top of page
Writer's picturePrasad Bharadwaj

శరన్నవ రాత్రి శుభాకాంక్షలు - Good Wishes on Devi Navarti


🌹. శరన్నవ రాత్రి శుభాకాంక్షలు అందరికి. Devi Navarti Good Wishes to All.


🙏. ప్రసాద్‌ భరధ్వాజ


15-10-2023 to 24-10-2023


🍀. దేవీ నవరాత్రులు - నవ దుర్గల విశిష్టత 🍀


నవరాత్రి సమారాధ్యాం నవచక్ర నివాసినీం నవరూప ధరాం శక్తిం, నవదుర్గాముపాశ్రయే


నవరాత్రులలో ఆరాధింప దగినది, (శ్రీ చక్రం లోని) నవచక్రాలలో నివసించేది, శక్తి రూపిణి, అయిన నవదుర్గను ఆశ్రయిస్తున్నాను.


ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణీ |తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకమ్ పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీతి చ | సప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టమమ్ నవమం సిద్ధిదాత్రీ చ నవదుర్గాః ప్రకీర్తితాః | ఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా ||


దుర్గా మాత ముఖ్యమైన అవతారాలు మూడు. మాహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి. వీరు శ్రీమహావిష్ణువు, పరబ్రహ్మ, పరమశివుని అర్ధాంగినులుగా మనకు తెలుసు. వీరిలో ఒక్కొక్కరూ తిరిగి 3 అవతారాలు పొందారు. ఆ విధంగా నవదుర్గలుగా ప్రసిద్ధి చెందారు.



🌻 1. శైలపుత్రి :- బాలా త్రిపుర సుందరి


నవదుర్గలలో ప్రధమమైన శైలపుత్రి హిమవంతుని పుత్రిక. ఈమెయే వెనుకజన్మలో దక్షప్రజాపతి కుమార్తె సతి. హిమవంతుడు పర్వతరాజు. కనుక ఈమెకు శైలపుత్రి అనే పేరు కలిగింది. ఈమె వాహనం నంది. ఒక చేతిలో త్రిశూలం రెండో చేతిలో కలువ, నుదుటిన చంద్ర వంక ధరించిన ఈమె మహిమలు అపారం. నవరాత్రి సంధర్భంగా మొదటిరోజున ఈమె పూజ జరుగుతుంది.



🌻 2. బ్రహ్మచారిణి :- గాయత్రీ దేవి


దుర్గామాత అవతారాలలో రెండవది అయిన బ్రహ్మచారిణి, తపస్సుకు ప్రతీక. ఇక్కడ బ్రహ్మ అనే పదానికి తపస్సు అని అర్థం. వేదము, తత్వము, తపము అనే పదాలు బ్రహ్మ అనే పదానికి పర్యాయ పదాలుగా వాడుతారు. ఒక చేతిలో కమండలము, మరొక చేతిలో తులసి మాల ధరించే ఈమెను సకల సౌభాగ్యదాయనిగా పూజిస్తారు.



🌻 3. చంద్రఘంట :- అన్నపూర్ణ దేవి


దుర్గామాత మూడవ అవతారమైన చంద్రఘంట మాత శిరసున అర్ధచంద్రుడిని గంటరూపంలో ధరించింది. అందువలననే ఆమెకి ఈ నామధేయం కలిగింది. సింహవాహిని ఐన ఈమె బంగారు దేహఛాయ కలిగి, పది హస్తాలతో ఉంటుంది. ఈమె పది హస్తాలలో శంఖ, ఖడ్గ, గద, కమండలము, విల్లు, కమలం మొదలైనవి కలిగి చూడటానికి ఎంతో మనోహరంగా ఉంటుంది.



🌻 4. కూష్మాండ :- శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి


సూర్యలోక నివాసిని అయిన కూష్మాండదేవి, సూర్యకాంతిని పోలిన దేహఛాయతో ఉంటుంది. ఈమె దేహఛ్ఛయతో దశ దిశంతాలు వెలుగు పొందుతాయి. సింహవాహిని ఐన ఈ దేవికి ఎనిమిది హస్తములలో కమండలము, విల్లు, అమ్ము, కమలము, అమృతభాండము, చక్రము, త్రిశులము, జపమాల ఉంటాయి.



