🌹ఆర్ద్రా దర్శనము 🌹
మౌళౌ గంగా శశాంకౌ కరచరణతలే శీత లాంగా భుజంగా
వామే భాగే దయార్ద్ర హిమగిరి దుహితా చందసం సర్వగాత్రే,
ఇత్థం శీతం స్రభూతం కసక సభా నాథ! సోఢుం క్వశక్తిః ?
చిత్తే నిర్వేదతప్తే యది భవతి న తే నిత్యవాసో మదీయే.
శివుడు చంద్రమౌళీశ్వరుడు. మఠములో ఉన్న అర్చనా మూర్తియున్నూ చంద్రమౌళీశ్వరుడే.
అయ్యా! నీమౌళిలో ఏమున్నవి? గంగ, చంద్రుడూ ఈరెండూ చలువ చేసే వస్తువులే, నీచేతులకున్నూ, కాళ్ళకున్నూ తొడగికొన్న నగలో? అవిన్నీ అంటుకొంటే జివ్వు మనిపించే చల్లని పాములు. ఇవి చాల వన్నట్టు ఎడమతట్టున మాచల్ల తల్లి దయచేతనయిన తడిముద్ద ముంచుగొండ గారాబు కూతురు. అట్టి హైమవతి.
ఆర్ద్రాదర్శనం చిదంబరానికి విశేషం. ఆర్ద్రమంటే బాగా తడిసినదని అర్థం. ఆర్ద్రాదర్శనం జరిగేనాడు మంచు ఎక్కువగా పడుతుంది. నాడు పున్నమకూడాను. నక్షత్రం ఆర్ద్ర. చలి! చలి! చలి!
శివునకు ఆర్ద్ర ప్రీతిపాత్రమయితే పెరుమాళ్ళకు శ్రవణంఅంటే మక్కువ. శ్రవణం శ్రవణం అంటూ పెరుమాళ్ళకు విశేషించి ఉత్సవాలు చేస్తారు. శివుడుమాత్రం ఆర్ద్రాప్రియుడు.
తెనుగువారివలెనే అరవలు సైతం నక్షత్రాలను అశ్వినీ భరణీ కృత్తిక ఈ మొదలుగా అంటారు. అరవంలో 'తిరు' అంటే శ్రేష్ఠం. తిరుశ్రీకి పర్యాయంకూడా. కాని ఈ 'తిరు'ను నక్షత్రాలకు చేర్చి తిరుఅశ్వని తిరుభరణి అని వారనడంలేదు. శ్రవణం మళయాళీలకు 'ఓణం'. కాని అరవంలో శ్రవణానికీ ఆర్ద్రకుమాత్రం శ్రేష్ఠవాచకమయిన తిరు అనేశబ్దం చేర్చి తిరువాణం తిరువాదిరై అని అనడం వాడుక. ఇట్లా శివవిష్ణు ప్రీతిపాత్రాలయిన ఈ ఆర్ద్రాశ్రమణాలకు మాత్రం శ్రేష్ఠవాచకమయిన తిరుశబ్దం చేర్చడం వాడుక. తక్కినవానికి తిరు శబ్దం చేర్చరు.
చెన్నపట్నానికి సమీపాన తిరువాన్మియూర్, తిరువళిక్కేణి, తిరువెట్రియార్ అనేవి ఉన్నవి. వీనికి తిరు శబ్దం మొదల ఉన్నది. అరవంలో కేణి అంటే కొలను. తిరువలిక్కేణిలో ఒక కొలను ఉండేదిట. దానిలో అల్లిపూలు పూచేవిట. అందుచేత దానికి తిరువల్లిక్కేణి. తిరువల్లికేణి అనే పేరు ఏర్పడింది. మదరాసులోనే తిరువెట్టీశ్వరన్ పేట అని మరొక ప్రదేశముంది. అచట తిరువెట్టీరుని ఆలయం ఉంది. అర్జునునకు పాశుపతం ఇచ్చే సందర్భంలో కిరాత వేషంలో వచ్చిన శివునకున్నూ తపస్సు చేసుకుంటున్న అర్జునునకున్నూ యుద్ధం జరిగి అర్జునుని వింటిదెబ్బలు తిని శివుడనుగ్రహించాడని పురాణం. అందుచేత ఇచటి దైవాన్ని తిరువెట్టీశ్వరన్ అని వ్యవహరిస్తారు. ఇట్లా స్వామితో సంబంధం కల పేర్లకు తిరుశబ్దం కలపడం ఒక వాడుక. ఇపుడు స్వామికి చెప్పినా చెప్పకపోయినా ఆసాములకు మాత్రం విరివిగా తిరుశబ్దం వ్యవహారంలోకి వచ్చింది.
