top of page

గీతా జయంతి మరియు మోక్షదా ఏకాదశి శుభాకాంక్షలు / Greetings on Geeta Jayanti and Mokshada Ekadashi

  • Writer: Prasad Bharadwaj
    Prasad Bharadwaj
  • 4 days ago
  • 3 min read
ree

🌹 గీతా జయంతి మరియు మోక్షదా ఏకాదశి శుభాకాంక్షలు అందరికి 🌹

🍀 ప్రశాంత జీవన రహస్యమే గీతాసారం. అమృతగీతం భగవద్గీత 🍀

ప్రసాద్ భరద్వాజ


🌹 Happy Geeta Jayanti and Mokshada Ekadashi to all 🌹

🍀 The secret of a peaceful life is the essence of Geeta. Amrut Geeta Bhagavad Gita 🍀

Prasad Bharadwaja


గీకారం త్యాగరూపం స్యాత్ తకారమ్ తత్వబోధకమ్

గీతా వాక్య మిదమ్ తత్వం జ్ఞేయమ్ సర్వ ముముక్షుభి:

సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాననందనః|

పార్థోవత్సః సుధీర్భోక్తాదుగ్ధం - గీతామృతమ్మహత్||


మార్గశిర శుద్ధ ఏకాదశి "గీతాజయంతి". ఈ ఏకాదశిని "మోక్షద" ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశినాడు ఉపవాసం చేయడం వల్ల మోక్షప్రాప్తి కలుగుతుంది. ఇదే రోజున కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునునికి “భగవద్గీత” ను బోధించాడన్నది విశ్వాసం. అందువల్ల ఈ ఏకాదశి "గీతాజయంతి" అని కూడా వ్యవహారిస్తారు.

యుద్ధభూమిలో శ్రీ కృష్ణ భగవానునికి, అర్జునునికి మధ్య జరిగిన సంభాషణే భగవద్గీత. అయితే, దాని అసలైన సందేశం యుద్ధం గురించే కాదు, ప్రతిరోజూ వివేకవంతంగా ఎలా జీవించాలో తెలియజేయడం.


దాని అత్యంత ప్రధానమైన బోధన నిష్కామ కర్మ గురించి. అంటే ఫలితాలపై ధ్యాస ఉంచకుండా, శక్తిమేరకు కృషి చేయడం.


భగవద్గీతలోని 2వ అధ్యాయం, 47వ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు అర్జునుడికి ఇలా బోధించాడు...''కర్మలు చేయుట యందు మాత్రమే నీకు అధికారముంది, వాటి ఫలితములందు ఎన్నడూ లేదు. నీ కర్మఫలములకు సృష్టికర్తవు నీవని భావించకు; అట్లని నిష్క్రియ పట్ల నీకు అనురక్తి కలగనీయకు.''


దీని అర్థం ఏమిటంటే: అది మీ ఉద్యోగమైనా, మీ కుటుంబాన్ని పోషించడం అయినా, లేదా ఏదైనా బాధ్యత అయినా, మీ కర్తవ్యాన్ని నిర్వర్తించండి. కానీ ప్రతిఫలం గురించి, గుర్తింపు గురించి ఆందోళన చెందుతూ ఉండకండి. ''ఈ పని చేయడం వల్ల నాకేమి లభిస్తుంది'' అనే ఆందోళన ఒత్తిడిని మాత్రమే తెస్తుంది.


మీరు ఫలితంపై కాకుండా, కర్మపైనే దృష్టి సారించినప్పుడు స్వేచ్ఛ లభిస్తుంది. అదే సమయంలో, సోమరిగా లేదా నిష్క్రియగా మారకండి.


48వ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు అర్జునుడికి ఇలా సలహా ఇచ్చాడు...''ఓ ధనంజయ, యోగంలో నిమగ్నుడవై, సమస్త కర్మలను ఆచరించు. వాటి ఫలాలపై ఆసక్తిని త్యజించి, జయాపజయముల యందు సమభావం గలవాడవై ఉండు. ఈ మానసిక సమత్వమే యోగం.''


