top of page
Writer's picturePrasad Bharadwaj

దేవీ నవరాత్రులు - నవ దుర్గలు సాధన - 6. కాత్యాయని దేవి - మహాలక్ష్మి దేవి / Worship Maa Katyayani - Ma


🌹. దేవీ నవరాత్రులు - నవ దుర్గలు సాధన - 6. కాత్యాయని దేవి - మహాలక్ష్మి దేవి / Worship Maa Katyayani - Maha Lakshmi on the 6th day of Navaratri 🌹


🌻 . ప్రసాద్ భరద్వాజ



🌷. కాత్యాయని దేవి ప్రార్ధనా శ్లోకము :


చందరహాసోజ్వలకరం శార్దూలవరవాహనా

కాత్యాయనీ శుభం దద్ద్యాద్దేవీ దానవ ఘాతినీ



🌷. శ్రీ మహాలక్ష్మి దేవి స్తోత్రము :


జయ పద్మపలాశాక్షి జయ త్వం శ్రీపతిప్రియే |


జయ మాతర్మహాలక్ష్మి సంసారార్ణవతారిణి


మహాలక్ష్మి నమస్తుభ్యం నమస్తుభ్యం సురేశ్వరి |


హరిప్రియే నమస్తుభ్యం నమస్తుభ్యం దయానిధే





🌷. అలంకారము - నైవేద్యం : శ్రీ మహాలక్ష్మి దేవి - గులాబీ రంగు - చక్కెర పొంగలి, క్షీరాన్నం




🌷. మహిమ :


దుర్గామాత ఆరవ స్వరూపం కాత్యాయని. పూర్వం ‘కత’ అనే పేరుగల ఒక గొప్ప మహర్షి ఉండేవాడు. అతని కుమారుడు ‘కాత్య’ మహర్షి. ఈ కాత్యగోత్రజుడే విశ్వవిఖ్యాతుడైన ‘కాత్యాయన’ మహర్షి. ఇతడు ‘పరాంబా’ దేవిని ఉపాసిస్తూ, ఎన్నో సంవత్సరాలు కఠినమైన తపస్సును ఆచరించాడు. భగవతీదేవి లేదా దుర్గాదేవి పుత్రికగా తన ఇంట జన్మించాలని అతని కోరిక. భగవతీ మాత ఆయన ప్రార్థనను అంగీకరిస్తుంది. కొంతకాలం తరువాత ‘మహిషాసురుడు’ అనే రాక్షసుని అత్యాచారాలతో భూలోకం పెచ్చరిల్లిపోతుంది. ఈ మహిషాసురుని సంహరించడానికై బ్రహ్మవిష్ణు మహేశ్వరులు తమ తమ తేజస్సుల అంశలతో ఒక దేవిని సృష్టిస్తారు. మొట్ట మొదట కాత్యాయన మహర్షి ఈమెను పూజిస్తారు. అందువలన ఈమె ‘కాత్యాయని’ అని ప్రసిద్ధికెక్కింది.



🌷. చరిత్ర :


ఈమె ‘కాత్యాయన’ మహర్షి ఇంట పుత్రికగా అవతరించిందని మరి ఒక కథ. ఈమె అమాంత భాద్రపద బహుళ చతుర్దశినాడు జన్మించింది (ఉత్తర భారత పౌర్ణిమాంత పంచాంగ సంప్రదాయమును బట్టి ఇది ఆశ్వీయుజ శుద్ధ చతుర్దశి). ఈమె ఆశ్వీయుజ శుక్ల సప్తమి, అష్టమి, నవమి తిథులలో కాత్యాయన మహర్షి పూజలందుకొని విజయదశమినాడు మహిషాసురుని వధించింది.


ఈమె సాక్షాత్తూ గాయత్రీ అవతారమేనని చెప్పబడింది. కాత్యాయనీ ఉపాసన వల్ల సంతాపాలు, భయాలు, అనుమానాలు దూరమవుతాయి. వేదవిద్య అబ్బుతుంది.



🌻. సాధన :


కాత్యాయనీ దేవి అమోఘ ఫలదాయిని. కృష్ణుడిని పతిగా పొందటానికి గోకులంలో గోపికలందరూ యమునానదీ తీరాన ఈమెనే పూజించారని భాగవతం చెబుతుంది. ఈమె గోకులానికి అధిష్ఠాత్రిగా వెలిసినది. ఈమె స్వరూపము దివ్యమూ, భవ్యమూ. ఈమె శరీరకాంతి బంగారు వన్నెతో తళతళ మెరుస్తూ ఉంటుంది. ఈమె నాలుగు భుజాలతో విరాజిల్లుతూ ఉంటుంది. ఈమె కుడిచేతులలో ఒకటి అభయముద్రనూ, మరొకటి వరదముద్రనూ కలిగి ఉంటుంది. ఈమె ఒక ఎడమ చేతిలో ఖడ్గమూ, మరొక ఎడమ చేతిలో పద్మమూ శోభిల్లుతూ ఉంటాయి. సింహవాహన.


దుర్గా నవ రాత్రులలో ఆరవరోజున కాత్యాయనీ స్వరూపం పూజింపబడుతుంది. ఆ దినాన సాధకుడి మనస్సు ఆజ్ఞా చక్రంలో స్థిరమవుతుంది. యోగసాధనలో ఈ ఆజ్ఞా చక్రం యొక్క స్థానం ప్రముఖమైనది. ఈ చక్రంపై స్థిర మనస్సుగల సాధకుడు తన సర్వస్వమును కాత్యాయనీ దేవి చరణాలలో సమర్పిస్తాడు. పరిపూర్ణంగా ఆత్మసమర్పణము చేసిన భక్తుడికి సహజంగానే కాత్యాయనీ మాత దర్శనం లభిస్తుంది.


ఈ దేవిని భక్తితో సేవించిన వారికి ధర్మ, అర్థ, కామమోక్షాలనే చతుర్విధ పురుషార్థముల ఫలములు లభిస్తాయి. అతడు ఈ లోకంలో అలౌకిక తేజస్సులను, ప్రభావములను పొందగలడు. రోగములు, శోకములు, సంతాపములు, భయము మొదలైనవి అతడినుండి సర్వదా దూరమవుతాయి.


జన్మజన్మాంతరాల పాపాలు నశించటానికి ఈ దేవి ఉపాసనకంటె సులభమైనా, సరళమైన మార్గం మరొకటి లేదు. ఈమెను ఆరాధించేవారు నిరంతరం ఈమె సాన్నిధ్యం నుండీ, పిమ్మట పరమపదప్రాప్తికీ అర్హులవుతారు. కాబట్టి మనము అన్ని విధాలా ఈ తల్లిని శరణుజొచ్చి, ఈమె పూజలందూ, ఉపాసన యందూ తత్పరులము కావాలి.

🌹 🌹 🌹 🌹 🌹





Comments


bottom of page