🌹🍀. రధసప్తమి, నర్మదా జయంతి, బీష్మాష్టమి శుభాకాంక్షలు - Ratha Saptami, Narmada Jayanti, Bhishma Ashtami Greetings to all 🍀🌹
ప్రసాద్ భరద్వాజ
🌹🌻. రథసప్తమి - బీష్మాష్టమి విశిష్టత 🌻🌹
సప్త సప్త మహా సప్త, సప్త ద్వీపా వసుంధరా
సప్తార్క పర్ణ మాధాయ సప్తమి రధ సప్తమి
ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడి జన్మదినమే రథసప్తమి. సూర్యుని గమనం ఏడు గుర్రములు పూన్చిన బంగారు రథం మీద సాగుతుందని వేదము "హిరణ్యయేన సవితారథేన" అని తెలుపుతుంది. సూర్య గమనం ప్రకారం ఉత్తరాయనము, దక్షిణాయనము అని రెండు విధములు. ఆషాఢమాసము నుండి పుష్యమాసము వరకు దక్షిణాయనము. సూర్యరథం దక్షిణాయనంలో దక్షిణ దిశగా పయనిస్తుంది. తరువాత సూర్యుడు మకరరాశి ప్రవేశం ఉత్తరాయన ప్రారంభ సూచకముగా రథసప్తమి అని పేరు వచ్చింది. అందుకే ఈరోజు పవిత్ర దినముగా భావించి భారతీయులు సూర్యుని ఆరాధిస్తారు. "భా" అంటే సూర్యకాంతి, "రతి" అంటే సూర్యుడు, కావున సూర్యుని ఆరాధించువారు అందరూ భారతీయులు. "భారతీ" అంటే వేదమాత. వేదమాత నారాధించు వారును భారతీయులే.
సూర్యగ్రహణతుల్యా సా శుక్లా మాఘస్య సప్తమీ,
అరుణొదయవేళాయాం స్నానం తత్ర మహాఫలమ్.
మాఘే మాసి సితే పక్షే సప్తమీ కోటిపుణ్యదా,
కుర్యాత్ స్నానార్ఘ్యదానాభ్యా మాయురారోగ్యసంపదః.
మాఘ శుద్ధ సప్తమి సూర్య గ్రహణముతో సమానము. ఆ రోజున అరుణోదయ వేళ చేసిన స్నాన, జప, అర్ఘ్యప్రదాన, తర్పణ, దానాదులన్ని అనేక కోట్ల రెట్లు పుణ్య ఫలములను ఆయురారోగ్య సంపదలను ఇచ్చును. సప్తమినాడు షష్ఠి తిథి గూడ యున్నచో షష్ఠీ సప్తమీ తిథుల యోగమునకు పద్మమని పేరు. ఈ యోగము సూర్యుని కత్యంత ప్రీతికరము. ఆ సమయమున ఏడు జిల్లేడు ఆకులను ధరించి నదీ స్నానము చేసినచో ఏడు జన్మములలో చేసిన పాపములు నశిస్తాయని గర్గమహాముని ప్రబోధము. జిల్లేడు ఆకునకు అర్కపత్రమని పేరు. సూర్యునికి "అర్కః" అని పేరు. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే మిగుల ప్రీతి. ఏడు జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే గాక, ఏడు జన్మల్లో చేసిన పాపములను, ఏడు రకములైన వ్యాధులను నశింపజేస్తాయి. ఈ జన్మలోను, జన్మాంతరంలోను (రెండు), మానసిక, వాచిక, శారీరకములు (మూడు), తెలిసిచేసేవి, తెలియకచేసేవి (రెండు) కలిసి మొత్తం ఏడు పాపములు నేడు రోగాలకు కారణములు.
రథసప్తమి నాడు బంగారముతో గాని, వెండితో గాని, రాగితో గాని రథమును చేయించి, కుంకుమాదులు, దీపములతో నలంకరించి అందు ఎర్రని రంగుగల సూర్యుని ప్రతిమ నుంచి, పూజించి, గురువునకు ఆ రథమును దానమీయ వలెను, ఆ రోజు ఉపవాసముండి, సూర్య సంబంధమగు రథోత్సవాది కార్యక్రమములను చూచుచూ కాలక్షేపం చేయాలి. ఇట్లు రథసప్తమీ వ్రతముచే సూర్యభగవానుని అనుగ్రహముచే ఆయురారోగ్యాది సకల సంపదలు కురియునని పురాణప్రబోధము. రథసప్తమి వ్రతము మన సంప్రదాయమున నిలచియుండుట భారతీయతకు చిహ్నము.
