top of page

Kalratri కాళరాత్రీ Tritara త్రిరాత్ర Saraswati సరస్వతీ

  • Writer: Prasad Bharadwaj
    Prasad Bharadwaj
  • Oct 9, 2024
  • 5 min read

ree

నేటి నుండి మూడు రోజులు దేవి త్రిరాత్ర వ్రతం ప్రారంభం....!!


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸


త్రిరాత్ర వ్రతదీక్ష అంటే ఏమిటి..?


సప్తమి, అష్టమి, నవమి తిథులలో పాటించే దీక్షను ‘త్రిరాత్ర వ్రతదీక్ష’ అని పిలుస్తారు.


ఆ జగన్మాత దయతోనే సర్వ జగత్తూ నడయాడుతోంది...


ఆ అమ్మ కరుణావల్లి, ఆ తల్లి అమృతహృదయ, ఆమె చల్లని చూపులకోసం ముల్లోకాలు ఎదురు చూస్తుంటాయి...


అందుకే ఆరాధించడానికి తిథి, వార, నక్షత్రాలు లేకపోయినా ఈ ఆశ్వీయుజమాసాన వచ్చే శుద్ధ పాడ్యమి మొదలుకుని నవమి వరకు ఆ తల్లిని కొలిచినవారికి కోటిజన్మలలోని పాపరాశి భస్మమవడమే కాదు, తుదిలేని పుణ్యరాశి లభ్యమౌతుందట.


అందుకే సజ్జనులందరూ ఈ జగాలనేలే జగన్మాత వ్రతాన్ని ఆచరించడానికి వెయ్యి కనులతో ఎదురు చూస్తుంటారని అలా చూసి అమ్మ వ్రతాన్ని ఆచరించిన వారికి కోరుకున్న కోరికలన్నీ సిద్ధిస్తాయని 'దేవీభాగవతం' చెబుతోంది...


ఈ వ్రతరాజాన్నే దుర్గాదేవి వ్రతమని, కుమారీ పూజ అనీ అంటారు. ఈ చల్లని తల్లిని మనలోని తిమిరాంధకారాన్ని పారద్రోలమని రాత్రివేళ అర్చించడం సంప్రదాయం. అందుకే ఈ రాత్రిళ్లను శరన్నవ రాత్రులుగా కూడా అభివర్ణిస్తారు.


ఈ తల్లి శక్తి అనంతం , అనిర్వచనీయం. మహిమోపేతం. శరన్నవరాత్రులలో తల్లిని తొమ్మిది


(9) రకాలుగా అర్చించి పూజిస్తారు.


మూడు కన్నులతో, పదహారు చేతులతో త్రిశూలాన్ని ధరించి ఉంటుంది.


1. పాముల కంకణాలతో , నల్లని కంఠంతో, నల్లని వర్ణంతో కనిపించే తల్లిని షోడశ భుజ దుర్గాదేవిగా,


2. ఎనిమిది చేతులతో మహిషి (ఎద్దు) తలమీద ఎక్కి బంగారు వర్ణంతో కనిపించే అమ్మను వనదుర్గాదేవిగా,


3. రుద్రాంశతో సింహవాహన రూఢిగా శ్యామల వర్ణంతో సర్వభూషణ శోభితంగా దర్శనం ఇచ్చే తల్లి నిరుద్రాంశ దుర్గాదేవిగాను,


4. వివిధ మణిమయ భూషణాలతో సింహ వాహనాన్ని ఎక్కిన త్రిశూలినీ దుర్గాదేవి స్వరూపంగా,


5. అష్టభుజాలతో, చంద్రరేఖను ధరించిన శిరస్సులో మూడు కళ్ళతో ప్రకాశించే అగ్ని దుర్గాదేవి స్వరూపంగా ,


6. సింహ వాహనంతో జయ దుర్గాదేవిగా ,


7. మెరుపు తీగ లాంటి స్వర్ణ వర్ణ మేని ఛాయతో, స్వర్ణ కమలం మీద ఆశీనురాలై, ఇంద్రాది దేవతలందరిచేత స్తుతించబడే వింధ్యావాసిని దుర్గాదేవి స్వరూపంగా,


8. ఎర్రని శరీర వర్ణంతో కూడి చేత తర్జనీముద్రని , ఎడమ చేత త్రిశూలాన్ని ధరించి భయంకర స్వరూపంతో రిపుమారిణి దుర్గాదేవి స్వరూపంగా,


9. తెల్లని శరీర వర్ణంతో , మూడు కళ్ళతో ప్రసన్నమైన ముఖంతో ప్రకాశిస్తుంది. కుడివైపు చేతుల్లో అభయముద్ర చక్రాలను ఎడమవైపు నడుంమీద ఒకచేతిని , మరో చేత శంఖాన్ని ధరించి విష్ణు దుర్గాదేవి స్వరూపంగానూ జగన్మాతను కొలుస్తారు.


