కార్తీక పురాణం - 5 : 5 వ అధ్యాయము : వనభోజన మహిమ, కిరాత మూషికములు మోక్షము నొందుట Kartika Purana - 5 : Chapter 5: The glory of the forest food, the salvation of the wild mice
- Prasad Bharadwaj
- Oct 26
- 2 min read

🌹. కార్తీక పురాణం - 5 🌹
🌻 5 వ అధ్యాయము : వనభోజన మహిమ, కిరాత మూషికములు మోక్షము నొందుట. 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
🌹. Kartika Purana - 5 🌹
🌻 Chapter 5: The glory of the forest food, the salvation of the wild mice. 🌻
📚. Prasad Bharadwaja
'ఓ శివధనుస్సంపన్నా! జనకరాజా! శ్రద్దగా విను. మనము చేసిన పాపాలన్నింటినీ- నశింపచేయగల శక్తి ఒక్క కార్తీక మాస వ్రతానికి మాత్రమే వుంది. కార్తీకమాసములో విష్ణుసన్నిధిని ఎవరయితే భగవద్గీతా పారాయణమును చేస్తారో - వారి పాపాలన్నీ కూడా పాము కుబుసములాగా తొలగిపోతాయి. అందునా పదీ - పదకొండు అధ్యాయాలను పారాయణ చేసేవారు - వైకుంఠానికి క్షేత్రపాలకులవుతారు. ఎవరయితే కార్తీకమాసంలో తులసీదళాలతోగాని, తెలుపు లేదా నలుపు గన్నేరు పూలతో గాని విష్ణుపూజను చేస్తారో -వాళ్లు వైంకుఠానికి చేరి, విష్ణు సమభోగాల ననుభవిస్తారు. ఈ కార్తీకమాసంలో హరిహరులెవరి సన్నిధినైనా సరే - ఏ పురాణాన్నయినా సరే ప్రవచించేవారు సర్వ కర్మబంధ విముక్తులవుతారు.
🌻. కార్తీక వనభోజనము
శ్లో" యః కార్తీకే సితే వనభోజన మాచరేత్
సయాతి వైష్ణవం ధామ సర్వపాపైః ప్రముచ్యతే !!
కార్తీకమాస శుక్లపక్షంలో వనభోజనము చేసినవారు - పాపవిముక్తులై విష్ణుధామాన్ని పొందుతారు. జప, హోమ, పూజా, భోజన, తర్పణ ఫలాలతో - పాపీ క్షుద్ర ఛండాలాది అశౌచవంతుల యొక్క సంభాషణలను వినిన పాపం తుడిచి పెట్టుకు పోతుంది. కాబట్టి మహారాజా! కార్తీకమాస శుక్లపక్షంలో అన్నిరకాల వృక్షాలతో బాటుగా ఉసిరిచెట్టు కూడా వున్న తోటలోనే వనభోజనమును ఏర్పాటు చేసుకోవాలి. ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామము నుంచి, గంధ పుష్పాక్షతాదులతో పూజించి, యధాశక్తి బ్రాహ్మణుల నాహ్వానించి గౌరవించి, వారితో కలసి భోజనము చేయాలి. ఇలాగున - కార్తీక మాసములో వనభోజనాన్ని యెవరయితే నిర్వహిస్తారో, వాళ్లు ఆయా కాలాలలో చేసిన సర్వపాపాల నుంచీ తెములుకుని, విష్ణులోకాన్ని పొందుతారు. జనకజనపతీ! ఈ కార్తీక మహాత్మ్యాన్ని భక్తిశ్రద్ధలతో విన్న బ్రహ్మణుడొకడు దుర్యోనీ సంకటము నుంచీ రక్షింపబడ్డాడు. కథ చెబుతాను విను.
🌻. దేవదత్తో పాఖ్యానము:
పూర్వం కావేరీ తీరములో దేవశర్మ అనే సద్భ్రాహ్మణుడుండేవాడు. అతనికొక పరమ దుర్మార్గుడయిన కుమారుడు కలిగాడు. అతని పేరు దేవదత్తుడు. అతగాడి దుష్ట ప్రవర్తనలను గుర్తించిన తండ్రి, అతగాడిని పాపవిముక్తుని చేయాలని సంకల్పించి 'నాయనా! రోజూ కార్తీక ప్రాతః స్నానాన్ని ఆచరించు. సాయంకాలమున హరి సన్నిధిలో దీపారాధనమును చేస్తూ వుండు. ఈ విధంగా కార్తీక వ్రతాన్ని ఆచరించి ధన్యుడివికా' అని చెప్పాడు.
