top of page
Writer's picturePrasad Bharadwaj

క్రిస్టమస్ పండుగ శుభాకాంక్షలు, మరియు క్రిస్మస్‌ కానుక! (Merry Christmas, and Christmas Gift!)


🌹 క్రిస్టమస్ పండుగ శుభాకాంక్షలు 🌹


🌻 ఏసుక్రీస్తు చెప్పిన మాట! 🌻


ఈనెల 25వ తేదీన ప్రపంచమంతటా కోటానుకోట్లమంది క్రిస్టమస్ పండుగను ఈ ఎంతో వేడుకగా, భక్తి శ్రద్ధలతో చేసుకొంటారు. అది పావనమూర్తి ఏసుక్రీస్తు జన్మించిన రోజు. ఆయన అసలు పేరు 'జ్యోష్యు' ఆ పేరుకు అర్థం 'దైవమే (యహోవానే) ముక్తి' అని. అది గ్రీకు భాషలో 'జీసస్' అయింది. క్రీస్తు అన్నది ఆయన యొక్క దివ్యత్వాన్ని, అవతారకార్యాన్ని సూచించే బిరుదు. 'రక్షకుడు' లేక 'ముక్తి ప్రదాత' అని అర్థము. బైబిల్ లోని కొత్త నిబంధనను జాగ్రత్తగా పరిశీలిస్తే ఆయన చరిత్రను బట్టి, బోధను బట్టి ఆయన సద్గురువని తెలియగలదు.


సద్గురువులు హైందవ సాంప్రదాయం ప్రకారము రెండు రకాలుగా ఉంటారు. ఋషభుడు, శుకుడు, శ్రీపాదశ్రీవల్లభుడు, శిరిడీ సాయిబాబా ల వలె జన్మతః దివ్య స్వరూపులైన వారు కొందరు. సామాన్య మానవుల వలె జన్మించి, తీవ్ర సాధన వలన దివ్యత్వాన్ని పొందినవారు తాజుద్దీన్ బాబా, రామకృష్ణ పరమహంస వంటివారు కొందరు. మొదటి తెగకు చెందిన కపిలుడు, ఆది శంకరుడు వంటి వారిని అవతార పురుషులని హైందవ సాంప్రదాయం వ్యవహరిస్తుంది. అలా గాక మానవచరిత్రపై వారికిగల విస్తృత ప్రభావమును బట్టి కొందరిని అవతారాలుగా పరిగణించే సాంప్రదాయమూ ఉన్నది. ఏసుక్రీస్తు కూడ ఆ కోవకే చెందుతారు. అయితే తక్కిన మతాలను సహృదయతతో కూలంకుషంగా పరిశీలించని కొందరు క్రైస్తవ సోదరులకు ఈ నిర్వచనం నచ్చకపోవచ్చు. అట్టివారు క్రీస్తు ఒక్కరే భగవంతుని బిడ్డగా అవతరించిన భగవంతుడని, ఇతర మతాలకు చెందిన మహాత్ములందరూ సైతాన్ అనుయాయులని వాదిస్తారు. కాని బైబిల్ లోని క్రీస్తు చరిత్రను, బోధలను పరిశీలిస్తేగాని వాస్తవము తెలియదు. క్రీస్తు ఒక్కరే భగవంతుడని వాదించేవారు చెప్పే ఆధారాలను పరిశీలిద్దాము.


హిందూమతంలో వేదాంతులు పరమాత్మలో సత్, చిత్, ఆనందము అనీ, పౌరాణికులు బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు అనీమూడు తత్వాలు గుర్తించినట్లే క్రైస్తవులు 'జగత్ పిత', 'పరిశుద్దాత్మ, దివ్యపుత్రుడు' అనే మూడు అంశాలను గుర్తించారు. జగత్ పిత పరలోకములో వుంటాడు. పరిశుద్దాత్మ మానవులకు భగవంతుని గూర్చిన సత్యాన్ని అందిస్తుంది. దీని యొక్క మహిమ చేత అలౌకికమైన రీతిన మరియమ్మ గర్భాన దివ్యపుత్రుడుగా జన్మించి మానవులకు 'ముక్తి' లేక 'పరలోక రాజ్యము' ను సాధించుకొనే మార్గాన్ని ఉపదేశించారు క్రీస్తు. యూదుల ప్రకారము ప్రవక్తలందరిద్వారా దివ్యసందేశాన్ని సాంద్రాయము ప్రకారము ఈ పరిశుద్ధాత్మే మానవాళికి అందిస్తుంది. సర్వమతాలలోని మహాత్ములందరికీ యిది వర్తిస్తుంది.


