🌹. విజయదశమి శుభాకాంక్షలు అందరికి , Happy Vijayadashami to All. 🌹
ప్రసాద్ భరద్వాజ
🍀. శ్రీ అపరాజితా దేవి స్తోత్రం 🍀
నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః |
నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మతామ్
రౌద్రాయై నమో నిత్యాయై గౌర్యై ధాత్ర్యై నమో నమః |
జ్యోత్స్నాయై చేన్దురూపిణ్యై సుఖాయై సతతం నమః
🍀. శ్రీ విజయ దుర్గా స్తోత్రము 🍀
దుర్గాదుర్గార్తిశమనీ దుర్గాపద్వినివారిణీ | దుర్గమచ్చేదినీ దుర్గసాధినీ దుర్గానాశినీ
దుర్గాతోద్ధారిణీ దుర్గనిహంత్రీ దుర్గమాపహా | దుర్గమ జ్ఞానదా దుర్గదైత్య లోకదవానలా
🌷. విజయదశమి పండుగ విశిష్టత 🌷
దేవదానవులు పాల సముద్రమును మధించినప్పుడు అమృతం జనించిన శుభ ముహూర్త దినం ఈ విజయ దశమి రోజే అని తెలియచేయ బడింది . 'శ్రవణా' నక్షత్రంతో కలిసిన ఆశ్వయుజ దశమికి "విజయ"అనే సంకేతమున్నది. అందుకనే దీనికి 'విజయ దశమి' అను పేరు వచ్చినది. ఏ పనైనా తిధి ,వారము తారా బలము , గ్రహాబలము ముహూర్తము మున్నగునవి విచారించకుండా, విజయదశమి నాడు చేపట్టినచో ఆ కార్యమున విజయము తధ్యము .'చతుర్వర్గ చింతామణి 'అనే ఉద్గ్రందము ఆశ్వయుజ శుక్లదశమి నాటి నక్షత్రోదయ వేళనే 'విజయం ' అని తెలిపి యున్నది . ఈ పవిత్ర సమయము సకలవాంచితార్ద సాధకమైనదని గురు వాక్యము.
విజయదశమి పండుగ అపరాజిత పేరు మీద వస్తుంది. పరాజయం లేకుండా విజయాన్ని సాధించేది కాబట్టి, విజయదశమి అయింది. పాండవులు శమీ వృక్ష రూపమున ఉన్న అపరాజిత దేవి ఆశీస్సులు పొంది కౌరవులపై విజయము సాదించారు . "శ్రీ రాముడు" విజయదశమి రోజున ఈ 'అపరాజితా' దేవిని పూజించి రావణుని సంహరించి, విజయము పొందినాడు. విజయదశమి రోజు పరాజయం లేని అపరాజితాదేవిని .. శ్రీచక్ర అధిష్టాన దేవత... షోడశ మహావిద్యా స్వరూపిణి అయిన శ్రీ విజయదుర్గను ... శ్రీ రాజరాజేశ్వరీదేవిని ఎవరైతే పూజిస్తారో! వారందరికీ ఖచ్చితంగా విజయం లభిస్తుంది. అమ్మవారు పరమశాంత స్వరూపంతో, సమస్త నిత్యామ్నయ పరివార సమేతంగా, మహా కామేశ్వరుడుని అంకంగా చేసుకొని, ఆది పరాశక్తి... రాజరాజేశ్వరి దేవిగా శాంత స్వరూపంతో చిరునవ్వులు చిందిస్తూ, చెరకుగడను (ఇక్షుఖండం) ధరించి, ఒక చేతితో అభయ ముద్రతో దర్శనమిస్తుంది. మణిద్వీప వర్ణనలో "శ్రీపురంలో చింతామణి "అనే గృహంలో నివసిస్తూ ఉంటుంది. చెడుపై సాధించే విజయమే విజయదశమి. ముఖ్యంగా మన మనసులో ఉన్న చెడు ప్రవర్తన మార్చుకుని (చెడుపై సాధించిన విజయంగా..) విజయదేవిని, విజయదశమి రోజు పూజిస్తే సర్వ శుభాలూ కలుగుతాయి. ఈమె ఆది ప్రకృతి స్వరూపిణి. దుర్గాదేవి వివిధ కల్పాలలో, వివిధ రూపాలు ధరించి నానా దుష్టజనులని సహకరించి, లోకాలకి ఆనందం కలిగించింది. మహిమాన్విత అయిన శ్రీచక్ర అధిష్టాన దేవతయే... లలితా దేవతయే... శ్రీరాజరాజేశ్వరీ దేవి. ఈ తల్లి నివాసం "శ్రీమణిద్వీప -- శ్రీనగర స్థిత -- చింతామణి గృహం". ఈ తల్లి ఎక్కడ నివసిస్తుందో! అక్కడ అన్నీ శుభాలే!!!
