top of page
Writer's picturePrasad Bharadwaj

ఉత్కృష్ట మార్గం (Sublime Path)


🌹- ఉత్కృష్ట మార్గం -🌹


ఈ ప్రపంచంలో జీవించటానికి ఉత్కృష్టమైన మార్గమేది?' అని ఒక శిష్యుడు శ్రీరామకృష్ణుని ఒకసారి అడిగితే దానికి పరమహంస ఇలా జవాబు చెప్పారు:


" నీ విధ్యుక్త ధర్మాలన్నింటినీ నిర్వర్తించు. నీ మనసును మాత్రం ఆ పరమాత్మునిపైనే నిలకడగా ఉంచి సాధనచెయ్యి. "


నీ భార్యాబిడ్డలతో జీవనం సాగించు. వాళ్ళు నీకెంతో ప్రియాతిప్రియమైనవాళ్ళుగానే వ్యవహరించు. నీ అంతరంగంలో మాత్రం వాళ్ళు నీకేమీ కానట్టు భావించు.


ఒక ధనికుడి ఇంట్లో పనిమనిషి అన్ని పనుల్నీ అంకితభావంతో చేస్తుంది. ఆమె దృష్టి మాత్రం తన ఇంటిపైనే ఉంటుంది. తన యజమాని పిల్లలకు అన్ని సేవలూ చేస్తుంది. తన కన్నబిడ్డలన్నంత మమకారంతో వారిని సాకుతుంది. 'నా బాబువి కదూ, నా తల్లివి కదూ' అని వాళ్ళను ప్రేమగా పిలుస్తూ తన చేత్తో ప్రియమార తినిపిస్తుంది. కాని, ఆమెకు తెలుసు- ఆ పిల్లలెవరూ తనవాళ్ళు కాదని.


తాబేలు నీళ్ళల్లో ఈదుకుంటూ పోతున్నా దాని మనస్సంతా గట్టుమీదే, తాను భద్రంగా అక్కడ దాచుకున్న గుడ్ల మీదే ఉంటుంది.


అలాగే నీ ప్రాపంచిక కర్మలన్నీ నిర్విఘ్నంగా సాగనియ్యి. నీ మనసును మాత్రం ఆ పరమాత్ముడిపైనే లగ్నం చెయ్యి.


బాల్యంలోనే దైవారాధన అనే సదాచారం నీకు అలవడకపోతే సంపదలు, సౌకర్యాలు, సుఖాలు పోగేసుకునే వ్యామోహంలోపడి ఆ పరాత్పరుణ్ని పూర్తిగా మరచిపోయే ప్రమాదం ఉంది. సర్వసమర్థుడినన్న అహంకారం, ఆశించినవి అందటంలేదన్న దుఃఖం, అంతుపట్టని అసంతృప్తి నిన్ను పూర్తిగా ఆక్రమించుకుని అశాంతి పాలుచేసే విపత్తు పొంచి ఉంటుంది. ప్రాపంచిక వస్తువుల్ని పోగేసుకుంటున్నకొద్దీ వాటి మీద నీ యావ ఇంకా ఇంకా పెరిగిపోతూనే ఉంటుంది.


పనసపండును కోసే ముందు అరచేతులకు నూనె రాసుకోవాలి. లేకపోతే దాని పాలు బంకలా వేళ్ళను పట్టుకుని వదలదు. అలాగే ముందు దైవప్రేమ అనే నూనెను అందిపుచ్చుకో... ఆ తరవాతనే ప్రాపంచిక ధర్మాలను చేతపట్టు. దైవానుగ్రహం లభించటానికి నీకంటూ ప్రత్యేకంగా కొంత ఏకాంత సమయం కావాలి.


పాల నుంచి వెన్న దొరకదు. ముందు పాలనుకాచి పెరుగు తోడుపెట్టుకోవాలి. తొందరపడి దాన్ని కదిపితే పెరుగు తోడుకోదు. పాలుగానే ఉండిపోతుంది. చిక్కని పెరుగును చిలక్కొట్టిన తరవాతే వెన్న లభిస్తుంది. ప్రపంచం నీళ్ల లాంటిది. మనస్సు పాల లాంటిది. పాలను నీళ్ళల్లో పోస్తే అదంతా కలిసి ఏకమవుతుంది. వెన్నని నీళ్ళల్లో వేస్తే అది తేలుతుంది.


అలాగే, ఆధ్యాత్మిక శిక్షణకు ఏకాంత సాధన కావాలి. జ్ఞానమనే వెన్నను చిలికి తెచ్చుకోవాలి. ఒకసారి అది లభించాక ప్రపంచమనే నీటిలో ఉంచినా అది కలవదు.


ఈ స్థితికి చేరుకోగలిగేదే ఉత్కృష్ట మార్గం !!


🌹🌹🌹🌹🌹


Tags:

0 views0 comments

Comentarios


bottom of page