క్రీస్తు యొక్క అలౌకిక జననము వలన అద్వితీయుడని ఆయన కొందరు వాదిస్తారు. కాని శిరిడీ సాయి తన జననము గూర్చి కూడా వారే "ప్రకృతిపురుషుల సంయోగము వలన నాకు ఈ దేహము వచ్చినది" అని అన్నారు. తాము జన్మించినప్పుడు వారి తల్లి తనకు మగబిడ్డ జన్మించినందుకు సంతోషిస్తుంటే, వారు మాత్రము, "నేను యిప్పుడు క్రొత్తగా జన్మించటమేమిటి? నేను ఇంతకుముందు నుండి వున్నాను గదా!" అనుకొన్నారట. తండ్రి ప్రసక్తి మాత్రము లేదు!! క్రీస్తు యూదులకు ఆదిపురుషుడైన అబ్రహామునకు పూర్వమే తాము వున్నట్లు చెప్పారు. అలానే సాయికూడా తాము రామాయణ కాలంలో వుండి ఆ వృత్తాంతము స్వయంగా చూచామని చెప్పారు. తమ వయస్సు లక్షల సంవత్సరాలు అని చెప్పారు. "నన్ను చూచిన వాడు జగత్ పితను చూచినట్లే" (యోహాను 148) అన్నారు క్రీస్తు. "నేను, దైవమూ ఒక్కటే" (మై అల్లాహుఁ) అన్నారు సాయి. జగత్ పిత సర్వజ్ఞుడు, సర్వసమర్థుడు, కరుణామయుడు అయినట్లే క్రీస్తు కూడానని వారి చరిత్ర సూచిస్తుంది. శిరిడీ సాయి చరిత్ర కూడా వారిని గూర్చి అదే తెలుపుతుంది.


క్రీస్తు శిలువపై మరణించాక మూడు రోజులకు మరల భౌతిక దేహముతో తమ శిష్యులకు దర్శనము యివ్వగలగటము వలన క్రీస్తు అద్వితీయుడని క్రైస్తవుల వాదము. కాని 1886 సం||లో శ్రీ సాయిబాబా ముందుగా భక్తులకు తెల్పి, మూడు రోజులపాటు మరణించి, తిరిగి సజీవులై భూమిపై 1918 వఱకూ జీవించారు. ఈ యిద్దరి సద్గురువుల చరిత్ర ఒక్కలాగే వుండటము గమనార్హం. అందుకే నేను రచించిన ఆంగ్ల సాయిబాబా జీవితచరిత్ర (Sai Baba The Master) గురించి అమెరికాలో ప్రఖ్యాత క్రైస్తవ తత్వవేత్త పాల్ రెప్స్ (Paul Reps) యిలా వ్రాశారు: "నాకుగాని, మరి యెవ్వరికిగాని, Sai Baba The Master చదువకుంటే జీసస్ జీవితము అర్థం చేసుకోవటం అసంభవము. శిరిడీ సాయిబాబా మహాత్ములందరిలోకి గొప్పవారు. గ్రంథాన్ని పాశ్చాత్య దేశాల్లో ప్రచురించడము ఎంతో అవసరము." క్రీస్తు యొక్క జననాన్ని గూర్చి ఎందరో ప్రవక్తలు ముందుగానే "జగద్రక్షకుడు అవతరించబోతాడు" అని చెప్పినట్లు బైబిలులోని పాత నిబంధనలలో పలుచోట్ల గ్రంథస్థమై వున్నదని; కనుక ఆయన ఒక్కడే భూమిపైన అవతరించిన భగవంతుడని క్రైస్తవులు అంటారు. ఇట్టి ఆధారాలు ప్రత్యేకంగా మత్తయి సువార్తలో (The Gospel | of Mathew) లో ఎక్కువ భాగం కనిపిస్తాయి.


ఆ సువార్త మీద అధికారికమైన వ్యాఖ్యను వ్రాసిన విలియమ్


బార్క్లే (William Barclay) గ్రంథం చూస్తే వాస్తవము తెలుస్తుంది. "క్రీస్తు యొక్క భక్తుడూ, ప్రచారకుడూ అయిన "మత్తయి" (Mathew) యూదు జాతికి చెందినవాడు. సాటి యూదులచేత క్రీస్తు భగవంతుని పుత్రుడైన జగద్రక్షకుడని నమ్మించాలన్న ఆతృతతో పాతనిబంధనలోని ప్రవక్తల వాక్యాలను వక్రీకరించి, అవి వాస్తవంగా క్రీస్తు జననానికి సంబంధించనవి అయినప్పటికీ ఆ రకంగా చిత్రించి మత్తయి కల్పన చేశాడు" అని బార్క్లేసోదాహరణముగా వివరించారు. కనుక ఈ వాదము సరియైనది కాదు.