🌻 5. స్కందమాత :- సరస్వతీదేవి


కుమారస్వామి లేక స్కందుని తల్లి అయిన స్కందమాత మహాదుర్గ ఐదవ అవతారం. చతుర్భుజి ఐన ఈ మాత రెండు చేతులలో కమలములనూ కుడి హస్తమందు స్కందుని ధరించి అభయ హస్తి అయి దర్శనమిస్తుంది. ఈమె పద్మములో కూర్చొని ఉండటం చేత పద్మాసన అనే నామధేయం కూడా ఉంది.



🌻 6. కాత్యాయని :- మహాలక్ష్మి దేవి


దుర్గామాత ఆరవ అవతారమైన కాత్యాయనిమాతను సకల వరప్రదాయనిగా పూజిస్తారు. శ్రీకృష్ణుని భర్తగా పొందటానికి గోపికలు ఈమెనే ఆరాధించారు. బంగారు మేనిఛాయతో, అత్యంత ప్రకాశవంతమైన ఈమెకు నాలుగు హస్తములు. ఒక చేత కత్తి, రెండవ చేత కమలం, మిగిలిన రెండుచేతులలో అభయప్రదాన ముద్రలో ఉంటుంది. ఈమె వాహనం సింహం.



🌻 7. కాళరాత్రి :- దుర్గాదేవి


దుర్గమాత ఏడవ అవతారం కాళరాత్రి. ఈమె శరీరఛాయ చిమ్మచీకటిలా నల్లగా ఉంటుంది. చెదరిన జుట్టుతో, మెడలో వాసుకొనిన మాల మెరుపులు చిందిస్తూ ఉంటుంది. ఈమెకు మూడు కళ్ళు. ఈమె ఉచ్వాస నిశ్వాసలు అగ్నిని విరజిమ్ముతుంటాయి. ఈమెకు నాలుగు హస్తములు. కుడి రెండు హస్తములలో ఒకటి అభయాన్ని, రెండవది భాయాలని పారదోలేవిగా ఉంటాయి. ఎడమచేతిలో ఒక చిన్న కత్తి, ఇనుముతోచేసిన రంపంలాంటి అయుధం ఉంటుంది. ఈమె వాహనం గాడిద. ఈమె రూపం ఉగ్రమే ఐనా ఈమెని పూజించిన వారికి అన్ని శుభములని కూరుస్తుంది కనుక ఈమెనే శుభంకరి అని కూడా పిలుస్తారు.



🌻 8. మహాగౌరి :- మహిషాసురమర్ధిని దేవి


దుర్గామాత అష్టమ అవతారం మహాగౌరి. ఈమె చంద్రునిపోలిన మేనిఛాయతో ఉంటుంది. ఈమె పార్వతి రూపంలో ఉన్నప్పుడు, శివునికోసం మహాతపస్సు చేసింది. అప్పుడు ఆమె శరీరఛ్ఛాయ నల్లగా మారిపోయింది. అది గమనించిన మహాశివుడు స్వయంగా ఆమెను పవిత్ర గంగాజలాలతో కడగగా ఆమెకు ఆ మేనిఛ్ఛాయ కలిగిందని ఒక కథ. సర్వకాల సర్వావస్తలలో ఈమెను ఎనిమిది ఏళ్ళ బాలికగానే పూజిస్తారు. అత్యంత ప్రశాంతమైన స్వరూపం కలిగిన ఈమెకు నాలుగు చేతులు. రెండు చేతులలో త్రిశులం, దమరుకము ధరించి మిగిలన రెండుచేతులతో వర, అభయ ముద్రలతో దర్శనమిస్తుంది. ఈమె వాహనం నంది.



🌻 9. సిద్ధిదాత్రి :- రాజరాజేశ్వరీ దేవి


దుర్గాదేవి ఆఖరి అవతారమైన ఈమె భక్తులకు అష్టసిద్దులను (అనిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రకామ్య, ఇసిత్వ, మరియు వాసిత్వ అనేవి అష్టసిద్ధులు) ప్రసాదించగలిగే దేవత. కమలంలో కూర్చునే ఈ దేవత వాహనం సింహం. నాలుగు హస్తాలలో శంఖ, చక్ర, గదా, పద్మాలతో విరాజిల్లుతూ భక్తులను అనుగ్రహిస్తుంది.


🌹 🌹 🌹 🌹 🌹




Comments


bottom of page