జీవితం ప్రశంసలను, నిందలను, విజయాన్ని, అపజయాన్ని తెస్తుంది. ఈ రెండు పరిస్థితులలోనూ ప్రశాంతంగా ఉండాలని శ్రీ కృష్ణుడు మనకు బోధిస్తాడు. ఈ సమభావమే నిజమైన యోగం. అంటే ఆంతరంగిక శాంతిని బాహ్య కర్మాచరణతో అనుసంధానం చేయడం.


3వ అధ్యాయం, 30వ శ్లోకంలో, ఈ స్థితిని సాధించడానికి శ్రీ కృష్ణుడు కీలకమైన మార్గాన్ని తెలియజేశాడు.


''సమస్త కర్మలను నాకు అర్పించు! అహంకారం, ఆశలు విడచి, నీ మనస్సును ఆత్మపై కేంద్రీకరించి, ఆందోళన నుండి విముక్తుడవై, కర్మాచరణమనే యుద్ధంలో నిమగ్నమై ఉండు.''


సరళమైన మాటల్లో చెప్పాలంటే, మీరు చేసే ప్రతి పనిని భగవంతునికి అంకితం చేయండి. ఈ విధంగా జీవించడం అంటే ప్రపంచం నుంచి విరమించుకోవడం కాదు... కోరికలు, అహంకారం లేకుండా, అపేక్ష, తీవ్రమైన చింత లేకుండా, ప్రతి కర్మను ఆయనకు ఒక సమర్పణగా నిర్వర్తించడం. ప్రశాంతమైన జీవితానికి ఇదే ఏకైకమార్గం.


5వ అధ్యాయం, 10వ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు ఒక అందమైన ఉపమానాన్ని అందించాడు:


''నీరు స్పృశించలేని తామరాకు వలె, కర్మలను నిర్వర్తించే యోగి, ఆసక్తిని త్యజించి, తన కర్మలను అనంతునికి సమర్పించడం ద్వారా, ఇంద్రియ బంధాలకు లోనుకాకుండా ఉంటాడు.''


బురదలో పెరిగినా దాని మలినం సోకని కమలం వలె, నిష్కామ కర్మను ఆచరిస్తూ, భగవంతునికి శరణాగతి చెందడం ద్వారా ప్రాపంచిక పోరాటాల మధ్య జీవిస్తూ కూడా ప్రశాంతంగా ఉండవచ్చు.


నిష్కామ కర్మ అంటే బాధ్యతల నుంచి పలాయనం కాదు, అది హృదయపూర్వకంగా- కార్యాలయాలలోను, మానవ సంబంధాలలోను, వ్యక్తిగత లక్ష్యాలలోను పనిచేయడం, కానీ ఫలితాల కోసం పాకులాడకుండా ఉండటం.


యుద్ధభూమి ప్రతీకాత్మకమే కావచ్చు, కానీ పోరాటం నిజమైనది-వ్యామోహానికీ స్వేచ్ఛకూ మధ్య, అహంకారానికీ శరణాగతికీ మధ్య, నిష్కామకర్మలోనే విజయం ఉందని గీత మనకు చూపిస్తుంది. ఎందుకంటే అది మాత్రమే శాశ్వత ఆనందాన్ని ఇవ్వగలదు.


మహాభారతంలో భీష్మ పర్వంలో ఉన్న 25వ అధ్యాయం నుంచి 42వ అధ్యాయం వరకు మొత్తం భగవద్గీత 18 అధ్యాయాలు. ఒక్కో అధ్యాయాన్ని ఒక్కో యోగం అంటారు. 6 యోగాలని కలిపి ఒక షట్కం అని..1 నుంచి 6 అధ్యాయాలను కర్మ షట్కమని, 7 నుంచి 12 వరకు భక్తి షట్కం అని, 13 నుంచి 18 వరకు జ్ఞాన షట్కం అని అంటారు.