ఇక క్రీస్తు శ్రీ శిరిడీ సాయిబాబా వంటి సద్గురువనటానికి కొద్ది ఉదాహరణలు :


1. ఉత్తముడైన సద్గురువు తాను ఆజన్మ సిద్ధుడైనప్పటికీ, మానవులందరికీ ఆదర్శాన్ని చూపించడానికి, సత్సాంప్రదాయాన్ని గౌరవించటానికి, ఒక గురువును ఆశ్రయిస్తాడు. శ్రీకృష్ణుడు సంపూర్ణభగవదావతారమైనప్పటికీ సాందీపని మహర్షికి శిష్యుడయ్యాడు. క్రీస్తు యోహాను (John) అను ప్రవక్తకు శిష్యుడై 'బాప్టిజమ్' (ఉపదేశము) పొందారు. తామొక సద్గురువును 12సం॥ దీక్షగా సేవించి వారి అనుగ్రహాన్ని పొందినట్లు శ్రీ సాయిబాబా కూడా చెప్పారు.


2. తీవ్రమైన సాధన ద్వారా సర్వమూ తానే అయిన భగవంతుడూ తామూ వేరుగాదన్న జ్ఞానాన్ని పొందినవాడే సద్గురువు, భగవంతునికి వలెనే సద్గురువుకు కూడ తానుకానిదేదీ వుండదు కనుక అద్వితీయుడు. అట్టి స్థితిని జన్మతః కల్గియున్నవాడు "జన్మతః భగవంతుని దివ్య పుత్రుడు" (The only begotten Son of God). అట్టి స్థితిగల సిద్ధపురుషులు భౌతికంగా ఎందరున్నా ఆంతర్యంలో వారంతా ఐక్యత కల్గియుంటారని శ్రీసాయిబాబా చరిత్ర చూస్తే తెలుస్తుంది. కనుక వారిలో ప్రతి ఒక్కరూ తమ తమ భక్తులకు 'నా ద్వారా తప్ప భగవంతుని ఎవ్వరూ చేరలేరు' అంటారు. వారి భక్తులలో మూఢులైనవారు యీ తత్వాన్ని అర్ధం చేసుకొనక "నా సద్గురువొక్కడే దైవము; మిగిలినవారు కారు" అని తగవులాడుకొంటారు. ఇదే మనకీనాడు కన్పించే పరమత దూషణకు కారణం. ఈ భావం మౌఢ్యమనడానికి ఋజువు వారందరి బోధలూ ఒకే తీరుగా వుండడమే. అన్ని మతాల మూలసూత్రాలూ ఒకే రీతిగా వున్నప్పుడు యితర మతాలకు చెందినవారు పాపులని, తమ మతమొక్కటే సత్యమని వాదించడమెలా రైటవుతుంది? అన్ని మతాల లోనూ వున్న ప్రధాన సూత్రాలను త్రికరణశుద్ధిగా పాటించక, బాహ్యాండంబర మొక్కటే కల్గియుండి, నిత్యజీవితంలో నైతిక ధర్మాలను పాటించని వారందరూ పాపులే. ఆ విషయం క్రీస్తు చెప్పినదానిలో స్పష్టమవుతుంది. తన భక్తులమని చెప్పుకొంటూ, తననామాన్నుచ్చరిస్తూ గూడ తాను చెప్పిన ధర్మసూత్రాలను పాటించని వారిని తాను రక్షించనని, వారికి నరకమే గతియనీ క్రీస్తు చెప్పారు. అందుకే వారు చెప్పిన 'స్వామి ప్రార్థన' (The Lord's Prayer) లో క్రైస్తవమతానికీ, క్రీస్తుకూ పరిమితమైన పదమొక్కటి గూడా లేదు!


3. పైన చెప్పినట్లు తామే సర్వమూ అయిన భగవంతుడనని చెప్పిన ప్రతి సద్గురువూ నిజమైన శిష్యులను తమవంటి సద్గురువులుగా రూపొందిస్తారు!! (ఆత్మ తుల్యాన్ కరోతి). క్రైస్తవ పదజాలంలో చెప్పాలంటే దేవుని బిడ్డలుగా రూపొందిస్తారు. అట్టి స్థితినే ఆయన పరలోక రాజ్యమన్నారని మత్తయి సువార్త బార్క్లే పండితుడి వాఖ్య చూస్తే తెలుస్తుంది. తానొక్కడే భగవంతుని వంటి పరిపూర్ణుడనని క్రీస్తు చెప్పలేదు. క్రైస్తవులనుకున్నట్లు. తన శిష్యులందరినీ అంతటి పరిపూర్ణులవ్వమని చెప్పాడు: భగవంతుని దివ్యపుత్రులవ్వమన్నారు (మత్తయి సువార్త 4:43 నుండి 48). ప్రతి మతంలోని సద్గురువూ సాయి, క్రీస్తులవలే తమ శిష్యులెందరినో అర్హులైన వారిని అలాచేశారు. అలా రూపొందిన శిష్యులతో "మీరు ప్రపంచానికి వెలుగులవ్వాలి" (మత్తయి 4:14 లో) అన్నారు. అటువంటప్పుడు క్రీస్తుతప్ప అన్యులెవరూ 'భగవంతుని బిడ్డలు', 'భగవత్స్వరూపులు', మానవాళికి మార్గదర్శకులు కారని వాదించే పామర క్రైస్తవ ప్రచారకులమాట నమ్మాలా? లేక క్రీస్తు మాటలు నమ్మాలా? క్రీస్తు బోధలకు భిన్నంగా మత ప్రచారం ఆయన పేరిట చేసేవారు సైతాను అనుయాయులా, లేక వాటికి సరిపోవులాగున బోధించి, ఆచరించి తరించిన యితర మతాలలోని సద్గురువులు, యీ సత్యాన్ని తెలిపిన వారి భక్తులూ సైతాను అనుయాయులా?