ఇలా శరన్నవ రాత్రులలో అమ్మను కొలిచిన వారికి సర్వాభీష్టాలు కలుగుతాయి. ఇలా తొమ్మిదిరోజుల వ్రతం పాటించలేనివారు సప్తమి, అష్టమి, నవమి తిథులలో దీక్ష పాటిస్తారు. దీనిని ‘త్రిరాత్ర వ్రతదీక్ష’ అని పిలుస్తారు.


ఇంకొందరు అమ్మ వ్రతంలో భాగంగా బొమ్మల కొలువును తీర్చిదిద్ది చిన్ని పిల్లలకు పప్పు బెల్లాలు, శనగగుగ్గిళ్ళు , ముతైదువులకు పసుపుకుంకుమలతో పండ్లు, తాంబూలాలు పంచుకొంటారు...


నిత్య పూజలు ఆచరిస్తూ, నిత్య నైవేద్యాలు చేస్తూ సుమంగళీ వ్రతాలు, కుంకుమార్చనలు, పుష్పాలంకరణలు, మొదలైనవన్నీ ఈ నవరాత్రి వేడుకల్లో భాగాలై కనులపండువను , భక్తులను ఆనందపరవశులను చేస్తాయి.


అష్టమిని.. అంటే, దుర్గాష్టమిని మహాష్టమి అని కూడా అంటారు.


ఆ రోజంతా అష్టమి తిథి ఉంటే దుర్గాష్టమి, అలా కాకుండా అష్టమి వెళ్లి ఆనాడే నవమి తిథివస్తే దానిని మహాష్టమి అంటారు.


ఈ దుర్గాష్టమి రోజున అమ్మవారిని సహస్ర నామాలతో , కుంకుమార్చనలతోనూ అర్చిస్తే , సత్సంతాన భాగ్యం కలుగుతుంది.


ఈ దుర్గాష్టమి రోజు లలితా సహస్ర నామం పఠించేవారికి ఎలాంటి భయాలు దరిచేరవని చెపుతారు


నవరాత్రి దీక్షలో మహానవమి మఖ్యమైనవి. మంత్రసిద్ధి జరిగే ఈ రోజుని ‘సిద్దిదా’ అని పిలుస్తారు.


నవమి రోజున మహార్నవమి అంటూ పూజ చేస్తారు, పూర్వకాలంలో జైత్రయాత్రలకు వెళ్ళే రాజులు , చక్రవర్తులు నవమి రోజున ఆయుధ పూజలు చేసేవారు.


అలా చేయడంవల్ల వారికి విజయం సంప్రాప్తించేది, కాలక్రమంలో అదే ఆచారం నేటికీ కొనసాగుతోంది. ఆ రోజు వాహనాలు, యంత్రాలున్నవారు సహస్రనామ పూజగానీ, అష్టోత్తర శతనామ పూజ కానీ చేయడం శ్రేయస్కరం.


దశమి రోజున శమీ పూజ చేస్తారు, దీనిని అపరాజిత పూజ అని కూడా పిల్వడం జరుగుతోంది. ‘శమి’ అంటే జమ్మి చెట్టు, ఈ రోజున జమ్మి చెట్టును పూజిస్తారు.


పాండవులు అజ్ఞాత వాసానికి వెళుతూ తమ ఆయుధాలను జమ్మి చెట్టు తొర్రలో దాచారట. ఉత్తర గోగ్రహణ సమయంలో అర్జునుడు తన గాండీవాన్ని జమ్మి చెట్టుమీద నుంచే తెచ్చుకున్నాడట.


తమ కోర్కెలు నెరవేరాలని కోరుకునేవారు తమ గోత్ర నామాలతో శమీపూజ చేయించుకోవడం శ్రేయస్కరం. శమీ పాపాలను నశింపజేస్తుంది. శత్రువులను సంహరిస్తుంది. అంటే శత్రుపీడన లేకుండా చేస్తుంది..స్వస్తి...