దక్షిణదేశంలో ఏదయినా ఒక ఊరు వెలిస్తే అక్కడ ఒకశివాలయం విష్ణ్వాలయం కట్టడం బహుళంగా ఆచారంలో ఉంది. శివుని గుడిలో గర్భగృహంలో శివలింగంమీద ఒక ధారాపాత్ర వేలాడగటతారు. దాంట్లోంచి శివుని తలమీద అప్పసమూ జలధార పడుతూనేవుంటుంది. ఉత్తరదేశానికి వెళ్ళిచూస్తే ప్రతివాళ్లూ నదిలోనో చెరువులోనో స్నానంచేసి ఒక చిన్నపాత్రలో నీరు తెచ్చి శివాలయానికి వెళ్ళి శివలింగం మీద స్వహస్తంతో కుమ్మరించిపోతారు. దీనికి 'చడానా' అని అంటారు. ఉత్తరదేశంలో మరోవిశేషమేమంటే అంబికాలయం కాని రామాలయంకాని కాళికాలయంకాని ఏఆలయమయినా సరే మన ప్రాంతాలలో రావిచెట్లకింద నాగలింగ ప్రతిష్ఠ చేసిన రీతిగా ఒక లింగాన్ని ప్రతిష్ఠ చేస్తారు. కొన్ని కాళికాలయాలలో ద్వాదశ పన్నెండు లింగాలు కనబడతై. శ్రీ శంకర భగవత్పాదులు ఈ ద్వాదశలింగాలనూ స్తోత్రం చేశారు. హిమాలయంలో కేదారం, సౌరాష్ట్రంలో సోమనాథం, వారణాసిలో విశ్వనాథం, గోదావరిలో త్ర్యంబకం.
మహాబలిపురంలో ఉన్నట్లు ఔరంగాబాదు సమీపంలో ఎల్లోరాగుహలు ఉన్నై. అచట కొండా కొండా తొలిచి కోవెలకట్టారు. దీనిని చూచినవారికి మహాబలిపురం పెద్దవింతగా కనిపించదు. తంజావూరు ఆలయప్రాకారంలాగా కొండనేమలిచి గుడిగా ప్రాకారంగాకూడా నిర్మాణంచేశారు. దానిని నిర్మించడానికి అరవదేశంనుంచే శిల్పులు వెళ్లారుట. ఆలా వెళ్ళినవారు పల్లవచోళులకాలంలో వెళ్ళి ఉంటారు. ఆలయంలో ఆ పెద్దశిల్పి ఒక సంస్కృతశ్లోకం చెక్కాడు. దానిభావం :
ఈ కోవెలను నిర్మించిన తరువాత నేను తిరిగి చూచుకొన్నాను. దీనిని నిర్మించింది నేనా? అని నాకు ఆశ్చర్యం కలుగుతూంది. ఎన్నిజన్మలెత్తినా ఇట్టి ఆలయాన్ని (ఇంకొక దానిని) నేను కూడా నిర్మించలేను. నాలోనుండి ఎవరు దీనిని నిర్మించారో నాకు ఏమీ తెలియడంలేదు. ఇట్టి ఆలయం ఇంతకుముందు కట్టిందిలేదు, ఇక ముందేవరున్నూ కట్టబోరుగూడా. 'మళ్ళాకట్టు' అంటే నేనుకూడా ఇట్టి ఆలయం కట్టలేను'.
ఇట్టి ఎల్లోరాలోనే నాగేశం. భీమేశ్వరంనర్మదాతీరంలో ఒకనగరం. బాణలింగం మహారాష్ట్రంలో ఉన్న ఓంకారం. శ్రీశైలం, రామేశ్వరం. ఇవి పన్నెండూ పన్నెండుక్షేత్రాలు. ఈ పన్నెండు క్షేత్రాలలోని జోతిర్లింగాలనూ శ్రీ శంకరాచార్యులవారు నాలుగుపాదాలు కల మూడు శ్లోకాలలో ఇట్లా స్తుతించారు.
సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లిఖార్జునమ్,
ఉజ్జయిన్యాం మహాకాల మోంకార మమలేశ్వరే.
పరల్యాం వైధ్యనాథం చ డాకిన్యాం భీమశంకరం,
సేతు మధ్యే తు రామేశం నాగేశం దారుకావనే.
వారాణస్యాం తు విశ్వేశం త్ర్యంబకం గౌతమీతటే,
హిమాలయే తు కేదారం ఘుసృ (ధిష) ణేశం శివాలయే.