క్రీస్తు సాంప్రదాయకమైన యూదు కుటుంబంలో జన్మించారు. శాశ్వతమూ, దివ్యమూ అయిన యూదుధర్మాన్ని తాను వమ్ముచేయమని, వాటిని పరిపూర్ణం చేయడానికే అవతరించామని చెప్పారు (మత్తయి 5:17- 20). కాని ఎన్నో యూదుసాంప్రదాయాలను ఆయన ఆచరణలో తృణీకరించడం చరిత్రలో చూడవచ్చు. అంటే మూఢమైన బాహ్యాడంబరాన్ని ఆయన నిరసించారు. ధర్మం యొక్క నిజతత్వాన్ని బలపరచారు. శ్రీసాయిబాబా అలానే చేసిన వివరం శ్రీసాయిబాబా జీవిత చరిత్ర లోని 'సాయి సాంప్రదాయం' అన్న అధ్యాయంలో చూడవచ్చు. అంటే ఇద్దరూ నిత్యజీవితంలో పరిణితి తెచ్చుకోవడం ఆవశ్యకమనే ధర్మస్వరూపాన్ని తెల్పిన సద్గురువులు. అంతేకాదు, ప్రార్ధన ఎలా చేయాలో క్రీస్తు బోధించి ముక్తి మార్గాన్ని తెల్పారు. సాయి కూడా తెల్పారు. సాయి తెల్పిన దానిలో "నా ద్వారా తప్ప భగవంతుని ఎవ్వరూ చేరలేరు" అని క్రీస్తు వంటి సద్గురువులు చెప్పేదానికి అసలైన అర్ధం బోధపడుతుంది. ఇద్దరూ ముక్తి మార్గ బోధకులైన పరమ గురువులు.


ఆ స్థితిలో సాధకుడి హృదయం తీవ్రమోక్షకాంక్ష చేత ఇతర వికారాల నుండి పవిత్రత చెందుతుంది. దానిని గురించే ఏసు. మత్తయి సువార్త 5:8 లో "నిర్మల హృదయులు ధన్యులు; వారు దేవుని దర్శింతురు" అని చెప్పారు. ఆ స్థాయికి వచ్చినవారు జీవుల మధ్య శాంతిని నెలకొల్పి, వారిని మంచి మార్గానికి ఉద్భోద చేయడం వారికి సహజమౌతుంది. దీన్ని గురించే మత్తయి సువార్త 5:9 లో చెప్పి వుంది. "శాంతి స్థాపకులు ధన్యులు. వారు దేముని కుమారులనబడుదురు” అని. అందుకే శ్రీరామకృష్ణ పరమహంస, శ్రీ సాయిబాబా, కబీర్, నానక్ వంటి మహాత్ములందరూ జాతి, కుల మత ద్వేషాలను తొలగించి సామరస్యాన్ని నెలకొల్పబూనారు.



'మతం ఎందుకు?'


దైవం ఒక్కడే


ఎవరెవరు ఏ భావంతో పూజిస్తే


వారిని ఆయా విధముగా


కరుణిస్తానని గీతయందు


కరుణామయుడైన కన్నయ్య వాగ్దానం



నదులు ఎన్ని ఉన్నా సముద్రం ఒక్కటే అయినట్లు ఎవరెవరు ఏ విధానంలో దైవాన్ని కొలచిన. అందరి ప్రార్థనలు ఒక దైవానికి చెందుతాయి.


ఆ దైవం అంతట ఉన్నాడు


సర్వ ప్రాణులలో ఉన్నాడు


మంచితనం ప్రేమ అన్ని దైవమే.



మన తప్పులు మనం క్షమించు కొనినట్లే అన్యులను క్షమించ వలెను


మనల్ని మనం ప్రేమించుకున్న ట్లు అందరినీ ప్రేమించే వలెను.



ఎవరి మనసు పసి పిల్లల వలె ఉల్లాసంగా ఉత్సాహంగా కల్మష రహితం గా ఉంటుందో వారు దైవాన్ని చేరెదరు.