భగవద్గీతలో 18 అధ్యాయాలున్నట్లే

మోక్ష పధానికి 18 మెట్లు వున్నాయి.


అవి...

1. గీత 2. గంగ 3. గాయత్రి 4. సీత 5. సత్య 6.సరస్వతి 7. బ్రహ్మవిద్య 8, బ్రహ్మవల్లి 9. త్రిసంధ్య 10. ముక్తిగేహిని 11. అర్థమాత్ర 12 చిదానంద 13. భవఘ్ని 14. భ్రాంతినాశిని 15. వేదత్రయి 16. పర 17. అనంత 18. తత్త్వార్థ జ్ఞాన మంజరి.


ఎవరైతే మోక్షస్థానాన్ని లక్ష్యంగా చేసుకున్నవారు ఈ పద్దెనిమిది మెట్లు ఎక్కి పరబ్రహ్మాన్ని పొందుతారు.


'కర్మ'… 'జ్ఞానం'గా మారటమే భగవద్గీతా సారాంశం. ఆ గీతా సుభాషితాల్లో కొన్ని..



1. మృత్యువు కేవలం శరీరం నుంచి ఆత్మను వేరు చేస్తుంది. ఆత్మకు చావు లేదు. ఆత్మ నిత్య సత్యమైంది. తనను తాను తెలుసుకోవడం, తనలోని అంతరాత్మను తెలుసుకోవడమే జ్ఞానం.


2. అభ్యాస, వైరాగ్యాల ద్వారా వస్తు ప్రపంచాన్ని వదలిపెట్టి, సర్వోత్కృష్టమైన పరబ్రహ్మాన్ని చేరుకోవడం యోగి అయిన వ్యక్తి లక్షణంగా ఉండాలి.


3. భగవంతుడిని చేరుకోవడానికి భక్తి, కర్మ, ధ్యాన, జ్ఞాన మార్గాలు ఉన్నాయి. వీటిలో ఏ మార్గం అనుసరించాలనేది భక్తుడి ఇష్టం. అంతిమ ఫలితం ఒకటే.


4. మనిషి కర్మ చేయకుండా ఉండలేడు. ఉండకూడదు కూడా. కాబట్టి, కర్మఫలితాన్ని అనుభవించక తప్పదు. అలాగని, కర్మ చేయటాన్ని విడిచిపెట్టకూడదు. కర్తవ్యాన్ని నిర్వహించి, ఫలితాన్ని భగవంతుడికి వదిలేయాలి.


5. సృష్టిలోని సమస్త ప్రాణులూ భగవంతుడి స్వరూపాలే. మనం చేసే అన్ని పూజలు, అర్చనలు, హోమాల ఫలితాలు భగవంతుడికే చెందుతాయి.


6. ప్రపంచంలోని జీవులన్నీ సత్వ, రజ, తమో గుణాలతో బంధించి ఉంటాయి. భగవంతుడి పాదాలను ఆశ్రయించిన వారికి ఈ బంధాల నుంచి విముక్తి కలుగుతుంది.


7. జయాపజయాలు, లాభనష్టాలు, సుఖదుఃఖాలు… అన్నీ భగవంతుడు ఇచ్చినవే. దేనికీ పొంగిపోకూడదు. విచారించకూడదు.


8. భక్తి, సాధన అనే పేర్లతో కాలక్షేపం పనికిరాదు. కర్తవ్యాన్ని విస్మరించడం ఏ మాత్రం తగదు. కర్మ చేయని వాడిని భగవంతుడు ఎట్టి పరిస్థితుల్లో అనుగ్రహించడు.

🌹🌹🌹🌹🌹



Comments


©2023 by Daily Bhakti Messages 3.
Proudly created with Wix.com

bottom of page