కాని దుర్వర్తనుడయిన ఆ బ్రాహ్మణ పుత్రుడు - తానటువంటి కట్టుకథలను నమ్మననీ, కార్తీక వ్రతాన్ని ఆచరించననీ - తండ్రికి యెదురుతిరిగాడు. అందుకు కినిసిన దేవశర్మ తన కుమారుడిని 'అడవిలోని చెట్టు తొర్రలో యెలుకవై పడివుండు' అని శపించాడు. శాపానికి భయపడిన ఆ విప్రకుమారుడు తండ్రి పాదాలబడి, తనకు తరణోపాయం చెప్పమని కోరగా - ఆ తండ్రి ' నాయనా ! నీ వెప్పుడైతే కార్తీక మహాత్మ్యాన్ని సంపూర్ణముగా వింటావో అప్పుడే నీ యెలుక రూపము పోతుం'దని - శాపవిముక్తి అనుగ్రహించాడు.
🌻. దేవదత్తునికి శాపవిముక్తి:
పితృశాప కారణంగా అప్పటికప్పుడే మూషికరూపాన్ని ధరించిన బ్రాహ్మణ యువకుడు గజారణ్యములో ఫలవంతమైనదీ - అనేక జంతువుల కాధారభూతమైనదీ అయిన ఒకానొక మహావృక్ష కోటరములో మనసాగాడు. ఇలా కొంతకాలము గడిచాక, ఒకానొకప్పుడు మహర్షియైన విశ్వామిత్రుడు శిష్య సమేతంగా కార్తీక స్నానమాచరించి వచ్చి, ఆ యెలుక వున్న చెట్టు మొదలునందు దువిష్ణుడై తన పరివారానికి పరమపావనమైన కార్తీక మహాత్మ్యాన్ని వినిపించసాగాడు.
ఆ సమయంలో దయాహీనుడూ, పాపాలపుట్టా, అడవి జీవాలను హింసించి పొట్టపోసుకునేవాడూ అయిన ఒక కిరాతకుడాప్రాంతాలకు వచ్చాడు. పుణ్యపురుషుల దర్శనమువల్ల ఉపకారమేగాని, అపకారము యేనాడూ జరుగదు. అదేవిధముగా, విశ్వామిత్రాది తపోబృంద దర్శనమాత్రం చేత - రవంత పశ్చాత్తప్తుడూ - జ్ఞానీ అయిన ఆ కిరాతకుడు వారిని సమీపించి 'అయ్యా ! మీరు చెప్పుకుంటున్న కథలేమిటి? అని వింటూంటే - నాకీ కిరాతక జీవితం పట్ల చిరాకు పుడుతోంది. దయచేసి ఈ రహస్యమేమిటో చెప్పండి' అనగానే, అతనిలో వివేకం విచ్చుకుంటున్న వైనమును గమనించిన విశ్వమిత్రుడు - 'నాయనా! మేము కార్తీక వ్రతాన్ని ఆచరిస్తున్నాము. ఈ కార్తీక మాసములో యెవరయినా సరే తెలిసిగాని, తెలియకగాని స్నాన దాన జప తపః పురాణ శ్రవణాదును చేసినట్లయితే వారు వారి సర్వ పాపాలనుంచీ విముక్తులవుతారు. ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించేవాళ్లు జీవన్ముక్తులవుతారు' అని తెలియజేశాడు.
కార్తీక పురాణం - 5
ఈ విధముగా కిరాతకునికి చెబుతూన్న కార్తీక మహాత్మ్యాన్ని వినడమే తడవుగా - తొర్రలోనున్న యెలుక తన శాపగ్రస్తరూపాన్ని వదలివేసి, పూర్వ యువ బ్రాహ్మణ రూపాన్ని పొంది - విశ్వామిత్రాదులకు ప్రణమిల్లి తన పూర్వవుగాధను వినిపించి, ఆ బుషులనుండి సెలవు తీసుకొని తన ఆశ్రమానికి తరలిపోయాడు.
అనంతరము ఆ కిరాతకుడు కూడా విశ్వామిత్రాదుల వలన కార్తీక మహత్మ్యాన్ని కడకంటా తెలుసుకోవడం వలన - ఆ జన్మకి కిరాతకూడయ్యీ కూడా - దేహంతరాన ఉత్తమగతులను పొందాడు. కాబట్టి ఓ జనకరాజా! ఉత్తమ గతులను కోరేవారు ప్రయత్నపూర్వకముగా నయినాసరే కార్తీక వ్రతమాచరించాలి. లేదా, కనీసము కార్తీక మహాత్మ్యాన్నయినా భక్తి శ్రద్దలతో వినాలి.
ఏవం శ్రీస్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్మ్యమందు. పంచమోధ్యాయ స్సమాప్త:
🌹 🌹 🌹 🌹 🌹



Comments