🌹 సిద్దేశ్వరయానం - 91 🌹
💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐
🏵 ప్రస్తుత రంగము 🏵
ఆంధ్ర ప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలోని ఏల్చూరు గ్రామం మా స్వస్థలం. శ్రీ వత్సగోత్రం మాది. ఇంటి పేరు పోతరాజువారు.మా ప్రSతామహులు రామకవి, గొప్పవండితుడు. సంస్కృతాంధ్రములలో అనర్గళంగా కవిత చెప్పినవాడు. ఒక్క సాహిత్యం లోనే కాక జ్యోతిష, సాముద్రిక, ఇంద్రజాల, సంగీతాది బహువిద్యలలో ప్రవీణుడు, ఆశుకవితాచక్రవర్తులుగా సుప్రసిద్ధులైన కొప్పరపు సోదరకవులు వీరి శిష్యులే.
వారు వ్రాసిన గ్రంధాలు ఎన్నో ఉండేవని విన్నాము. కానీ మా తరం వచ్చే సరికి ఒకటి రెండు శతకాలు మాత్రమే దొరికినవి. వారు కాశీ వెళ్ళారో లేదో తెలియదుకానీ, ఇటీవల నేను కాశీలో ఉన్నపుడు, నా రక్కడ కొంతకాలం నివసించినట్లుగా దర్శనం కల్గింది.
వారి రెండవ కుమారుడు, లక్ష్మీనరసింహకవి, మా తాతగారు. మా ఊరిలో కొండమీద ఒక గుహలో నరసింహస్వామి వెలిశాడు. మా ఊరిలోని వారందరికి అతడే ఇష్టదేవత. మా చిన్నప్పటి నుండి మీ ఇలవేల్పు ఎవరంటే, నరసింహస్వామి అని చెప్పడం అలవాటు. లక్ష్మీనరసింహకవి చిన్నప్పటి నుంచి నరసింహోపాసన చేశాడు. కానీ విచిత్రం - పరమ శాంతస్వభావునిగా, వినయభూషణునిగా జీవితమంతా ఆయన ప్రకాశించారు. ఇరవైయవ శతాబ్దకాలంలో తిరుపతివెంకటకవులు, కొప్పరపు సోదరకవులు చేస్తున్న అవధానాలు ఆశుకవిత్వ ప్రదర్శనలు సాహిత్యరంగంలో ప్రభంజనం లాగా వీస్తున్నది. ఆ ప్రభావం వల్ల వీరు కూడా అవధాన అశుకవితా సభలు ఎన్నో చేసి అవధానిభూషణునిగా బహుబిరుదములతో ప్రకాశించారు. కాస్త పెద్దతనం వచ్చిన తరవాత 'మాఘపురాణం' అనే బృహద్గ్రంథాన్ని సంస్కృతం నుంచి ఆంధ్రీకరించారు. మధ్యవయస్సులో నృసింహశతకాది గ్రంథాలుకొన్ని రచించారు.
చిన్నతనంలో మాతాతగారితో అనుబంధం ఎక్కువగా ఉండేది. నన్ను ఎంతో వాత్సల్యంతో ప్రేమతో చూచి పిన్న వయస్సులోనే కవితారచనకు అంకురారోపణ చేశారు. ఛందస్సు, యతులు, ప్రాసలు మొదలైనవన్నీ నేర్పినది ఆయనే.
మా తండ్రిగారు పురుషోత్తమరాయకవి. తండ్రి, తాతల మార్గంలో ప్రయాణించి ఆయన కూడా ఎన్నో అవధానాలు చేశారు. ఆశుకవితలు చెప్పారు. “పురుషోత్తమ చరిత్ర” అన్న చారిత్రక కావ్యం (అలెగ్జాండరు - పురుషోత్తముల యుద్ధగాథ) రచించి ఆధునిక ప్రబంధ నిర్మాతలలో ఒకరిగా పేరుపొందారు. చిన్నతనంలో నాచే అమరకోశం, ఆంధ్రనామ సంగ్రహము, శబ్దమంజరి మొదలైన వాటిని కంఠస్థం చేయించి సాహిత్య ప్రజ్ఞకు పునాదివేశారు.
ఆ సమయానికి మానాన్నగారు గుంటూరుజిల్లా నరసరావుపేట తాలుకాలోని సంతగుడిపాడు గ్రామంలో ఎలిమెంటరీ స్కూలు హెడ్మాస్టరుగా ఉండేవారు. మంత్రవేత్తలుగా పేరుపొందిన పరశురాముని వారివద్ద రామమంత్రాన్ని ఉపదేశం పొంది యావజ్జీవితం ఆ మంత్రం జపించారు. నిరంతరం 'సుందరకాండ' పారాయణం చేసేవారు. నాకు కాస్త వయస్సు పైన పడుతున్న కొద్దీ పై చదువుల అవసరం గుర్తించి జిల్లాకేంద్రమైన గుంటూరు చేరుకొని అక్కడి హిందూ కాలేజి - హైస్కూలులో ఉద్యోగంలో చేరారు. వారి సంతానంలో నేను పెద్దవాడిని. నల్గురు తమ్ముళ్ళు ఒక చెల్లెలు. మా అమ్మ పేరు స్వరాజ్యలక్ష్మి. కొప్పరపు వారి వంశానికి చెందినది. అత్యంతప్రేమతో మా అందరిని పెంచి పెద్దచేసింది. అటు పితృవంశము, ఇటు మాతృవంశము రెండూ కవితారచనలో ఆరితేరినవి కావడం వల్ల ఇంట్లో నిరంతరం కవితావాతావరణం ఉండడం వల్ల సహజంగా నాలో కవితాత్మకమైన సృజనాశక్తి అభివృద్ధి చెందింది. నా సోదరులలో నా తరువాత వాడు ఆంజనేయప్రసాద్ కూడా ఎన్నో గ్రంథాలు రచించి కవిగా పేరు చెందాడు. మిగతా వారు భక్తులు, మంత్రసాధకులు.
లౌకికమైన చదువులకు సంబంధించి గుంటూరు హిందూకాలేజీలో బి.ఎ., శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎమ్.ఎ., పి.హెచ్.డి. డిగ్రీలు పొందడం జరిగింది. కొద్ది కాలం కేంద్రప్రభుత్వ ఉద్యోగం చేసి తరువాత గుంటూరు హిందూకళాశాలలో తెలుగు శాఖలో స్థిరపడం జరిగింది. ఉపన్యాసకుడు, శాఖాధిపతి, ప్రిన్సిపల్ పరిణామ క్రమంలో వచ్చిన ఉద్యోగ విశేషాలు. 1937 జనవరి 23వ తేదీ ఏల్చూరు గ్రామంలో ఉదయించి 1956లో హిందూకాలేజీ ఉద్యోగంలో చేరి 1998 లో రిటైరు కావడం జరిగింది. 1964లో వావిలాల అద్వైతబ్రహ్మశాస్త్రిగారి కుమార్తె సుందరీదేవిని వివాహమాడటం, ఒక కూతురు, ఇద్దరు కుమారులను సంతానంగా పొందడం జరిగింది.
( సశేషం )
🌹🌹🌹🌹🌹
Comments