🍀. దసరా సాధనాపర విశిష్టత 🍀
దసరా అంటే ఏమిటి ? మనలో ఉన్న పంచ జ్ఞాన, పంచ కర్మేన్ద్రియాలైన దశ ఇంద్రియాలు- దోపిడీ, హింస, స్త్రీ వ్యామోహం, లోభం, వంచన, పరుష వాక్కు, అసత్యం, పరనింద, చాడీ చెప్పటం, అధికార దుర్వినియోగం అనే దశ అంటే పది పాపపు పనులు చేస్తాయి. ఈ పది రకాల పాపాలు హరి౦చటానికి జగన్మాతను కొలిచే పండగనే ’’దశ హర‘’ అంటారు. అదే దసరా గా మారింది. బాల్య, యవ్వన, కౌమార వార్ధక్య౦ 4 దశలు దాటి పోవాలంటే జన్మ రాహిత్య స్థితి పొందాలి. ఈ జన్మ రాహిత్య స్థితిని పొందటానికి , మానవ జన్మల దశలను హరి౦చ మని శ్రీ దేవిని నవరాత్రులు ఆరాధించటమే దశహరా – దసరా. పరుషంగా మాట్లాడటం, అబద్ధాలు చెప్పటం, అసంబద్ధమైన మాటలు మాట్లాడటం, సమాజం వినలేని మాటలు మాట్లాడటం – ఈ నాలుగు రకాల పాపాలు మాటల ద్వారా చేసేవి. తనది కాని ధనము, వస్తువులపై వ్యామోహం కలిగి ఉండటం, ఇతరులకు ఇబ్బంది కలిగించే పనులను చేయటం, ఇతరులకు చెడు చేయాలనుకోవడం ఈ మూడు మానసికంగా చేసే పాపాలు. అర్హత లేని వానికి దానాన్ని ఇవ్వడం, శాస్త్రము ఒప్పని హింసను చేయడం, పర స్త్రీని లేదా పురుషున్ని స్వీకరించడం ఈ మూడు శరీరంతో చేసే పాపాలు. మొత్తం ఇవి పది పాపాలు. ఈ పది పాపాల నుండి విముక్తిని ప్రసాదించి, మనందరి జీవితాలు సుఖసంతోషాలతో, సకల ఐశ్వర్యాలతో ఉండేలా చేయమని దుర్గామాతను వేడుకోవాలి.
🙏. చదువుకోవలసిన స్తోత్రాలు 🙏
రాజరాజేశ్వరి దేవి అష్టోత్తరం, కవచం, సహస్రనామ స్తోత్రం, శ్రీ విజయదుర్గా స్తోత్రం ఇత్యాదివి చదువుకోవాలి. లలితా సహస్రనామాల్లో "రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభా" అనే శ్లోకం అత్యంత ఫలదాయకం. "ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవతాయై నమః" అనే మంత్రం జపించుకోవచ్చు. రాజరాజేశ్వరి దేవి గాయత్రి మంత్రం "ఓం రాజరాజేశ్వరి రూపాయ విద్మహే! అంబికాయై ధీమ హి తన్నోమాతః ప్రచోదయాత్ "అనే మంత్రాన్ని జపించుకోవాలి.
🌹 🌹 🌹 🌹 🌹
Comments