🌹. కార్తీక పురాణం - 19 🌹
🌻. 19వ అధ్యాయము - చతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణ 🌻
ప్రసాద్ భరద్వాజ
ఈ విధముగా నైమిశారణ్యమందున్న మహా మునులందరూ కలిసి చిదానందుని స్తోత్రము చేసిన పిమ్మట జ్ఞానసిద్దుడను ఒక మహాయోగి "ఓ దీనబాంధవా! వేద వేద్యుడవని, వేద వ్యాసుడవని, అద్వితీయుడవని, సూర్యచంద్రులే నేత్రములుగా గల వాడవని, సర్వాంతర్యామివని, బ్రహ్మ రుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజింపబడు వాడవని, నిత్యుడవని, నిరాకారుడవని సర్వజనులచే స్తుతింపబడుచున్న ఓ మాధవా! నీకివే మా హృదయపూర్వక నమస్కారములు. సకల ప్రాణికోటికి ఆధార భూతుడవగు ఓ నందనందనా! మా స్వాగతమును స్వీకరింపుము. నీ దర్శన భాగ్యమువలన మేము మాఆశ్రమములు, మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి.
ఓ దయామయా! మేమీ సంసార బంధము నుండి బైట పడలేకుంటిమి, మమ్ముద్దరింపుము. మానవుడెన్ని పురాణములు చదివినా, యెన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము బడయజాలడు. నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గో చరుడవగుడువు. ఓ గజేంద్రరక్షకా! ఉపేంద్రా! శ్రీధరా! హృషీకేశా! నన్ను కాపాడుము" అని మైమరచి స్తోత్రము చేయగా, శ్రీ హరి చిరునవ్వు నవ్వి "జ్ఞానసిద్దా! నీ సోత్రవచనమునకు నేనెంతయు సంతసించితిని. నీ కిష్ట మొచ్చిన వరమును కోరుకొనుము" అని పలికెను.
అంత జ్ఞానసిద్దుడు "ప్రద్యుమ్నా! నేనీ సంసార సాగరము నుండి విముక్తుడను కాలేక శ్లేష్మమున పడిన యీగవలె కొట్టుకోనుచున్నాను. కనుక, నీ పాద పద్మముల పైనా ధ్యానముండుటనటుల అనుగ్రహింపుము. మరేదియు నాకక్కరలేదు" అని వేడుకొనెను.
అంత శ్రీమన్నారాయణుడు "ఓ జ్ఞానసిద్దుడా! నీ కోరిక ప్రకారమటులనే వరమిచ్చితిని. అదియునుగాక, మరొక వరము కూడా కోరుకొనుము యిచ్చెదను. ఈ లోకమందు అనేక మంది దురాచారులై, బుద్దిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు. అట్టి వారల పాపములు పోవుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను. అ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును. సావధానుడవై ఆలకింపుము.
నేను ఆషాడ శుద్ద దశమిరోజున లక్ష్మిదేవి సహితముగా పాలసముద్రమున శేషశయ్యపై పవళింతును. తిరిగి కార్తీక మాసమున శుద్దద్వాదశి వరకు చాతుర్మాస్యమని పేరు. ఈకాలములో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము.
ఈ వ్రతముచేయు వారలకు సకల పాపములు నశించి, నా సన్నీధికి వత్తురు. ఈ చాతుర్మాస్యములందు వ్రతములు చేయనివారు నరకకూపమున బడుదురు. ఇతరులచేత కూడా ఆచరింప చేయవలయును. దీని మహాత్మ్యమును తెలిసియుండియు, వ్రతము చేయనివారికి బ్రహ్మహత్యాది పాతకములు గలుగును.
వ్రతము చేసినవారికి జన్మ, జరా, వ్యాధుల వలన కలుగు బాధలుండవు. దీనికి నియమితముగా ఆషాడశుద్ద దశమి మొదలు శాకములును, శ్రవణశుద్ద దశమి మొదలు పప్పుదినుసులను విసర్జించవలయును. నా యందు భక్తి గలవారిని పరీక్షించుటకై నేనిట్లు నిద్రావ్యాజమున శయనింతును. ఇప్పుడు నీ వోసంగిన స్తోత్రమును త్రిసంధ్యల యందు భక్తిశ్రద్దలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగ వత్తురు." అని శ్రీమన్నారాయణుడు మునులకు బోదించి శ్రీమహాలక్ష్మితో గూడి పాలసముద్రమును కేగి శేషపానుపు మీద పవ్వళించెను.
వశిష్టుడు జనకమహారాజుతో "రాజా! ఈ విధముగా విష్ణుమూర్తి, జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస్య వ్రత మహత్మ్యమును ఉపదేశించెను. ఈ వృత్తాంతమును ఆంగీరసుడు ధనలోభునకు తెలియచేసెను. నేను నీకు వివరించినాను గాన ఈ వ్రతము ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు, అన్ని జాతులవారును చేయవచ్చును. శ్రీ మన్నారయణుని ఉపదేశము ప్రకారము ముని పుంగవులందరు యీ చాతుర్మాస్య వ్రత మాచరించి ధన్యులై వైకుంఠమున కరిగిరి.
ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి ఏకోనవింశోధ్యాయము - పందోమ్మిదోరోజు పారాయణము సమాప్తము.
🌹 🌹 🌹 🌹 🌹
Comments