top of page

నరక చతుర్థశి శుభాకాంక్షలు, Good Wishes on Naraka Chaturdhashi

  • Writer: Prasad Bharadwaj
    Prasad Bharadwaj
  • Nov 11, 2023
  • 2 min read

🌹🍀. నరక చతుర్థశి శుభాకాంక్షలు అందరికి, Naraka Chaturdhashi Good Wishes to All 🍀🌹


🌻. ప్రసాద్ భరద్వాజ


🌴. నరక చతుర్ధశి విశిష్టత - తత్వ విచారణ 🌴


శ్రీకృష్ణుడు నరకాసురుడిని సంహరించిన రోజు నరక చతుర్ధశి. నరకాసురుడు ప్రాగ్-జ్యోతిషపురం అనే రాజ్యానికి రాజు. ప్రస్థుతం అది అస్సాంలోని గౌహతి ప్రాంతం. ఆ రాజ్యంలో పదహారు వేలమంది స్త్రీలు నరకాసురుని వద్ద బంధీలుగా ఉండేవారు. అంతటితోనే కాక ఋషులను హింసించేవాడు. శ్రీకృష్ణుడు నరకాసురుడిని సంహరించాలని అనుకున్నాడు, వాడు భూదేవి సంతనం కావడంచే అమె అంగీకారం కోసం వేచి చూసాడు. భూదేవి అవతారమైన సత్యభామ తనతో నరకాసురుడిని వధించడానికి ఒప్పుకొని శ్రీకృష్ణునికి యుద్దంలో సహాయం చేసింది, అట్లా నరకాసురుడి వధ జరిగింది. పదహారు వేల మంది స్త్రీలు తిరిగి వారిని తమవాళ్ళు అంగీకరించరు అని శ్రీకృష్ణుడినే అంగీకరించమని కోరారు. అట్లా కృష్ణుడు వారిని అంగీకరించాడు. నరకాసురుడి వధ అనంతరం ఆ రాజ్యంలోని వారందరికి అందకారం నుండి బయటకు వచ్చారు, కనుక సంతోషానికి గుర్తుగా దీపాలతో అలంకరించుకొని పండగ జరుపుకున్నారు. అదే దీపావళి పండగ. అయితే మనం కథ వెనక ఉన్న సారాంశం గమనించాలి.



🍀. నరకాసుర వధ తత్వ విచారణ 🍀


ప్రపంచం మొత్తాన్ని మన శరీరంలో చూసుకోవచ్చు. శాస్త్రాలు విశ్వంలో ఉన్న వివిద అంశాలని చెప్పడానికి మానవ శరీరంతో పోల్చి చూపిస్తాయి. ఇందులో ఉండే క్రమాన్ని సవరించుకోగలిగితే ప్రపంచం అంతా అట్లానే సవరించ బడుతుంది. రక రకాలైన ప్రవృత్తులు ఎట్లా పైకి వస్తూ ఉంటాయి ఆయా ఆయా సమయాల్లో ఆయా మనుషుల ప్రవృత్తులని గమనించి చరిత్రలో జరిగిన సందర్భాలను మన ఋషులు మనకు అందించారు. ఇలాంటి ప్రవృత్తిని మంచిది కాదు, కనుక దాన్ని అణిచివేయాలి అని చూపిస్తారు. అందులో మనకు ఆ కాలంలో ఏమి జరిగింది తెలుస్తుంది అంతే కాక మన ప్రవృత్తిని ఎట్లా మార్చుకోవాలో తెలుస్తుంది.


