top of page

Pushyamasam పుష్యమాసం

Writer's picture: Prasad BharadwajPrasad Bharadwaj



🌹పుష్యమాసం 🌹


చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉండగా వచ్చే మాసం పుష్య మాసం. “పుష్య” అనే మాటకు పోషణ శక్తి కలిగినది అని అర్ధం. పుష్య మాసం శీతాకాలం.

ఆధ్యాత్మికంగా జపతపాదులు , ధ్యాన పారాయణలకు శ్రేష్ఠమైన మాసమిది. పితృదేవతలను పూజించి అందరు దోషరహితులయ్యే పుణ్య మాసం పుష్యం. పుష్య పౌర్ణమి వేదాధ్యయానికి చాలా విశిష్టమైనదిగా చెప్పబడింది. శ్రావణ పౌర్ణమి మొదలు పుష్య పౌర్ణమి వరకు వేదాలు , మంత్రాలు నేర్చుకోవడానికి అనువైన సమయం గా చెప్పబడింది.


విష్ణువుకు ఇష్టమైన మాసం ఆశ్వీయుజం. శివునకు కార్తీకం. అలాగే పుష్యమాసం శనీశ్వరుడికి పరమ ప్రీతికరం. ఎందుకంటే ఆయన జన్మనక్షత్రం పుష్యమి. ఈ నెలంతా శనైశ్చరుణ్ని పూజించే వారిపట్ల శని ప్రసన్నుడై శుభాలు కలిగిస్తాడని పురాణాలు తెలుపుతున్నాయి.


ఏలినాటి శనితో బాధపడేవారు ఈ మాసంలో రోజూ ఉదయానే శుచిగా స్నానం చేసి శనీశ్వరుణ్ణి భక్తితో ప్రార్థిస్తారు. పౌర్ణమి నాడు శనికి తైలాభిషేకం జరిపించి నవ్వులు దానమిస్తారు. ఆయనకు ఇష్టమైన నువ్వులు , బెల్లం ఆహారంలో భాగం చేసుకుంటారు. దీనివెనుక శాస్త్రీయ కోణం చుస్తే ఈ రెండూ పదార్ధాలు మనిషి ఓంట్లో వేడిని పెంచి చలి నుంచి రక్షిస్తాయి.


శని ధర్మదర్శి న్యాయం , సత్యం , ధర్మాలను ఎత్తి చూపించేవాడు. సర్వప్రాణుల సమస్త విశ్వ ప్రేమను , పవిత్రతను ఉద్ధరిచేవాడు అతడే . మానవుడు ఈ నెలలో నువ్వులు సేవించి , నియమ నిష్ఠులు పాటించినట్లు అయితే శని అనుగ్రహం పొందవచ్చు.


అంతే గాక గరుడ పురాణంలో నాభిస్థానం శని స్థానం అని చెప్పబడింది. ఎప్పుడు శరీరంలోని నాభి ప్రదేశాన్ని శని ప్రదేశంగా చెప్పారో అప్పుడే ఈ ప్రదేశానికి ఉన్న ప్రాముఖ్యమంతటికి శని ప్రభావమే కారణం అని మనం గ్రహించాలి.


పుష్యమాసం తొలి అర్ధభాగంలో విష్ణుమూర్తిని పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం. పుష్య శుక్ల విదియ నుంచి పంచమి వరకు శ్రీ హరిని తులసీదళాలతో పూజిస్తే సౌందర్యం లభిస్తుందని ఒక నమ్మకం.


అలాగే సోమవారాల్లో శివుడిని మారేడు దళాలతోనూ ఆదివారాల్లో సూర్యుణ్ణి జిల్లేడు పూలతోనూ అర్చిస్తారు. శుక్ల పక్ష షష్ఠినాడు తమిళులు కుమారస్వామిని పూజిస్తారు. మనకు మార్గశిర శుద్ధ షష్ఠి ( సుబ్రహ్మణ్య షష్ఠి ) ఎలాగో వారికి ఈ రోజు అంత పవిత్రమైనది.


ఇక శుక్ల పక్షంలో వచ్చే అష్టమిరోజు పితృదేవతలను ఆరాధిస్తారు. ఈ మాసంలో శుద్ధ ఏకాదశిని పుత్రదా ఏకాదశి అంటారు. ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరిస్తే పుత్ర సంతానం కలుగుతుందని విశ్వాసం. పుష్యమాసంలో వస్త్రదానం విశేష ఫలితాలనిస్తుందని ప్రతీతి. చలితో బాధపడేవారిని ఆదుకోవడమే ఈ నియమం వెనుక సదుద్దేశం.


🌹🌹🌹🌹🌹


Comments


©2023 by Daily Bhakti Messages 3.
Proudly created with Wix.com

bottom of page