ఎవరి హృదయం అహంకారంతో ఎంతగా కఠినం అవుతుందో వారు అంతగా దుఃఖమునకు లోనగుదురు.



మహాత్ములు ఎప్పుడైనా సత్యమే చెబుతారు.


అహంకారంతో వాటిని తిరస్కరించకూడదు.



పరమాత్ముడు ఏ దేశం వాడు?!


మీరు ఆయనను ఏ దేశంలో చూసినా నా హృద్దేశంలో అతనిని నేను చూస్తున్నాను..



"మీ పరలోకపు తండ్రి" అని క్రైస్ట్ సంభోదించారంటే...


మనకు వేరొక లోకము ఉండీ...అందులో


మరొక తండ్రి మనకున్నాడని చెప్పడం కాదు ఆయన ఉద్దేశ్యం..,



నీ స్వరూపమే నీకు తండ్రి.


నీ పరరూపం దగ్గర నిలబడి దీన్ని నేను అనుకొనేసరికి...నీ స్వరూపము నీకు పరలోకమైపోతోంది...



మరొకసారి మిత్రులందరికీ హృదయపూర్వక క్రిస్టమస్ శుభాకాంక్షలు ....


🌹🌹🌹🌹🌹







క్రిస్మస్‌ కానుక!



ఇది రెండువేల సంవత్సరాల కిందటి సంగతి. అతడో నిర్భాగ్యుడు. అతణ్ని సమాజం వెలివేసింది. అది అతడి తప్పు కాదు. ఆ జబ్బు తెచ్చిన ముప్పు. ఆ కాలంలో అలా కుష్ఠువ్యాధిగ్రస్తులను పాపులుగా భావించేవారు. వారు ఎవరితోనూ మసలకూడదు. వారి దగ్గర ఒక గంట ఉంటుంది. ఎవరైనా ఎదురుపడితే దాన్ని మోగించాలి. దాని అర్థం ‘నేను అపవిత్రుడిని... దూరంగా ఉండండి!’.


అలా సమాజ నిరాదరణకు గురైన ఒక అభాగ్యుడి జీవితంలో ఉషోదయం మొదలైన క్షణాలవి. అతనుండే ప్రాంతానికి ఒక మహానుభావుడు వచ్చాడనే వార్త తెలిసింది. అతడు సంతోషంతో ఆయనను కలవాలనుకున్నాడు. ఆయనవల్ల తన జబ్బు నయమవుతుందని ఆశపడ్డాడు. అల్లంతదూరంలో ఆయనను చూసి మోకరిల్లాడు. చుట్టుపక్కలవారు అతణ్ని ముట్టుకోవద్దంటూ కేకలు పెట్టారు. ఆ పెద్దాయన వారి మాటలు లక్ష్యపెట్టలేదు. ముందుకు నడిచి ఆ పీడితుడిని ఆత్మీయంగా స్పృశించాడు. తన చేతులతో పైకి లేపాడు. ఆ కుష్ఠురోగి దేహంపై ఉన్న గాయాలను నిమిరాడు. ‘నువ్వు ఆరోగ్యవంతుడివి అవుతావు’ అంటూ ఆశీర్వదించాడు. అతడికి స్వస్థత కలిగింది. అది శారీరక స్వస్థతే కాదు. మానసిక స్వస్థత కూడా! ఆ దృశ్యం చుట్టుపక్కలవారి కళ్లు తెరిపించింది.


వివిధ కారణాలతో తమ తోటి మనుషులను వెలివేసి దూరంగా ఉంచేవారే ఆయన దృష్టిలో నిజమైన కుష్ఠురోగ పీడితులు. వారికి శరీర స్పర్శ కాదు, మానవత్వపు స్పర్శ లేదు. కరుణ, ప్రేమ, సహానుభూతితో ఆ మానవీయ స్పర్శలోని ఆత్మీయ ఆనందాన్ని సమస్త మానవాళికి అందించేందుకే ఆయన ఈ లోకానికి నరావతారిగా వచ్చాడు. ఆయనే క్రీస్తుప్రభువు.