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸





ree

09/10/2024 7వ రోజు శ్రీ శైలంలో "దేవీ కాళరాత్రీ" గా దర్శనం


🍅🍅🍅🍅🍅🍅🍅


శ్లో𝕝𝕝 ప్రధమం శైలపుత్రిణి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కంధమాతేతి, షష్ఠమం కాత్యాయనీతి చ, సప్తమం కాళరాత్రంచ, మహాగౌరేతి చాష్టమం నవమం సిద్ధితి ప్రోక్త, నవదుర్గ ప్రకీర్తిత||


"దేవీ కాళరాత్రీ" ధ్యాన శ్లోకం


శ్లో𝕝𝕝 ఏకవేణీ జపాకర్ణపూర నగ్నా ఖరాస్థితా| లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్తశరీరిణీ| వామపాదోల్లసల్లోహలతాకంటకభూషణా | వర్ధనమూర్ధ్వజా కృష్ణా కాలరాత్రిర్భయంకరీ ||


"కాళరాత్రి" శరీరవర్ణము గాఢాంధకారము వలె నల్లనిది. తలపై కేశములు చెల్లాచెదురై యుండును. మెడలోని హారము విద్యుత్కాంతులను విరజిమ్ము చుండును. ఈమె త్రినేత్రములు బ్రహ్మాండములవలె గుండ్రనివి. ఈమె నాశికా శ్వాస ప్రశ్వాసలు భయంకరములైన అగ్నిజ్వాలలను వెడలగ్రక్కుచుండును. ఈమె వాహనము గార్దభము. ఈమె తన ఒక కుడిచేతి వరముద్ర ద్వారా అందఱికిని వరములను ప్రసాదించుచుండును. మఱియొక కుడిచేయి అభయ ముద్రను కలిగియుండును. ఒక ఎడమచేతిలో ఇనపముండ్ల ఆయుధము, మఱొక ఎడమచేతిలో ఖడ్గము ధరించియుండును.


కాళరాత్రి స్వరూపము చూచుటకు మిక్కిలి భయానకము - కాని ఈమె ఎల్లప్పుడూ శుభములనే ప్రసాదించుచుండును. అందువలన ఈమెను "శుభంకరి" అనియు అంటారు. కావున భక్తులు ఈమెను చూచి ఏ మాత్రము భయమును గాని, ఆందోళనను గాని పొందనవసరమే లేదు.


కాళరాత్రి మాతను స్మరించి నంతమాత్రముననే దానవులు, దైత్యులు, రాక్షసులు, భూత, ప్రేత, పిశాచములు భయముతో పారిపోవుట తథ్యము. ఈమె యనుగ్రహమున గ్రహబాధలును తొలగిపోవును. ఈమెను ఉపాసించువారికి అగ్ని, జలము, జంతువులు మొదలగువాటి భయముగాని, శత్రువుల భయముగాని, రాత్రి భయముగాని ఏ మాత్రము ఉండవు. ఈమె కృపచే భక్తులు సర్వధా భయవిముక్తులగుదురు.


శ్రీ కాళరాత్రీదేవ్యై నమః


🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒






ree

09.10.24 7వ రోజు - ఇంద్రకీలాద్రిపై సరస్వతీదేవి అలంకరణ


🥦🥦🥦🥦🥦🥦🥦🥦


సరస్వతీ దేవి చరిత్ర


చదువుల తల్లి


దేవనాగరి: సరస్వతీ


తెలుగు: సరస్వతీ దేవి


వాహనం: హంస , నెమలి



ముఖ్యమైన దేవతా మూర్తులలో సరస్వతి చదువుల తల్లిగా ఆరాధింప బడుతుంది. ఈ దేవి త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మ దేవేరి. వేదాలు , పురాణాలలో విపులంగా సరస్వతీ నది కూడా ప్రస్తావించబడింది. కొన్ని పురాణ గాధలు సరస్వతీ దేవి సరస్వతీ నది చరిత్రలను అనుసంధా నిస్తాయి.


నవరాత్రి , వసంత పంచమి ఉత్సవాలలో సరస్వతీదేవి ఆరాధన ప్రముఖంగా జరుగుతుంది. స్వరూపం ఋగ్వేదంలోనూ , దేవీ భాగవతంలోనూ , బ్రహ్మ


వైవర్త పురాణంలోనూ (2.6.13-95) , పద్మ పురాణంలోనూ సరస్వతి దేవి గురించి వివిధ గాధలున్నాయి.


