top of page
Writer's picturePrasad Bharadwaj

కార్తీక పురాణం - 27 - దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట (Kartika Purana - 27 - Durvasa takes refuge in Ambarish)

🌹. కార్తీక పురాణం - 27 🌹


🌻. 27వ అధ్యాయము - దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట 🌻


ప్రసాద్ భరద్వాజ



మరల అత్రి మహాముని అగస్త్యున కిట్లు వచించెను- కుంభ సంభవా! ఆ శ్రీ హరి దూర్వాసుని యెంతో ప్రేమతో జేరదీసి యింకను ఇట్లు చెప్పెను.


"ఓ దూర్వాస మునీ! నీవు అంబరీషుని శపించిన విధముగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవే. నేను అవతారము లెత్తుట కష్టము గాదు. నీవు తపశ్శాలివి. నీ మాటలకు విలువ యివ్వవలెను. గాన, అందులకు నేనంగగీకరించితిని. బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము నీవు అంబరీషుని యింట భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరీవృతుడై ప్రాయోపవేశమొనర్పనెంచినాడు. ఆ కారణము వలన విష్ణు చక్రము నిన్ను బాధింపబూనెను. ప్రజారక్షణమే రాజధర్మము గాని, ప్రజాపీడనము గాదు.


ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులగు బ్రాహ్మణులే శిక్షింపవలెను. ఒక విప్రుడు పాపియైన మరొక విప్రుడే దండించ వలెను. ధనుర్బాణములు ధరించి ముష్కరుడై యుద్దమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరిని యెప్పుడూ దండించకూడదు. బ్రాహ్మణ యువకుని దండించుట కంటే పాతకము లేదు. విప్రుని హింసించువాడును హింసింపచేయువాడును, బ్రాహ్మణ హంతకులకి న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి. బ్రాహ్మణుని సిగబట్టిలాగిన వాడును, కాలితో తన్నినవాడును, విప్రద్రవ్యమును హరించువాడును బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమిన వాడును, విప్ర పరిత్యాగ మొనరించినవాడును బ్రహ్మహ౦తుకులే అగుదురు.


కాన, ఓ దూర్వాస మహర్షి! అంబరీషుడు నీ గురించి - తపశ్శాలియు, విప్రోత్తముడును అగు దూర్వాసుడు నా మూలమున ప్రాణసంకటం పొందుచున్నాడు. అయ్యో! నేను బ్రాహ్మణ హంతకుడనయితినే యని పరితాపము పొందుచున్నాడు. కాబట్టి, నీవు వేగమే అంబరీషుని కడకేగుము. అందువలన మీవుభయులకు శాంతి లభించును" అని విష్ణువు దూర్వాసునకు నచ్చజెప్పి అంబరీషుని వద్దకు బంపెను.


ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్టప్రోక్త కార్తీక మహత్మ్యమందలి సప్తవి౦శోధ్యాయము - ఇరవయ్యేడవ రోజు పారాయణము సమాప్తము.


🌹 🌹 🌹 🌹 🌹


0 views0 comments

Comments


bottom of page