మనుషులు వస్తారు, వెళ్తారు. పదేళ్లు, వందేళ్లు, అయితే వేలాది, లక్షలాది సంవత్సరాల వరకు నిలబడి ఉండేది ఒక్క సత్యం మాత్రమే, ఒక నక్షత్రంలా. క్రీస్తు ప్రభువు జన్మించినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం వెలసింది. అది నేటికీ సత్యమై నిలిచింది. సత్యమే నిలుస్తుంది. ఆయన ‘నేను సత్యం’ అన్నారు. క్రీస్తు ప్రభువు పుట్టినప్పుడు వెలసిన నక్షత్రం ఆధారంగా తూర్పు దేశం నుంచి వచ్చిన జ్ఞానులు ఆయనను దర్శించారు. ఆయనకు మూడు కానుకలను సమర్పించారు. అవి బంగారం, బోళం, సాంబ్రాణి. బంగారం పరిశుద్ధతకు, బోళం త్యాగానికి, సాంబ్రాణి ఆరాధనకు గుర్తు. ఆ మూడింటికి సాధనంగా నిలిచేది ఆయన హృదయం. ప్రభువు పుట్టినప్పుడు తల్లిదండ్రులు పశువుల పాకలోని తొట్టెలో పడుకోబెట్టారు. అది పశువుల మేతకోసం ఉపయోగించే తొట్టె. అది ఎంతో అద్భుతమైన ఘటన! మానవ హృదయం ఒక నివాస స్థలం అనుకుంటే అది ఒక పశువుల శాలలా మురికిగా ఉంది. అందుకే పుట్టబోయే ప్రభువు తన జన్మస్థలంగా ఆ ప్రదేశాన్ని ఎన్నుకొన్నాడు. మలినమైన మానవ హృదయాలను పరిశుద్ధపరచి మహోన్నతమైన మానవులుగా తీర్చిదిద్దేందుకే తాను ఈ లోకానికి వచ్చానని పశువుల పాకలోని ఆయన జననం సూచిస్తుంది.


మనిషి ఒంటరిగా మనలేడు. తనను తాను హత్తుకోలేడు. కష్టం వచ్చినప్పుడు ఒక ఓదార్పు, ప్రేమపూర్వక స్పర్శ. ఆ క్రమంలో నిన్నులాగా నీ పొరుగువారిని ప్రేమించు అనే సత్యవచనం అద్భుతంగా పనిచేస్తుంది. మనల్ని మనం ఎంతగా ప్రేమించుకుంటామో ఆ క్రమంలోనే ఇతరులను ప్రేమించాలి. మనిషి సాటిమనిషిని ప్రేమగా హత్తుకునే ఆ మానవీయ స్పర్శ కలిగిన హృదయాన్నే ఆయన కావాలంటున్నాడు. అదే క్రిస్మస్‌ పండగ వేళ ఆయనకు సమస్త మానవాళి ఇచ్చే కానుక...


-------------------------------------------------------------------



మిత్రులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు !


క్రీస్తును చూసిన పరమహంస


దేవుడొక్కడే! సత్యం ఒక్కటే! కానీ, అక్కడకు చేరుకోవడానికి అనేక మార్గాలు. ‘ప్రపంచంలో మతాలెన్నో మార్గాలన్ని!’ అని శ్రీరామకృష్ణ పరమహంస అన్నది అందుకే. ఆయన అన్ని రకాల మార్గాలలో ఆధ్యాత్మిక సాధన చేశారు. హిందూ, మహమ్మదీయ, క్రైస్తవ, జైన, సిక్కు మత సంప్రదాయాలన్నిటి పట్ల విశ్వాసం చూపారు. ఆ క్రమంలో ఆయన జరిపిన క్రైస్తవ మత సాధన చాలా ప్రత్యేకమైనది. సంవత్సరం, సమయం, సందర్భంతో సహా శ్రీరామకృష్ణుల ప్రత్యక్ష శిష్యులు రికార్డు చేసి, రాసిన జీవితచరిత్రలో ఆ సంఘటన నమోదైంది. ఆ అరుదైన ఆధ్యాత్మిక అనుభూతి పూర్వాపరాలలోకి వెళితే...


అప్పటికే, తంత్రశాస్త్రాలు నిర్దేశించిన 64 సాధనలు, వైష్ణవ సంప్రదాయంలోని శాంత - దాస్యాది పంచభావాల ఆధారంగా భక్తిసాధనలు, మహమ్మదీయ మత సాధన - ఇలా అన్నిటినీ శ్రీరామకృష్ణులు అనుష్ఠించారు. 1873 మే 25న సాక్షాత్తూ శారదాదేవినే అమ్మవారిగా భావిస్తూ జరిపిన షోడశీ పూజతో ఆయన సాధన వ్రతం పూర్తి అయింది. షోడశీ పూజ జరిగిన ఏడాది తరువాత 1874లో... శ్రీరామకృష్ణుల్లో మరో సాధనామార్గం ద్వారా దైవాన్ని దర్శించుకోవాలనే ఆకాంక్ష కలిగింది.


అప్పటికి, ఆయనకు శంభుచరణ్ మల్లిక్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. అతను శ్రీరామకృష్ణులకు బైబిల్ చదివి వినిపించేవాడు. అలా ఆయనకు ఏసుక్రీస్తు పావన జీవితం, క్రీస్తు స్థాపించిన మతం గురించి తెలిసింది. క్రైస్తవ సంప్రదాయ మార్గంలో సాధనలు చేయాలనే కోరిక ఆయన మనస్సులో మెదిలింది.