సరస్వతి ఆద్యంత రహిత శక్తి స్వరూపిణి అని వివిధ స్తోత్రాలలో స్తుతిస్తారు. బ్రహ్మ సకల సృష్టి కర్త గనుక సరస్వతిని కూడా బ్రహ్మయే సృష్టించాడని , సృష్టి కార్యంలో తనకు తోడుగా ఉండడానికి తన జిహ్వపై ఆమెను ధరించాడనీ ఒక గాధ. సృష్టి కార్యాన్ని నిర్వహించడానికి బ్రహ్మకు శక్తి స్వరూపిణిగా సరస్వతిని శ్రీమాతా దేవి ప్రసాదించిందని దేవీ భాగవతం చెబుతున్నది. సరస్వతిని బ్రహ్మకు విష్ణువు ఇచ్చాడని మరొక గాధ.


వాక్ ,బుద్ధి , వివేకం విద్య , కళలు, విజ్ఞానం – వీటన్నింటికీ అధిదేవతగా సరస్వతిని పూజిస్తారు. ఈ అమ్మవారు అధికంగా హంసవాహినిగా , వీణాపాణిగా , పుస్తకం మాలా ధారిణిగా చిత్రింపబడుతుంది. సరస్వతి వర్ణనలలోతెలుపు రంగుకు చెందిన వస్తువుల ప్రాముఖ్యం అధికం. “శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా హార తుషార ఫేన రజతాచల


కాశఫణీశ కుంద మందార సుధా పయోధి సిత తామర సారస వాహినీ శుభాకారత నొప్పు” నది గా బమ్మెర పోతన తన సరస్వతీ స్తుతిలో తెల్ల వస్తువుల పెద్ద జాబితానే ఉట్టంకించాడు.


సరస్వతి ధరించే వీణ పేరు”కచ్ఛపి”.పరాశక్తి , జ్ఞాన ప్రదాతసరస్వతి – రాజస్థాన్ లోని పాలరాతి విగ్రహం – 9 వ శతాబ్దానికి చెందినది. పరాశక్తి తొలిగా ధరించిన ఐదు రూపాల్లో సరస్వతి ఒకరు. ఆ మాత కేవలం చదువులనే కాదు సర్వశక్తి సామర్థ్యాలను తన భక్తులకు ప్రసాదిస్తుందని దేవీ భాగవతం నవమ స్కంధం ఐదోఅధ్యాయం వివరిస్తోంది. మహామాయ , భాషా జ్యోతిర్మయి , కళారస హృదయగా సరస్వతీ పూజలందుకొంటోంది.


జ్ఞాన ప్రదాతగా సరస్వతి – కొన్ని గాధలు


పూర్వం ఓసారి సనత్కుమారుడు బ్రహ్మ దగ్గరకు వెళ్ళి జ్ఞానాన్ని గురించి చెప్పమన్నాడు. శ్రీకృష్ణ


పరమాత్మ సూచన మేరకు బ్రహ్మ సరస్వతిని స్తుతించి బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు. ఆ తర్వాత ఆయన బ్రహ్మజ్ఞాన సిద్థాంతం చేసి సనత్కుమారుడికి చెప్పాడు.


అలాగే పూర్వం భూదేవి అనంతుడిని తనకు జ్ఞానాన్ని ఉపదేశించమంది. అనంతుడు కశ్యపుడి ఆజ్ఞతో పలుకుల తల్లిని స్తుతించాడు. ఆ తర్వాతనే అనంతుడు నిర్మలమైన జ్ఞానాన్ని సిద్థాంతీకరించి భూమాతకు చెప్పగలిగాడు. పూర్వం వ్యాస భగవానుడు పురాణ సూత్రాలను గురించి వాల్మీకిని అడిగాడు.


