నిత్య తృప్తి - గీతాసారం (Eternal Satisfaction - Teachings of Gita)
- Prasad Bharadwaj
- Jan 28
- 1 min read

🌹నిత్య తృప్తి - గీతాసారం🌹
ఆకలితో ఉన్న నక్క చెట్టు పైన వేలాడుతున్న ద్రాక్ష పండ్ల కోసం ప్రయత్నించి, విఫలమై... అందని ద్రాక్ష పుల్లగా ఉంటుందని భావించింది... సుపరిచితమైన ఈ కథ మనం జీవితంలో అనుభవించే నిరాశ, అసంతృప్తి, ఆనందాలను అనేక కోణాలలో చూపిస్తుంది. క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడడానికి మానవుడి మెదడు చేసే విధుల్లో ఒకటైన ‘ఆనందాన్ని సంశ్లేషణ చేయడం’ గురించి సమకాలీన మనస్తత్వ శాస్త్రం మాట్లాడుతుంది. ద్రాక్ష పుల్లగా ఉందని తనను తాను తృప్తి పరచుకొని ముందుకు సాగుతూ, నక్క కృత్రిమమైన ఆనందాన్ని సృష్టించుకుంది. తృప్తి గురించి వివరించేటప్పుడు శ్రీకృష్ణుడు ‘‘మనం సృష్టించుకున్న ఆనందాన్ని అధిగమించాలి’’ అని చెప్పాడు. ‘‘సమస్త కర్మల పట్ల, వాటి ఫలితాల పట్లా సర్వదా ఆసక్తిని వదలుకొని, సంసార-ఆశ్రయ రహితుడై, నిత్యతృప్తుడైన మానవుడు కర్మల్లో చక్కగా నిమగ్నుడైనప్పటికీ అతను ఆ కర్మలకు కర్తకాదు’’ అని తెలిపాడు.
ఆత్మతృప్తి అనేది భగవద్గీతలోని మూలోపదేశాలలో ఒకటి. ఆత్మవాన్ లేదా ఆత్మతృప్తితో ఉండాలని అర్జునుడికి శ్రీకృష్ణుడు చాలా సందర్భాలలో సలహా ఇచ్చాడు. ఇది ఆత్మతో సంతృప్తి చెందడం తప్ప వేరొకటి కాదు. ఈ స్థితికి చేరినవారు అనుకూల, ప్రతికూల పరిస్థితులలో కూడా సంతృప్తిగా ఉంటారు. అంతకుముందు కర్మ, అకర్మల గురించి శ్రీకృష్ణుడు చెబుతూ ఈ క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడంలో తెలివైనవారు కూడా గందరగోళానికి గురవుతారన్నాడు. ఆ తరువాత ‘కర్మలో అకర్మ’ గురించి వివరిస్తూ... నిత్యతృప్తుడు కర్మ చేస్తున్నప్పటికీ ఏమీ చేయనట్టేనని స్పష్టం చేశాడు.
మనం రోజూ ఉండేదానికన్నా భిన్నంగా ఉండాలనుకోవడం మనలోని మౌలికమైన కోరిక. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ఆ కోరికకు అనుగుణంగా మనం ఎన్నో సాధించిన తరువాత కూడా... మళ్ళీ కొత్త కోరిక పుట్టి, మరో విధంగా ఉండాలని కోరుకుంటాం. భోగాలు, ఆస్తుల వేటలో కూడా గమ్యాలు నిరంతరం మారుతూ ఉంటాయి. ఇదే కథ పునరావృతమవుతుంది. భోగాలు, ఆస్తులుగా మనం భావించి వెంబడించేవన్నీ ఎండమావులు తప్ప మరేవీ కావనీ, అలా వెంబడించడం వల్ల మనకు అనారోగ్యం, అలసట కలుగుతుందని అవగాహన ఏర్పడినప్పుడు... కర్మఫలాలమీద మోహం వదులుకొని, నిత్యతృప్తులం అవుతాం. చిన్న పిల్లలను చూడండి.. ఏ కారణం లేకుండానే నవ్వుతూ, ఆనందంగా ఉంటారు. నిత్యతృప్తుల స్థితి అదే విధంగా ఉంటుంది..
🌹 🌹 🌹 🌹 🌹
Comments