దక్షిణేశ్వరంలోని కాళికాలయానికి దక్షిణ దిక్కులో యదుమల్లిక్ ఉద్యానగృహం ఉంది. శ్రీరామకృష్ణులు అప్పుడప్పుడు అక్కడ వ్యాహ్యాళికి వెళుతుండేవారు. యదుమల్లిక్‌కూ, అతని తల్లికీ శ్రీరామకృష్ణులంటే చాలా భక్తి. కాబట్టి, వాళ్ళు ఉద్యానగృహంలో లేని సమయంలో కూడా శ్రీరామకృష్ణులు అక్కడికి వెళితే, సిబ్బంది తలుపులు తెరిచి, అక్కడ కూర్చొని విశ్రమించమని కోరేవారు. ఆ గదిలో గోడలకు చక్కని చిత్రపటాలు ఉండేవి. తల్లి ఒడిలో ఉన్న బాలక్రీస్తు చిత్రపటం అందులో ఒకటి. ఒకరోజు శ్రీరామకృష్ణులు ఆ గదిలో కూర్చొని, ఆ పటాన్నే తదేక దృష్టితో చూడసాగారు.


ఏసుక్రీస్తు జీవిత చరిత్ర గురించి ఆలోచిస్తూ కూర్చున్నారు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఆ చిత్రం సజీవమై, దివ్యకాంతితో ప్రకాశించసాగింది. పటంలోని ఆ తల్లి, బాల ఏసు దేహాల నుంచి కాంతిపుంజాలు వెలువడ్డాయి. అవి శ్రీరామకృష్ణుల హృదయంలో ప్రవేశించాయి. అంతే! ఆయన మానసిక భావనలన్నీ పరివర్తన చెందాయి. జన్మసిద్ధమైన హైందవ సంస్కారాలన్నీ మారుమూల ఒదిగిపోయాయి. పూర్తిగా భిన్నమైన సంస్కారాలు ఉదయించాయి. తనను తాను నియంత్రించుకోవడానికి శతవిధాల ప్రయత్నించారు.


‘అమ్మా! నాలో ఏ వింత మార్పులు తీసుకువస్తున్నావు?’ అంటూ జగజ్జననిని హృదయపూర్వకంగా ఆయన ప్రార్థించారు.


కానీ, ఉపయోగం లేకపోయింది. ఏసుక్రీస్తు పట్ల, క్రైస్తవ సంప్రదాయం పట్ల భక్తి విశ్వాసాలు శ్రీరామకృష్ణుల హృదయంలో పాతుకున్నాయి. క్రైస్తవ ప్రార్థనా మందిరంలో ఏసుక్రీస్తు మూర్తి ఎదుట ఫాదిరీలు ధూపదీపాదులు అర్పించిన దృశ్యాలు ఆయనకు దర్శనమయ్యాయి.


తరువాత శ్రీరామకృష్ణులు కాళికాలయానికి తిరిగి వచ్చారు. మనసులోని ఆ భావాలు, కదలాడిన దృశ్యాల చింతనలో లీనమైపోయారు. కాళికాలయానికి వెళ్ళి, జగజ్జననిని దర్శించుకోవాలనే విషయం కూడా మర్చిపోయారు. అలా మూడు రోజుల పాటు ఆ భావతరంగాలు ఆయన మనస్సును ఆక్రమించేశాయి.


అది మూడో రోజు... చీకటి పడింది. శ్రీరామకృష్ణులు ‘పంచవటి’ గుండా నడుచుకుంటూ వెళుతున్నారు. అప్పుడు ఒక అద్భుత దృశ్యం కనిపించింది. ఉజ్జ్వలమైన గౌరవర్ణుడైన అద్భుత దివ్య మానవుడు ఒకరు తదేకదృష్టితో ఆయనను చూస్తూ, ఆయన వైపు రాసాగారు. ఆ వ్యక్తి విదేశీయుడనీ, విజాతీయుడనీ చూసిన క్షణంలోనే శ్రీరామకృష్ణులకు అర్థమైంది. ఆతని కళ్ళు విశాలంగా ఉన్నాయి. ఆతని ముఖారవిందానికి వింత శోభను సంతరిస్తున్నాయి.


ఆతని ముక్కు ఒకింత చప్పిడిగా ఉంది. కానీ, ఆతని అందానికి అదేమీ కొరత కాలేదు. ఆతని ముఖంలో అద్భుతమైన దివ్య భావప్రకటన తొణికిసలాడుతోంది. అదంతా చూసి, శ్రీరామకృష్ణులు ‘ఇతనెవరా?’ అని అబ్బురపడ్డారు. ఆ దివ్యమూర్తి దగ్గరకు వచ్చాడు. ఆ క్షణంలో శ్రీరామకృష్ణుల హృదయం లోలోపల నుంచి ‘‘ఏసుప్రభువు! దుఃఖయాతనల నుంచి జీవులను ఉద్ధరించడానికి ఎవరు తన హృదయ రక్తాన్ని సమర్పించారో... ఆ ఏసుప్రభువు!’’ అన్న మాటలు వెలువడ్డాయి.


