🌹శ్రీ నారద మహర్షి విశిష్టత.🌹
నారద - నారం దదాతి ఇతి నారదః
జ్ఞానాన్ని ప్రసాదించే వాడు నారదుడు అని అర్థం.
బ్రహ్మ మానస పుత్రుడైన నారద మునీంద్రుడు నిరంతరం నారాయణ నామ స్మరణ చేస్తూ, ముల్లోకాలలో సంచరిస్తుంటాడు. కృత , త్రేత , ద్వాపర యుగలలోనూ , అన్ని పురాణములలోనూ కనిపించే లోక కళ్యాణకారకుడే శ్రీ నారదుడు. వీణాతంత్రులు మీటుతూ, నారాయణ నామాన్ని ఉచ్చరిస్తూ .. త్రిలోక సంచారం చేసే నారదుడే పరమాత్మ గుణానుభవంలో తన్మయత్మం పొంది ఎందరినో భగవద్భక్తులుగా .. వాల్మీకి, వ్యాసుడు, శుకుడు, ప్రహ్లాదుడు, ధ్రువుడు లాంటి మహా పురుషులను, మహా భక్తులుగా మలచి లోక కళ్యాణం గావించినవాడు నారదుడే.
నారదుడు పూర్వ జన్మలో దాసీపుత్రుడు. తల్లి ఐశ్వర్యవంతుడైన బ్రాహ్మణుడి ఇంటిలో ఊడిగం చేస్తుండటంతో తన తల్లి వెంటే యజమాని ఇంటికి వెళ్ళేవాడు. బ్రాహ్మణులు వేద వేదాంగాలను చదువుతూంటే తాను వింటూ ఆ పరిసరాల్లో స్వేచ్ఛగా తిరిగేవాడు. ఒకసారి కొంతమంది సన్యాసులు చాతుర్మాస్య దీక్ష గడపడానికి ఆ ఇంటికి రాగా , వారికి సేవలు చేస్తూండమని యజమాని నారదుడికి పురమాయించాడు.
సన్యాసులు పిల్లవాడైన నారదుడి సేవలకు ముచ్చట పడి దీక్షాకాలం పూర్తయి వెళ్ళిపోతూ నారదుణ్ని వాత్సల్యంతో పక్కన కూర్చోబెట్టుకుని ద్వాదశాక్షరీ మహామంత్రాన్ని, ప్రణవాన్ని ఉపదేశించి , మాయ, సత్యం తదితరాల గురించి బోధించారు. ఆ బోధనలు నారదుడి మనసులో బలంగా నాటుకున్నాయి. కాలక్రమంలో పాముకాటుతో తల్లి చనిపోయాక ‘లోక సంచారం చేస్తూ ఈశ్వరాన్వేషణ చేస్తూ జీవనం గడిపేస్తాను’ అనుకుని అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ క్రూరసర్పాలు, ప్రాణులను చూసినా ‘ఈ లోకమంతటా నిండి ఉండి శాసించే శ్రీమన్నారాయణుడు అందరికీ అండగా ఉండగా నాకే ఆపదా రాదు. నాకేమిటి భయం?’ అనుకుని ఒక రావిచెట్టు కింద కూర్చుని ద్వాదశాక్షరీ మంత్రాన్ని తదేకంగా జపిస్తున్నాడు. ఆ సమయంలో ఒక మెరుపులా శ్రీమన్నారాయణుడి దర్శనం లీలామాత్రంగా అయింది. అశరీరవాణి పలుకుతూ ఈ జన్మలో సత్పురుషులతో తిరిగిన అదృష్టం వల్ల, నీకు లీలామాత్ర దర్శనం ఇచ్చాను. నీవు చూసిన రూపాన్ని బాగా చూడాలని కోరుకుంటూ, నా గురించే చెబుతూ, పాడుతూ, మాట్లాడుతూ ప్రకృతి ధర్మాన్ననుసరించి ఒకరోజున ఈ శరీరాన్ని వదిలేస్తావు. ఆ తరవాత నీవు బ్రహ్మదేవుడి కుమారుడిగా , నాకు మనవడిగా జన్మిస్తావు. ఆనాడు నీకు ’మహతి’ అనే వీణను బహూకరిస్తాను. దానిమీద నారాయణ స్తోత్రం చేస్తూ స్వేచ్ఛగా లోకాల్లో విహరిస్తావని శ్రీమన్నారాయణుడు వరాన్ని ఇస్తాడు.
ఆయన చెప్పినట్టుగానే కల్పాంతం తరవాత తన కుమారుడిగా నారదుణ్ని సృష్టించాడు బ్రహ్మ. అనంతరం ,మహతి అనే వీణను విష్ణువు ఇవ్వగా... ఆ వీణతో నారాయణ నామం చెప్పుకొంటూ లోకమంతటా స్వేచ్ఛగా తిరుగుతూ వైకుంఠం , సత్యలోకం, కైలాసం... ఇలా ఎక్కడికి వెళ్ళినా లోక సంక్షేమాన్ని ఆవిష్కరించేవాడు. భగవంతుడి శక్తి గురించి మాట్లాడేవాడు. దేవతలు, రాక్షసులు అనే తేడా లేకుండా అందరికీ ఉపదేశాలు చేసేవాడు. అందువల్ల నారదుణ్ని దేవతలు, రాక్షసులు సైతం గౌరవించేవారు. జగత్కల్యాణం కోసం పాటుపడుతూ అన్ని యుగాల్లో, లోకాల్లో, సమాజాల్లో, కార్యాల్లో నిరాటంకంగా ప్రవేశించి పనులు చక్కబెట్టేవాడు. భక్తి సూత్రాలను రచించి దాని గొప్పతనాన్ని లోకానికి చాటి చెపుతూ , భగవంతుడి గురించి, విశేషాలు, ఈ బ్రహ్మాండాల ఉత్పత్తిని , ఆయన్ను నమ్ముకున్న భాగవతుల గురించి, వారి వెంట నడిచిన భక్తుల వృత్తాంతాల గురించి , వీటిని చదివిన, విన్న వారందరూ తరించిపోవాలని భవిష్యత్ తరాలకు ఎన్నో ఆదర్శ చరిత్రలను , స్ఫూర్తిదాయకులను లోకాలకు అందించిన లోక కళ్యాణ నాయకున్ని ఆరాధించిన వారికి ఆధ్యాత్మిక చింతన , విజ్ఞాన పరిజ్ఞానం పెరుగుతుందని శాస్త్ర వచనం.
🌹🌹🌹🌹🌹
Comments