🌹 మకర సంక్రాంతి విశిష్టత 🌹
పండుగలెన్ని ఉన్నా, తెలుగు జాతికి పెద్ద పండుగ - సంక్రాంతి. కాల సంబంధమైన పండుగలు, ముఖ్యంగా మూడు. ఉగాది, సంక్రాంతి, రథసప్తమి. ‘సమ్యక్ క్రాంతి - సంక్రాంతి’. సమ్యక్ అంటే పవిత్రమైన, క్రాంతి. అనగా మార్పు. సూర్యుడు ఉత్తరాభిముఖంగా పయనిస్తూ, ప్రకృతిలో శోభ, విలాసము, అందము ఆనందము చేకూరే ‘మార్పు’ను తీసుకొని వస్తాడు.
‘పంచపాదం పితరం ద్వాదశాకృతిం, దివ ఆహుః పరే అర్ధే పురీషిణం, అధామే అన్య ఉపరే విచక్షణం సప్తచక్రే షడర ఆహురర్పి తమితి’ అన్నది ఋగ్వేదం. కాలాన్ని ఏర్పరచి భాగవిభాగాలుగా వున్న సంవత్సరంగా కొలత ఇచ్చి, హేమంతము - శిశిరము ఒక ఋతువుగా చెపితే - అయిదు ఋతువులుగా, ఏడు చక్రాల రథముతో, ఏడు గుర్రాలుగా చెప్పబడే ఏడు రంగులతో లేక వారములోని ఏడు దినములతో పన్నెండు రూపాలు అనగా పన్నెండు నెలలుగా, అన్నిటికీ నియామకుడుగా, తండ్రిగా వ్యవహరిస్తున్నాడు - సూర్యుడని ఋగ్వేదం చెప్పింది. అటువంటి సూర్యుని గమనాన్ననుసరించి వచ్చే పండుగ మకర సంక్రాంతి, ఉత్తరాయణ పుణ్యకాలం - మకర సంక్రమణం.
చంద్రుడు ఒక రాశి నుండి మరో రాశిలో ప్రవేశించటానికి 21 రోజులు పడుతుంది. రవికి ఒక రాశి నుండి మరో రాశిలో ప్రవేశానికి ఒక నెల పడుతుంది. అంటే సంవత్సరంలో పన్నెండు రాశులలో సూర్యుడు చేరటాన్ని ‘సంక్రమణం’ లేక ‘సంక్రాంతి’ అంటారు. ‘సంక్రాంతి’ అంటే ‘చేరుట’ అని అర్థం.
సూర్యుడు, కర్కాటక ధనూ మకర రాశులలో ప్రవేశించే సమయాలకు అనగా సంక్రాంతులకు, ఒక ప్రత్యేకత ఉన్నది. అందునా, మకర రాశిలో ప్రవేశించేటపుడు ఒక విశిష్టత ఉంది. అదే మకర సంక్రాంతి. మకర రాశి నుండి మిధున రాశి వరకు, సూర్యుడు సంచరించే కాలం - ఉత్తరాయణం, వెలుగు మార్గం. మకర సంక్రమణం హేమంత ఋతువులో జరుగుతుంది.
శని ప్రభావము:
మకర రాశికి శని అధిపతి. శని - వాయుతత్త్వం, వాతతత్త్వం. కనుక వాతహరములైన వంటలూ తిలా (నువ్వులు) ప్రాధాన్యమూ కనిపిస్తాయి. వాతహరములైన నువ్వులతోనూ, బెల్లముతో కూడిన పిండి వంటలు సంక్రాంతి పండుగనాడు చేస్తారు. గుమ్మడి దానమిస్తారు (మంచి గుమ్మడి) సజ్జ రొట్టెలు తింటారు. వృషభము, ఆవుదూడ - చిన్న వెండి విగ్రహాల్ని దానమిస్తారు. హేమంత ఋతువులో వచ్చే అనారోగ్యాలు, నువ్వులు బెల్లం, సజ్జలతో చేసిన పదార్థాలతో చేసిన వంటలతోను, సూర్యారాధనతోనూ, ప్రాణాయామంతోనూ నయమవుతాయి. తొలిమాపు వేళ చిరంజీవులు, పెద్దలకు మ్రొక్కి వారి ఆశీస్సులు తీసుకుంటారు. కనుకనే దీనిని మ్రొక్కుల పండుగ అంటారు. ఇది మకర సంక్రాంతి విశిష్టత.
🌹🌹🌹🌹🌹
Comentarios