమె భక్తులకు ఆయుర్యశోబలములూ, ఆరోగ్యభాగ్యములు వృద్ధి చెందుతాయి. సేవకుల కొద్దిపాటి భక్తికే ఈ దేవి ప్రసన్నురాలవుతుంది. మానవుడు నిర్మల హృదయంతో ఈమెను శరణుజొచ్చిన వెంటనే అతి సులభముగా పరమ పదము ప్రాప్తిస్తుంది.
శాస్త్రాలలో, పురాణాలలో పేర్కొనబడిన రీతిలో విధివిధానమును అనుసరించి మనము దుర్గాదేవిని ఉపాసిస్తూ అనవరతము భక్తి మార్గంలో అగ్రేసరులమై ఉండాలి. ఈ తల్లి భక్తిసేవా మార్గంలో కొద్దిపాటిగానైనా పురోగమించగలిగిన సాధకునికి ఆమె కృపానుభవము అవశ్యము కలిగి తీరుతుంది. దాని ఫలితంగా దుఃఖరూప సంసారమంతా భక్తునికి సుఖదాయకమూ, సుగమమూ అవుతుంది. మనిషి సహజంగా భవసాగరాన్ని తరించడనికి ఈ తల్లియొక్క ఉపాసన అతి సులభమైన, శ్రేయస్కరమైన మార్గం. మనిషి ఆదివ్యాధులనుండీ సర్వదా విముక్తుడవటానికీ, సుఖసమృద్ధిని పొందటానికీ, ఉన్నతిని పొందటానికీ కూష్మాండా దేవిని ఉపాసించటమనేది రాజమార్గం వంటిది. కాబట్టి లౌకిక, పారలౌకిక ఉన్నతిని కాంక్షించేవారు ఈ దేవీస్వరూపంయొక్క ఉపాసనలో సర్వదా తత్పరులై ఉండాలి.
🌹 🌹 🌹 🌹 🌹
Comments