🌹. శ్రీ దుర్గా నవరాత్రి వ్రతం - సాధనాపర విశిష్టత 🌹
📚 . ప్రసాద్ భరద్వాజ
ప్రకృతిలోని చైతన్యశక్తి. ప్రకృతి స్వరూపాల నన్నింటినీ జీవుడు తన మనస్సులో లయం చేసి, ఒకే ఒక చైతన్య పర తత్త్వ శక్తియందు నిలిపితే జన్మసాఫల్యాన్ని పొందుతాడు. తనలో ఉండే ఆ చైతన్య శక్తి సర్వజీవులయందు ఉంటుందనే సత్యాన్ని గుర్తించి, చైతన్యాద్వైత శక్తిని అర్థం చేసికొంటే దివ్యానుభూతిని పొందుతాడు.
‘‘సర్వరోగోపశమనం సర్వోపద్రవ నాశనం శాన్తిదం సర్వారిష్టానాం నవరాత్ర వ్రతం శుభమ్’’
సర్వ రోగములను, సర్వ ఉపద్రవములను పోగొట్టి, సర్వారిష్టాల్ని పారద్రోలి సుఖశాంతుల్ని కటాక్షించేది- నవరాత్రి వ్రతం అని పేర్కొన్నది స్కాంధ పురాణం.
‘నవ’ అంటే తొమ్మిదని, క్రొత్త అని సామాన్యార్థాలు. కానీ, నవ అంటే పరమేశ్వరుడని, ‘రాత్రి’ అంటే పరమేశ్వరి అని నిర్ణయ సింధువు తెలుపుతోంది.
కనుక, నవరాత్రి వ్రతమంటే- పార్వతీ పరమేశ్వరుల, శివశక్తుల, ప్రకృతీ పురుషుల ఆరాధన లేక వ్రతము, పూజ అని అర్థము. నవరాత్రి వ్రతమంటే తొమ్మిది రాత్రులు చేయు వ్రతమని చెపుతారు. ‘‘సూయతే స్తూయతే ఇతి నవః’’ అనగా నవ శబ్దమునకు స్తుతిం పబడుచున్నవాడని అర్థము. పరమాత్మ ‘నవ’ స్వరూపుడు. శబ్దరూపమైన వేదం- ప్రకృష్టమైన ‘నవ్య స్వరూపం’. అదే ప్రణవ స్వరూపం. ‘‘నవో నవో భవతి జాయ మానః’’ పరమాత్మ నిత్య నూతనుడు. అందరి చేత స్తోత్రింపబడుచున్నవాడు. శివశక్తులకు భేదం లేదు. అం దుకే జగన్మాతకు ‘శివా’ అనే నామం కూడా ఉంది.
జగజ్జనని- ‘రాత్రి’ రూపిణి. పరమేశ్వరుడు-ప గలు. జగన్మాత ఆరాధనే- రాత్రి వ్రతం. రాత్రి దేవియే- మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి వంటి రూపనామములతో పూజింపబడుతోంది. అందుకే మాతకు ‘కాళరాత్రి’ అని పేరు. నవ అహోరాత్ర దీక్షగా రాత్రి, పగలు తొమ్మిది రోజులు చేస్తారు. ‘రాత్రి శబ్దస్య తిథి వాచకత్వాత్’ అనే దాన్ని బట్టి రాత్రి అనగా తిథి అని అర్థము తీసికొని తొమ్మిది తిథులు అనగా పాడ్యమి మొదలు నవమి వరకు శ్రీదేవికి పూజ చేస్తారు.
‘పాడ్యమి’ అంటే ‘బుద్ధి’ అని చెప్పబడింది. మనుష్యుల బుద్ధియే శారదాదేవి. పాడ్యమి నుండి శారదా దేవిని ఆరాధిస్తే మంచి బుద్ధిని ప్రసాదిస్తుంది. సర్వ శుభములను చేకూర్చుతుంది. మనలో ఉన్న ఉత్సాహాన్ని పైకి వ్యక్తీకరించటమే ‘ఉత్సవం’ అంటారు. ఇది పెద్ద ఉత్సవం- మహోత్సవం. ఇది- దేవీ శరన్నవరాత్రి పూజా మహోత్సవాల అంతరార్థం.
🌹 🌹 🌹 🌹🌹
Kommentare