అంతర్వాణి అలా పలుకుతూ ఉన్న సమయంలో ఏసుక్రీస్తు, శ్రీరామకృష్ణులను ఆలింగనం చేసుకున్నాడు. ఆయన దేహంలో లీనమైపోయాడు. వెంటనే శ్రీరామకృష్ణులు భావసమాధి మగ్నులై, బాహ్యచైతన్యాన్ని కోల్పోయారు. అలా శ్రీరామకృష్ణులు సాక్షాత్తూ ఏసుక్రీస్తు దర్శనం పొందారు.



కనిపించిన రూపమే...!


ఇది జరిగిన చాలాకాలం తరువాత ఒకరోజు స్వామి శారదానంద సహా పలువురు ప్రత్యక్ష శిష్యులతో శ్రీరామకృష్ణులు ఏసుక్రీస్తు ప్రస్తావన తెచ్చారు. ‘‘నాయనలారా! మీరు బైబిల్ చదివారు కదా! ఏసుక్రీస్తు భౌతిక లక్షణాల గురించి దానిలో ఏం రాసి ఉంది? ఆయన ఎలా కనిపించేవాడు?’’ అని అడిగారు. దానికి శిష్యులు, బైబిల్‌లో ఎక్కడా ఆయన భౌతిక వర్ణన తాము చూడలేదనీ, కానీ యూదుడుగా జన్మించడం వల్ల క్రీస్తు మేనిఛాయ ఉజ్జ్వల గౌరవర్ణంలో ఉంటుందనీ, విశాలనేత్రాలు, చిలుక లాంటి కొక్కెపు ముక్కు ఉండడం ఖాయమనీ జవాబిచ్చారు.


కానీ, శ్రీరామకృష్ణులు మాత్రం ‘‘ఆయన ముక్కు ఒకింత చప్పిడిదై ఉండడం చూశాను. ఆయనను ఎందుకలా చూశానో తెలియడం లేదు’’ అన్నారు. విచిత్రం ఏమిటంటే, భావసమాధిలో శ్రీరామకృష్ణులు చూసిన స్వరూపం, ఏసుక్రీస్తు వాస్తవమూర్తితో సరిపోలింది. శ్రీరామకృష్ణుల మహాసమాధి అనంతరం ఏసుక్రీస్తు శరీర నిర్మాణం గురించి మూడు విభిన్న వర్ణనలు ఉన్నాయనీ, ఆయన ముక్కు ఒకింత చప్పిడిగా ఉండేదనే వర్ణన వాటిలో ఒకటి ఉందనీ శ్రీరామకృష్ణుల శిష్యులు తెలుసుకొని అబ్బురపడ్డారు. శ్రీరామకృష్ణులకు దర్శనమైంది స్వయంగా క్రీస్తే అని చెప్పడానికి ఇదొక నిదర్శనం.



ఇవాళ్టికీ రామకృష్ణ మఠంలో... క్రిస్మస్!


దేశవిదేశాల్లో వ్యాపించిన శ్రీరామకృష్ణ మఠాలన్నిటిలో, బుద్ధ భగవానుడు, శ్రీరామ, శ్రీకృష్ణ, శ్రీచైతన్య, శ్రీశంకరుల జన్మదినోత్సవాలు ప్రతి ఏటా చేస్తారు. అది శ్రీరామకృష్ణ మఠ సంప్రదాయం. విశేషం ఏమిటంటే, శ్రీరామకృష్ణుల క్రైస్తవ ఆధ్యాత్మిక సాధన, పైన చెప్పిన సంఘటనను పురస్కరించుకొని - క్రిస్మస్ సందర్భంగా ‘క్రిస్మస్ ఈవ్’ (డిసెంబర్ 24) నాడు ఏసుక్రీస్తు జన్మదినోత్సవాన్ని కూడా మఠంలో శ్రద్ధాభక్తులతో చేస్తారు.


ముఖ్యంగా మఠ కేంద్రస్థానమైన కోల్‌కతాలోని బేలూరు రామకృష్ణ మఠంలో క్రీస్తు పూజ, బైబిల్ పారాయణ, భక్తి సంగీత గానం మొదలైనవి జరుపుతారు. రామకృష్ణ మఠం, మిషన్ సెంటర్లలో జరిపే పండుగల్లో హైందవేతర ఉత్సవం ఇదొక్కటే! ఇప్పటికీ ఈ సంప్రదాయం అవిచ్ఛిన్నంగా సాగుతోంది.....



0 views0 comments

Comments


bottom of page