top of page
Writer's picturePrasad Bharadwaj

వామన జయంతి శుభాకాంక్షలు అందరికి / Vamana Jayanthi Greetings to All


🌹 వామన జయంతి శుభాకాంక్షలు అందరికి / Vamana Jayanthi Greetings to All 🌹


Prasad Bharadwaj


'ధర్మ సంస్థాపనకోసం అవసరమైన సందర్భాల్లో అవతరిస్తూనే ఉంటా'నని శ్రీమహావిష్ణువు అభయ ప్రదానం చేశాడు. ఆ పరంపరలో ఆవిష్కారమైన అయిదోది వామనావతారం. భాద్రపద శుద్ధ ద్వాదశినాడు అదితి, కశ్యపుల కుమారుడిగా శ్రీహరి వామనమూర్తిగా అవతరించాడు. దీన్ని వామన ద్వాదశిగా, విజయ ద్వాదశిగా వ్యవహరిస్తారు. సృష్టిలోని జీవావరణంలో జీవులు సూక్ష్మరూపం నుంచి మహా భారీకాయం వరకు వైవిధ్యభరితంగా గోచరమవుతాయి. ఈ అణుత్వం, మహారూపాలు పరస్పర విరుద్ధమైనవి. కానీ, ఆ వైవిధ్యం ఆత్మ, పరమాత్మల విషయంలో లేదని వేదోక్తి. ఆత్మ అణువు కంటే సూక్ష్మమైనది, మహత్తరమైనది. అది ఎంత సూక్ష్మమైనదో, అంత స్థూలమైనదని కఠోపనిషత్తు ప్రకటించింది. వామనావతార నేపథ్యం ఇదే!


వామనావతార విశేషాల్ని శ్రీమద్భాగవతం, వామన పురాణాలు విశదీకరిస్తున్నాయి. ఓసారి బలి చక్రవర్తి ఇంద్రుణ్ని ఓడించి, స్వర్గానికి అధిపతి అయ్యాడు. విజయగర్వంతో రాక్షసులు అనేక అకృత్యాలకు పాల్పడసాగారు. దాంతో దేవతల మాతృమూర్తి అదితి కలత చెంది, కేశవుణ్ని వేడుకుని, అనుగ్రహాన్ని పొందింది. ఫలితంగా నారాయణుడు దేవతల రక్షణార్థం వామనుడిగా అవతరించాడు. అతనికి ఉపనయన సంస్కారాలు జరిగాయి. బ్రహ్మ తేజస్సు, దివ్య యశస్సులతో వెలిగే వటుడైన వామనుడు దండాన్ని, గొడుగును, కమండలాన్ని ధరించి బలి చక్రవర్తి నిర్వహించే యజ్ఞశాలలోకి ప్రవేశించాడు. 'స్వస్తి జగత్త్రయీ భువన శాసనకర్తకు...' అంటూ బలిని ఆశీర్వదించాడు. సందర్భోచిత లౌక్యాన్ని ప్రదర్శించాడు. వామనుడి వర్చస్సు, వాక్చాతుర్యానికి ముగ్ధుడై బలి చక్రవర్తి ఏం కావాలో కోరుకొమ్మన్నాడు. 'కేవలం నా పాదాలకే పరిమితమైన మూడు అడుగుల భూమిని మాత్రం నాకివ్వు చాలు' అన్నాడు వామనుడు. ఆ వటుడి రూపంలాగానే అతడి కోరిక కూడా కురచగానే ఉందని బలి భావించాడు. భూ దానానికి సమాయత్తమైన బలిని అతడి గురువు శుక్రాచార్యుడు నిలువరించాడు. అయినా బలి శుక్రుడి మాట వినకుండా, వామనుడికి ఉదకపూర్వకంగా భూమిని దానం చేశాడు. త్రివిక్రముడిగా వామనుడు విరాట్‌ రూపాన్ని సంతరించుకుని, ఓ పాదంతో భూమినీ, మరో పాదంతో స్వర్గాన్నీ ఆక్రమించి, మూడోపాదం బలి శిరస్సుపై ఉంచి, అతణ్ని రసాతలానికి అణగదొక్కాడు. బలి సర్వ సమర్పణా భావానికి ప్రసన్నుడైన వామనుడు సుతల లోక రాజ్యాన్ని అనుగ్రహించాడు. ఇంద్రుడికి తిరిగి స్వర్గలోకాధిపత్యాన్ని కల్పించాడు.


వామన పురాణంలో ఇదే గాథను పోలిన మరో వృత్తాంతం గోచరమవుతుంది. దుంధుడు అనే దానవుడు దేవతలపై దండెత్తే బలాన్ని సమకూర్చుకోవడానికి దేవికా నదీ తీరాన అశ్వమేధ యాగం చేయసాగాడు. దుంధుణ్ని యుక్తితో జయించాలని, శ్రీహరి వామన రూపంలో దేవికానదిలో ఓ దుంగలాగా తేలుతూ కొట్టుకుపోసాగాడు. దుంధుడు, అతడి అనుచరులు ఆ బాలుణ్ని రక్షించారు. తన పేరు గతి భానుడనీ, తాను మరుగుజ్జునైనందువల్ల ఆస్తి వివాదాల్లో తనను దాయాదులు నదిలో పడవేశారని చెప్పాడు. అతడి దీనగాథను విని దుంధుడు ఏం కావాలో కోరుకొమ్మన్నాడు. మూడడుగుల నేల కోరిన వామనుడు ఆ సంవిధానంలోనే దుంధుణ్ని భూమిలోకి తొక్కి సమాధి చేశాడని పురాణగాథ.


వామనావతారం ఆత్మ తత్వాన్ని అద్భుతంగా ప్రకటించింది. జీవుడు తనలో ఉన్న ఆత్మ, విశ్వాంతరాళంలో ఉన్న పరమాత్మ ఒక్కటేనని జ్ఞానపూర్వకంగా గుర్తించాలి. ఆ స్పృహ ఏర్పడే కొద్దీ వామనరూపం అనూహ్యంగా పెరిగి పెద్దదై, విశ్వవ్యాప్తమై, పరమాత్మ తత్వమై భాసిల్లుతుంది. యజ్ఞయాగాదులనేవి పేరుకోసం చేయవద్దనీ, నేను ప్రభువును, నేను గొప్ప దాతనని గర్వించడం తగదని భగవద్గీత హెచ్చరించింది. పరుల ధనాన్నీ, భూమిని ఆక్రమించడం, దానం చేయడం, నేను కర్తను, భోక్తను అని విర్రవీగేవారు అజ్ఞానులని ఈశావాస్య ఉపనిషత్తు చెబుతోంది. ఈ నేపథ్యమే బలి పతనానికి దారి తీసింది. మనిషి బిందు స్థితిలో బీజప్రాయంగా నిద్రాణంగా ఉన్న శక్తిని ఆత్మవిశ్వాసంతో గుర్తించాలి. దీని ద్వారా మనిషి మహనీయుడిగా ఎదగవచ్చని వామనావతారం సందేశమిస్తుంది.


🌹🌹🌹🌹🌹


Kommentare


bottom of page