top of page
Writer's picturePrasad Bharadwaj

Greetings on Holi Festival, Vasanta Purnima, Phalguna Purnima, Lakshmi Jayanti



🌹🎨 హోళీ పండుగ, వసంత పూర్ణిమ, ఫాల్గుణ పూర్ణమి, లక్ష్మీ జయంతి శుభాకాంక్షలు అందరికి / Greetings on Holi Festival, Vasanta Purnima, Phalguna Purnima, Lakshmi Jayanti to All. 🎨🌹


ప్రసాద్‌ భరధ్వాజ


🎨. హోళికా పూర్ణిమ / కాముని పూర్ణిమ ఎందుకు ? 🎨


🍀🎨. హోలీ పండగ.. ఈ రంగుల పండగ విశిష్టత ఏంటి..ఎలా జరుపుకోవాలి..? 🎨🍀


తెలుగు నెలల్లో చివరిది ఫాల్గుణ మాసం. హోళి పర్వదినం ప్రతి సంవత్సరం ఫాల్గుణ పౌర్ణమి రోజున జరుపుకుంటారు. చతుర్దశి నాడు కాముని దహనం జరిపి మరుసటి రోజు పాల్గుణ పౌర్ణమి రోజు హోళి పండుగను జరుపుకుంటారు. వసంత కాలంలో వచ్చే పండుగ కాబట్టి పూర్వం ఈ పండుగను 'వసంతోత్సవం' పేరిట జరుపుకునేవారు. దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో ఇదీ ఒకటి. ఈ పండుగ సత్య యుగం నుంచి జరుపుకుంటున్నట్లు హిందూ పురాణాలు తెలుపుతున్నాయి. హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. ఈ పండుగను హోళికా పూర్ణిమ, కాముని పూర్ణిమ, ఫాల్గుణ పౌర్ణమి, హుతాశనీ పూర్ణిమా, వహ్యుత్సవం, వసంతోత్సవం అను పేర్లతో కూడా పిలుస్తారు.


🍀. పురాణాలు ఏం చెబుతున్నాయి ? 🍀


రాక్షసులకు రాజైన హిరణ్యకశ్యపుడు, తనను మాత్రమే పూజించాలని ఆజ్ఞాపించ దీనికి విరుద్ధంగా, హిరణ్యకశ్యపుడి సొంత పుత్రుడైన ప్రహ్లాదుడు, భగవంతుడైన విష్ణువుకు భక్తుడు. హిరణ్యకశ్యపుడు పలు మార్లు బెదిరించినప్పటికి, ప్రహ్లాదుడు భగవంతుడైన విష్ణువుని ప్రార్థించేవాడు. హిరణ్యకశ్యపుడు తన కొడుకును చంపాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చివరిగా, ప్రహ్లాదుడిని హిరణ్యకశ్యపుడి యొక్క సోదరి అయిన హోలిక ఒడిలో చితిలో కూర్చోవాలని ఆజ్ఞాపించాడు, ఎందుకంటే మంటల నుండి రక్షించే శాలువాను ఆమె ధరించడం వలన ఆమెకి ఎలాంటి హాని జరగదు. ప్రహ్లాదుడు తన తండ్రి ఆదేశాలను వెంటనే అంగీకరించి, తనను రక్షించమని విష్ణువును వేడుకుంటాడు. మంటలు మొదలైనప్పుడు అందరూ చూస్తుండగానే హోలిక శాలువా ఎగిరి పోవడం వలన ఆమె దహనం అవుతుంది ఆ శాలువా ప్రహ్లాదుడిని కప్పడం వలన అతడికి ఎటువంటి హాని జరగదు. హోలిక మంటల్లో కాలిపోవటం వల్ల మనం హోలీను జరుపుకుంటున్నాము.