వీనినేకాక ప్రతిక్షేత్రంలోనూ ఉండే లింగాలను గూర్చిన్నీ వేరువేరుగా వ్రాశారు. పల్లవులకాలంలో కట్టిన కాంచీనగర దేవాలయంలో ప్రతిష్ఠించిన ద్వాదశలింగాలనూ చూడవచ్చు. మనప్రాంతంలో ఆవిధంగా ఎక్కడాలేదు. శివాలయం అంటే అభిషేకమే.
ఇత్థం శీతం ప్రభూతం తవ కనక సభానాథ సోఢుం క్వ శక్తిః ?
ప్రభూతమంటే ఎక్కువ. అపరకార్యాలలో అన్నం ఎక్కువగా వండి చేసే కర్మకు ప్రభూతబలి అని పేరు.
'అధికమయిన ప్రభూతమయిన చలిని-సోఢుర్సఓర్చు కోడానికి, కనక సభానాథుడవైన మహాప్రభూ! తవ్సనీకు. వ్వశక్త్సిఃశక్తియేదీ?
'ఇంతటి చలిని ఎవడున్నూ ఓర్చుకోలేడే! తలమీద గంగనేకాక చంద్రునికూడా పెట్టుకొని ఒంటిమీద చలికొట్టే పాములను చుట్టుకొని ఎడమతట్టున మంచుగొండ కూతురిని అతికించుకొని యీ యింత చలిని ఎలా నీవు ఓరుస్తున్నావయ్యా? అని కవి ప్రశ్నిస్తాడు.
ఈ ప్రశ్నకు స్వామి ఏమి బదులు చెపుతాడు? నిరుత్తరుడై ఆనందమూర్తియైనర్తకనిమగ్నుడై ఉంటాడు. అనృత్యం క్షణమాత్రం చూచిన కవికి బదులు దొరికింది,-
సరి. దీనికి నిన్ను ప్రశ్నించడం ఎందుకు? నీవు ఇలాంటి ఇంత చల్లదనమూ ఓర్చుకోడానికి మూలకారణం నావద్దనే ఉన్నది. నీవు అంతటనూ ఇంత ఎడము లేకుండా వెలసిన మహాప్రభువవు. నీవు లేనిచోటే లేదని అంటారు. ఎవరో స్వామి ఉన్నచోటు చూపమని ఒకరిని అడిగారట. అలా అడిగితే ఆయన స్వామి ఉన్నచోటు చూపుతా''నని అన్నాడుట. అట్లా నీవు సర్వాంతర్యామివై ఉన్నావు. నీవు నాహృదయమునందున్నూ ఉన్నావు. అందొక్క క్షణముంటే చాలు. ఎంతటి చలిన్నీ పరారు కావలసినదే. నా హృదయం అంత నిర్వేదంతో తుకతుకలాడి పోతుంది. అది తాపాలకు నెలవు. దుఃఖాలకు ఆలయము. నేను బహుజన్మలను చూచిన అనాదిని నీవున్నూ అనాదివే. నా హృదయంలో ఉంటే ఎంత శైత్యమయినా ఓర్చుకోగలవు, అని కవిబహుసుందరంగా చమత్కరించాడు.
జీవుల హృదయతాపాలను పోగొట్టే శక్తి ఒక్క పరమేశ్వరునకే ఉంది. మన హృదయతాపాలు పోకార్చడానికి ఆయనను చల్లని ప్రభువుగా భావించి శైత్యోపచారాలు చేయాలి. ఆయన హృదయంలో గనుక ఉంటేసర్వతాపాలూ పోతై. తాపంలో తలతలలాడే మన హృదయాలలో ఆదైవం వసించడానికి వారికి శైత్యోపచారాలుచేయడమే ఆర్ద్రాదర్శనతత్త్వం అని ఈశ్లోకంవల్ల తెలుస్తున్నది.
'వణకుతూ మాటలాడతా వేమయ్యా!' అని ఎవరైనా ప్రశ్నిస్తే వణికే ఆ మనిషి భయంతో మాటాడుతున్నాడని అర్థం. భయవిదారకుడు ఈశ్వరుడు. చల్లని ఆ ప్రభువును వేదనతో విలవిలలాడే హృదయాలలో ఒక్కక్షణం ధ్యానిస్తే చాలు, మన వేదనలన్నీ విడిపోయి హృదయం చల్లనౌతుంది.
--- “జగద్గురు బోధలు” నుండి
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।
🌹🌹🌹🌹🌹
Commentaires