కరిగిపోండి (Dissolve)
- Prasad Bharadwaj
- Sep 20
- 3 min read

🌹కరిగిపోండి 🌹
దైవం ఒక్కడే, అయినప్పటికీ లోపల మూడు భాగాలుగా ఉన్నట్టు నాకు అనిపిస్తోంది. అవి జీవాత్మ-ఆత్మ-పరమాత్మ. మనం భూమి మీదకి వచ్చిన లక్ష్యం నేనే పరమాత్మనని తెలుసుకోవడమే. కాబట్టి మనం జీవాత్మ నుండి ఆత్మగా, ఆత్మ నుండి పరమాత్మగా పరివర్తన చెందాలి. ఇక్కడ జీవాత్మ మీలో ఉన్న ఒక్క గుణాన్నే పట్టుకుని దానిని మాత్రమే వ్యాపించి మిగతా వాటిని తిరస్కరిస్తుంది. ఆత్మ మీలో ఉన్న అన్నింటినీ కలిసికట్టుగా ఉపయోగించుకుంటూ; మీలో ఉన్న అన్ని శరీరాలను, అన్ని భాగాలను, అన్ని అవస్థలను వ్యాపించి ఉంటుంది. పరమాత్మ నిరాకారం మరియు సర్వవ్యాపకం కూడా; ఇది విశ్వమంతా అలాగే విశ్వంలోని అన్ని రూపాలలో కూడా వ్యాపించి ఉంటుంది, అలాగే ఈ విశ్వంలోని అన్ని రూపాలు కూడా తానై ఉంది.
మీ లోపల ఆలోచనలు వస్తూ-పోతూనే ఉంటాయి, వీటితో ఎలా వ్యవహరించాలి అనే సందేహం మీకు కలుగవచ్చు? దీనికి సమాధానం - అసలు ఆలోచనలనేవే లేవని, ఉన్నది స్వచ్ఛమైన శక్తి మాత్రమే. కాని మనసు ఈ స్వచ్ఛమైన శక్తిని సాధ్యమైనన్ని ముక్కలుగా చేసి, శక్తి యొక్క వివిధ రూపాలను మీకు చూపిస్తుంది. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా మీకు చూపించగలిగే ఒక అద్భుతమైన పరికరం మనసు అని ఎల్లప్పుడూ మదిలో ఉంచుకోండి. దీనిని సరిగ్గా అవగాహన చేసుకుని మీ ఎదుగుదలకు దానిని ఎలా ఉపయోగించుకోవాలనేది మీరు సాధన చేసి తెలుసుకోవాలి.
అంటే మనసు అనేది X-ray మరియు Pet Scan లాంటిది. ఇవి ఒరిజినల్ ని చూపించడం లేదు డూప్లికేట్ లనే చూపిస్తున్నాయి. ఇక్కడ ఒరిజినల్ నిరాకారం, డూప్లికేట్ మంచి-చెడు ఆకారాలు, మంచి-చెడు అనుభవాలు అని ఇక్కడ గ్రహించండి. కనుక మనము కరిగిపోయి సూక్ష్మమై, సూక్ష్మమైన మనసుతోటి ఈ ప్రపంచాన్ని చూసినప్పుడే, మనకు ఒరిజినల్ అనేది అనుభవంలోకి వస్తుందన్నమాట.
ఉదాహరణకు మనం కొన్ని ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్స్‌లో డిస్కో లైట్లను చూస్తాం. మనకు స్టేజ్ మీద ఎన్నో రంగు రంగుల కాంతులు కనబడుతూ ఉంటాయి. కాని అవన్నీ నిజంగా ఉన్నాయా? లేవు, అక్కడ ఒక్క రంగులో ఉన్న బల్బు మాత్రమే ఉంటుంది. దాని చుట్టూ ఒక గ్లోబ్ లాంటిది తిరుగుతూ ఉంటుంది. దానికి ఎన్నో రంధ్రాలు ఉండి, వాటికి వివిధ రకాల రంగులతో ఉన్న పేపర్లు అంటించి ఉంటాయి. దాని వలననే మనకు అనేక రకాల రంగులు కనపడతాయి. కాని మనం అక్కడ ఉన్నది ఒక్క రంగు మాత్రమేననే విషయాన్ని మరిచిపోతాం. అలాగే నాకు ఈ రంగు నచ్చింది, ఆ రంగు నచ్చలేదనే నిర్ణయానికి కూడా వస్తాం.