ఇంకొందరు ఫాల్గుణ పౌర్ణమి నాడు కాముని పున్నమి పేరిట సంబరాలు జరుపుకుంటారు. సతీవియోగంతో విరాగిలో మారిన పరమేశ్వరుడికి హిమవంతుని కుమార్తెగా జన్మించిన పార్వతితో వివాహం జరిపించాలని దేవతలు నిర్ణయించారు. దీంతో పార్వతీదేవిపై పరమశివుడి దృష్టి నిలిచేలా చేయమని మన్మథుని సాయం తీసుకున్నారు. మన్మథుడు శివుడిపైకి పూల బాణాన్ని ప్రయోగించి, తపోభంగం కలిగించాడు. తపో భంగంతో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన శివుడు మూడో కన్ను తెరిచి మన్మథున్ని భస్మం చేస్తాడు. అలా కోరికలు దహింపజేసిన రోజు కావడం వల్ల ఆ రోజు కామదహనం పేరుతో మన్మథుడి బొమ్మను గడ్డితో చేసి తగులబెడతారు. మన్మథుడు శివుని తపోభంగం చేసినపుడు శివుడు మూడవ కంటితో దహించిన రోజు కనుక కాముని పూర్ణిమ అని అంటారు. హోలిక అనే రాక్షసి చంపబడినందున హోళికా పూర్ణిమ అని అంటారు. హోలికా, హోళికాదాహో అనే నామాలతో దీనిని పేర్కొంటున్నది స్మృతి కౌస్తుభము. కామదహనమనే పేరునూ వింటాము. హుతాశనీ పూర్ణిమా, వహ్యుత్సవం అని కూడా దీనిని అంటారు.


ఈనాడు లక్ష్మీనారాయణ వ్రతం, అశోక పూర్ణిమా వ్రతం, ధామత్రి రాత్ర వ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణి, శయన దాన వ్రతం చేస్తారని పురుషార్థచింతామణి, శశాంక పూజ చేస్తారని నీలమత పురాణం, చంద్రపూజ విషయం ప్రత్యేకం గమనింప తగింది. కొన్ని గ్రంథాలు దీనిని డోలా పూర్ణిమ అంటున్నాయి. ఈనాడు లింగ పురాణమును దానం చేస్తే శివలోక ప్రాప్తి కలుగునని ఫాల్గుణశుద్ధ పూర్ణిమను తెలుగువారు కాముని పున్నమ అంటారు. అది అరవవారి పంగుని ఉత్తిరమ్.


ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ నాడు చంద్రుడు ఉత్తర ఫల్గునీ నక్షత్రంతో ఉంటాడనేది మనకు తెలిసిందే. ఈ వండుగతో శీతాకాలం వెనుకబడి వసంత ఋతువు లక్షణాలు పైకొంటాయి. చలి తగ్గు ముఖంలో ఉంటుంది. ఉక్కపోత ఇంకా ప్రారంభం కాదు. సూర్యుడు బాగా ప్రకాశిస్తూ హితవై ఉంటాడు. అన్నిపంటలు ఇంటికి వస్తాయి. కర్షకుడికి కడుపు నిండా తిండి దండిగా దొరికే రోజులు అంతా ఆనందం గోవిందంగా ఉంటుంది. వస్తూ వున్న వసంత ఋతువుకు స్వాగతోపచారాలు చేసే సమయం.


🍀. శాస్త్రీయ కారణాలు - సహజమైన రంగులు 🍀


శాస్త్రీయ కారణాల గురించి చెప్పుకుంటే వసంత కాలంలో వాతావరణం చలి నుంచి వేడికి మారుతుంది. దీనివల్ల వైరల్ జ్వరం, జలుబు లాంటి వ్యాధులు ప్రబలుతాయి. కాబట్టి కొన్ని ఔషధ మొక్కల నుంచి తయారు చేసిన సహజమైన రంగులు కలిపిన, నీటిని చల్లుకోవడం వల్ల ఈ వ్యాధుల వ్యాప్తి తగ్గుతుందనేది ఒక వాదన. కుంకుమ, పసుపు, బిల్వాలను ఉపయోగించి ఆయుర్వేద వైద్యులు ఔషధ వనమూలికలను తయారు చేస్తారు. తడి రంగుల కోసం, మోదుగ పువ్వుల్ని రాత్రంతా మరిగించి అవి పసుపు రంగులోకి మారేంత వరకు ఉంచుతారు, అది ఔషధ లక్షణాలు కలిగి ఉంటుంది. అందుకని సహజమైన రంగు పొడులను చల్లుకోవడం వల్ల ఔషధముగా పనిచేస్తుందని అర్థం.


🌹 🌹 🌹 🌹 🌹



Comments


bottom of page