వాల్మీకి జగదాంబను స్మరించాడు. అలా ఆయన సరస్వతి దయను పొంది పురాణసూత్ర జ్ఞానాన్ని


పొందాడు. వ్యాసుడు కూడా నూరేళ్ళపాటు పుష్కర తీర్థంలో సరస్వతిని గురించి తపస్సు చేసి వరాన్ని పొంది సత్కవీంద్రు డయ్యాడు. ఆ తర్వాతే ఆయన వేద విభాగాన్ని , పురాణ రచనను చేశాడు. ఓసారిఇంద్రుడు తనకు తత్వజ్ఞానాన్ని ఉపదేశించమని శివుడినిఅడిగాడు. శివుడు పాటు దివ్వవాణిని తలచుకొని ఆ శక్తి ప్రభావంతో ఇంద్రుడికి జ్ఞానోపదేశం చేశాడు. ఆ ఇంద్రుడే బృహస్పతి దగ్గరకు వెళ్ళి శబ్ద శాస్త్రాన్ని చెప్పమన్నాడు. అప్పుడు బృహస్పతి వెంటనే పుష్కర క్షేత్రానికి వెళ్ళి వేయి దివ్వ సంవత్సరాలపాటు సరస్వతిని ధ్యానించి శబ్దశాస్త్రం పొందాడు.


పొరపాటున గురువు ఆగ్రహానికి గురై ఓసారి తాను చదువుకున్న చదువునంతా కోల్పోయాడు యాజ్ఞవల్క్య మహర్షి. అప్పుడాయన శోకార్తుడై పుణ్యప్రదమైన సూర్యస్థానానికి వెళ్ళి సూర్యుడిని గురించి తపస్సు చేశాడు. సూర్యుడు ప్రత్యక్షమై ఆ మహర్షి భక్తికి మెచ్చి వేదవేదాంగాలను చదివించాడు.


అయితేయాజ్ఞవల్క్యుడికి జ్ఞాపక శక్తి లేక పోవటానికి గమనించిన సూర్య భగవానుడు సరస్వతీ స్తోత్రాన్ని భక్తితో నిరంతరం పఠించమని చెప్పాడు. యాజ్ఞవల్క్య మహర్షి సూర్య భగవానుడు చెప్పినట్టు భక్తితో సరస్వతీ స్తుతి విడవకుండా చేశాడు. ఆ స్తుతిలో తాను గురుశాపం వల్ల విద్యాహీనుడుగా అయినట్లు , జ్ఞాపక శక్తి కోల్పోయినట్లు చెప్పాడు. తన మీద దయచూపి జ్ఞాన , జ్ఞాపక శక్తులను ప్రసాదించమని , విద్యను చక్కగా శిష్యులకు బోధించే శక్తిని , గ్రంధ రచనా శక్తి , ప్రతిభ గల శిష్యులను తనకు ప్రసాదించ మన్నాడు.


సత్సభలలో మంచి విచారణ శక్తిని ,సత్య స్వరూపిణి , వ్యాఖ్యాన రూపిణి , వ్యాక్యాధిష్టాతృ రూపిణి అయిన సరస్వతిని పదేపదే స్తుతించటంతో ఆ మాత యాజ్ఞవల్క్య మహర్షిని మళ్ళీ సంపూర్ణ జ్ఞానవంతుడిగా , సుకవిగా వెలుగొందమని ఆశీర్వదించింది. ఈ సరస్వతి స్తుతి అంతా దేవీ భాగవతంలో ఉంది.






09/10/2024 బతుకమ్మ పండుగలో వెన్నముద్దల బతుకమ్మ


🍓🍓🍓🍓🍓🍓🍓


ఇప్పటికే ఏడు రోజుల బతుకమ్మ వేడుకలు ముగిశాయి. వాటిలో ఎంగిలిపువ్వు బతుకమ్మ , అటుకల బతుకమ్మ , ముద్దపప్పు బతుకమ్మ , నానబియ్యం బతుకమ్మ , అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ , వేపకాయల బతుకమ్మ వేడకలు ముగిశాయి.


ఇక బతుకమ్మ పండుగలో 8వ రోజును 'వెన్నముద్దల బతుకమ్మ'గా బతుకమ్మను ఆరాధిస్తారు. ఈరోజు తంగేడు , గునుగు , చామంతి , గులాబీ , గడ్డి పువ్వు , మొదలైన పువ్వులతో ఎనిమిది అంతరాలను బతుకమ్మగా పేర్చి ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఆట , పాటలతో బతుకమ్మ ఆడి చెరువులో బతుకమ్మను నిమజ్జనం చేస్తారు. ఈరోజు వాయనంగా నువ్వులు , బెల్లం కలిపి ప్రసాదంగా పెడుతారు.


🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


Comments


©2023 by Daily Bhakti Messages 3.
Proudly created with Wix.com

bottom of page