అదే విధంగా ‘మనసు’ కూడా ఉన్న ఒక్క శక్తినే ముక్కలుగా విభజించి మనకు అనేక రకాలుగా చూపిస్తుంది. మనం ఇంతవరకు వీటిలో కొన్నింటిని ఎంపిక చేసుకుని దానికి వ్యతిరేకంగా అనిపించిన వాటితో యుద్ధం చేస్తూ వచ్చాం. ఇలా చేస్తూ మనం ఎన్నో అనుభవాలను పొందాం. కాని ఇదంతా అనవసరంగా జరగలేదని, ద్వంద్వాల గురించి లోతుగా అవగాహన చేసుకోవడానికే ఇదంతా చేసామని అర్ధం చేసుకుని, మిమ్మల్ని మీరు క్షమించుకుని ఆ అనుభవాలను వదిలేయండి. అంటే ఇదంతా మాయ ప్రభావం వలననే జరిగిందని గ్రహించండి. అలాగే మనసు బంధానికి మరియు మోక్షానికి కూడా ఉపయోగ పడుతుందని, అది మిమ్మల్ని అనేకం వైపు లేదా ఏకత్వం వైపు కూడా తీసుకెళ్ళగలదని గ్రహించండి.
కాబట్టి లేని ఆలోచనలను ఉన్నట్టుగా చూపించే మనసుతో మనం ఎలా వ్యవహరించాలి? మీరు ఆలోచనలను తేలికగా సరదాగా చూడగలగాలి. కాని మీకు ఎల్లప్పుడు ఇలానే చూడడం సాధ్యం కాదు. మీరు మనసులో ఉన్నప్పుడు లేనివి ఉన్నట్టుగా చూపిస్తున్న ఆలోచనలలో ఏదో ఒక దానిని తప్పకుండా పట్టుకుని దానికి వ్యతిరేకమైన వాటితో యుద్ధం చేస్తూనే ఉంటారు. అలాగే పాతవాటిని వదిలేసి కొత్త ఆలోచనలను పట్టుకుంటారు. దీని వలననే వివిధ రకాల సమస్యలు మీ జీవితంలో స్థిరపడి ఉంటున్నాయి.
కాని మీరు ఈ ఆలోచనలను ఏమీ చేయలేరు, ఎందుకంటే నిజానికి అవి లేవు కాబట్టి. అంటే అవి నీడల్లాంటివే గాని వాటికి స్వంత ఉనికి లేదని. కనుక లేని వాటితో మీరు అనవసరంగా యుద్ధం చేస్తున్నారని గ్రహించండి. కాబట్టి ఆలోచనల నుంచి సులభంగా ముక్తి పొందాలంటే, మీరు మనసుతో మిమ్మల్ని మీరు గుర్తించుకోకుండా, ఆలోచనలను పట్టించుకోకుండా, మీపైనే మీరు దృష్టిని నిలపాలి. అంటే ఆలోచనలను చూడడం ఆపి, భూ జల అగ్ని వాయు తత్వాలను, సుఖదుఃఖాలను వదిలేసి, మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి, మీ దృష్టిని మీవైపు తిప్పండి.
ఆ తర్వాత వేడికి మంచు ముక్క ఎలాగైతే కరిగిపోతుందో అలా మీరు కరిగిపోయి నిరాకారమైన తర్వాతనే, ఆత్మలాగా మీలో అన్ని భాగాలకు వ్యాపిస్తున్నట్టు ఊహించుకోండి. ఎందుకంటే నిరాకారమే అన్నింట్లోకి చొచ్చుకుపోయి వ్యాపించగలుగుతుంది కనుక. ఇలా జీవాత్మ అయిన మీరు, మనసులో మరియు శరీరంలో ఏమి జరుగుతున్నా ఆ ప్రక్రియలో చురుకుగా పాల్గొనకుండా, ప్రశాంతంగా ఉంటూ కేవలం నేను మాత్రమే కరిగిపోతున్నాను అనే భావనలో ఉంటూ, మంచు ముక్కలా కరిగిపోయి లోపలంతా వ్యాపించి అదే స్థితిలో ఉంటే, మీరు నిద్రలాంటి స్థితిలోకి వెళ్తారు, లేదా శరీరానికి మరియు మనసుకు అతీతంగా మీలో ఉన్న శూన్య స్థితిలో మీరు ఉన్నట్టు అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు.
మరో రకంగా చెప్పాలంటే, లోపల మాట్లాడకుండా, ఆలోచించకుండా మరే పని చేయకుండా, కేవలం నేనున్నాననే భావనలో ఉండడమే కరిగిపోవడమంటే. ఇలా మీకు వీలైనంత సమయం ఏమీ చేయకుండా, నేను కరిగిపోయి లోపలంతా వ్యాపించి ఉన్నాను అనే భావనలో అనే అనుభూతిలో ఉండిపోండి.
🌹🌹🌹🌹🌹
Comments