మనకు సమన్వయం చేసుకోనేప్పుడు అది కేవలం భావన కోసం మాత్రమే అని పిస్తుంది. అయితే చరిత్రలో మనకు కనిపించే ఇతిహాస పురాణాలలో కనిపించనివి ఎన్నో జరిగి ఉన్నాయి, కానీ అందులో మనం తెలుసు కోవాల్సిన సారాంశం అంత లేనందున వాటిని మనదాకా అందించలేదు తప్ప మనకు తెలియని ఎంతో చరిత్ర ఉంటుంది. అయితే మన ఇతిహాస పురాణాల్లో మనకు కథ మాత్రమే కాక మనల్ని సవరించుకొనే ఎన్నో రహస్యాలు ఉంటాయి.నరకాసురుడు చరబట్టిన పదహారువేల మంది చివరికి కృష్ణుడినే కోరుకున్నారు. పదహారు అని చెప్పినప్పుడు మనకు సమన్వయం చేసుకోవచ్చు. మనలో పదహారు అంశాలు ఉంటాయి.


శరీరం తయారు కావడానికి కావల్సిన పంచ భూతాలు, ఆ పంచ భూతములకు ఐదు గుణములు ఉన్నాయి. నీరుకు రుచిని తెలిపే గుణం, అగ్నికి రంగుని చూపే, మట్టికి వాసన గుర్తించే గుణం, గాలికి స్పర్శ తెలిపే గుణం, ఆకాశానికి శబ్దాన్ని వినిపించే గుణం ఉంది. ఈ ఐదింటిని గుర్తించడానికి ఐదు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఇన్నింటిని క్రమ బద్దం చేసే శక్తి మనస్సుకు ఉంది. మొత్తం పదహారు అంశాలు. అయితే వీటన్నింటిని వాడుకొనే యోగ్యత ఉంది. ఇవన్నీ వాడుకోవాల్సింది ఎవరి కోసం. అయితే వీటన్నింటిని మనం భగవంతుని కోసం వాడాలి. కానీ ఈ ప్రకృతిలో పడ్డాక అన్నింటిని మనకోసమే వాడుకుంటాం. ఏది చూసినా నాకే అని అనుకుంటాం.


చెడిన మనస్సు ఉంటే జీవితం నరకం అవుతుంది, అట్లాంటి ప్రవృత్తి కలవాడే నరకుడు. నరకాసురుడు ఉండే నగరం పేరు ప్రాగ్ జ్యోతిష పురం, జ్యోతిష అంటే 'కాంతి కల', ప్రాగ్ అంటే 'పోయిన', అంటే ఒకప్పుడు ఉన్న కాంతిని కోల్పోయిన నగరం అని అర్థం వస్తుంది. మనకూ ఒకనాడు మంచి శరీరాలు ఉండేవి, కానీ ఈనాడు మనకు ఉన్న శరీరాలు మురికి స్రవించేవి. మనం ఏది కోరుకుంటే అది జరగాల్సిన స్థితి ఉండేదట. మనం ఈ ప్రకృతిని అంటించు కుంటున్నాం కనుక మనకు ఈ స్థితి. శరీరాని కంటే వేరే నేను ఒకడిని ఉన్నాను అనికూడా తెలియక పడి ఉన్నాం. ఏదో ఒక పరిస్థితిలో ఎవరో చెబితే కనీసం ఆలోచించేంత శక్తి మానవునికి ఉంది. కనీసం చివరి క్షణాల్లో అయినా గుర్తించే అవకాశం ఉంది.


మానవ జన్మలో మనం ఎన్నో సార్లు పతనం అయినా ప్రయత్నం చేస్తే బాగుపడే అవకాశం ఉంది. ఆసురీ ప్రవృత్తులని దూరం చేసుకొనే ప్రయత్నం చేయాలి. శరీరం, అనుభవించే గుణాలు, జ్ఞానేంద్రియాలు మరియూ మన మనస్సుని అన్నింటిని శ్రీకృష్ణ మయం చేస్తే ఈ ప్రాగ్ జ్యోతిష పురం అనే మన శరీరం ఆనందమయం అవుతుంది. కొత్త కాంతి కలది అవుతుంది, నరక చతుర్థశి - దీపావళి మనకు అదే విషయాన్ని తెలుపుతుంది.


🌹 🌹 🌹 🌹 🌹


Recent Posts

See All

Comments


©2023 by Daily Bhakti Messages 3.
Proudly created with Wix.com

bottom of page