🌻. సూర్య స్తోత్రం 🌻
ధ్యాయేత్సూర్యమనంతకోటికిరణం తేజోమయం భాస్కరం
భక్తానామభయప్రదం దినకరం జ్యోతిర్మయం శంకరమ్
ఆదిత్యం జగదీశమచ్యుతమజం త్రైలోక్యచూడామణిం
భక్తాభీష్టవరప్రదం దినమణిం మార్తాండమాద్యం శుభమ్
🌻. పాలు పొంగించే విధానం 🌻
సూర్యుని కిరణాలూ పడే చోట..లేదా..తులసిచెట్టు ఉండే దగ్గర ఓ పీటను పెట్టి దాన్ని పసుపుతో శుద్ధి చేసి, ముగ్గులుపెట్టి, సూర్యభగవానుడి ఫోటోను ఉంచాలి. గంధం, కుంకుమతో బొట్టు పెట్టాలి. ఎర్రటి పుష్పాలతో అలంకరించాలి.
ఏడు చిక్కుడు కాయలను తీసుకుని రథంగా తయారుచేసుకోవాలి. ఈ రోజు సూర్యునికి నేతితో దీపం వెలిగించి ఆవు పిడకలను కర్పూరంతో వెలిగించి దానిపై ఇత్తడి పాత్ర ఉంచి ఆవుపాలు, బెల్లం, బియ్యం తో చేసిన పరమాన్నం చేసుకోవాలి. ఈ పరమాన్నం సూర్యునికి ఎంతో ప్రీతి.
🌹.బీష్మాష్టమి విశిష్టత 🌹
ప్రతి సంవత్సరం రథ సప్తమి అనంతరం భీష్మ అష్టమి అనుసరించాల్సి ఉంటుంది. ఈ పవిత్రమైన రోజున ప్రతి ఒక్కరు మూడు దోసిళ్ల అర్ఘ్యం భీష్మ ప్రీతికి అనుసరించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను అందరూ భీష్మ తర్పణం అని అంటారు. ధర్మశాస్త్రం ప్రకారం, భీష్మ తర్పణం, యమ తర్పణం తండ్రి బతికి ఉన్నవారు కూడా చేయాల్సిందే. ఇది ప్రతి ఒక్కరి కర్తవ్యం. ఈరోజున విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేస్తారు.
భీష్మాష్టమి రోజున విష్ణుమూర్తి పూజ అనంతరం ఆవునెయ్యితో పంచహారతి ఇవ్వాలి. దీపారాధనకు తామరవత్తులను వాడాలి. విష్ణుమూర్తి ఆలయాల్లో విష్ణు అష్టోత్తరం, సత్యనారాయణ వ్రతం, బ్రహోత్సవ దర్శనం, లక్ష తులసి పూజ వంటివి నిర్వహించడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని పండితులు చెబుతారు. అలాగే విష్ణు సహస్రనామం, విష్ణు పురాణం, సత్య నారాయణ వ్రత పుస్తకాలను సన్నిహితులకు తాంబూలాలు ఇవ్వాలని పురోహితులు చెబుతున్నారు.
🍀. భీష్మ అష్టమి తర్పణ శ్లోకం 🍀
వైయాఘ్రపాద గోత్రాయ సాంకృత్య ప్రవరాయ చ |
గంగాపుత్రాయ భీష్మాయ ఆజన్మ బ్రహ్మచారిణే ౧
భీష్మః శాన్తనవో వీరః సత్యవాదీ జితేంద్రియః |
ఆభిరద్భిరవాప్నోతు పుత్ర పౌత్రోచితాం క్రియామ్ ౨
వసూనామవతారాయ శంతనోరాత్మజాయ చ |
అర్ఘ్యం దదామి భీష్మాయ ఆజన్మబ్రహ్మచారిణే ౩
భీష్మాయ నమః ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం
🌹 🌹 🌹 🌹 🌹
Comentarios