🌹సాధనా పంచకమ్ స్తోత్రము - భావము - ఆత్మ సాక్షాత్కార సాధ్యతకు శ్రీ ఆదిశంకరాచార్య విరచిత పాఠం. 🌹
ప్రసాద్ భరధ్వాజ
శ్రీ ఆది శంకరాచార్య విరచిత సాధనా పంచకమ్ అనేది ఒక మహత్తరమైన గ్రంథం, ఇందులో మానవుడు తన జీవితాన్ని ఎలా సాధించుకోవాలో, ఎలా దైవానుసంధానం చేసుకోవాలో, ఆత్మ జ్ఞానాన్ని ఎలా పొందాలో 5 శ్లోకాల్లో వివరిస్తారు. ఇది ధ్యానం, భక్తి, కర్మ మొదలైన పద్ధతులను సాధన చేయడానికి ఒక మార్గదర్శిని. ఇందులోని ప్రతీ శ్లోకం మానవుడికి ఆత్మవిచారం, దైవానుసంధానం, సద్గుణాల వృద్ధి కోసం మార్గనిర్దేశకంగా ఉంటుంది. శంకరాచార్యులు దీని ద్వారా సత్యానికి చేరుకునే మహామార్గాన్ని చూపించారు. ఇది వేదాలు మరియు ఉపనిషత్తుల మార్గాన్ని అనుసరించిన అనేక మంది మహాత్ములచే సూచించబడిన మార్గం. ఏ సాధకుడైనా ఈ సూచనలను ఆచరణలో పెట్టినచో, అతడు తప్పక నిష్ప్రయోజకమైన, స్వయం నష్టకరమైన ప్రతివాదాలు మరియు తప్పుడు నిర్ణయాలలో చిక్కుకోకుండా, సరైన మార్గాన్ని అనుసరించగలడు.
1వ శ్లోకం :
వేదోనిత్య మధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం
తేనేశస్య విధీయతా మపచితిః కామ్యేమన స్త్య జ్యతామ్
పాపౌఘః పరిభూయతాం భవసుఖే దోషోనుసంధీయతాం
ఆత్మేచ్ఛావ్యవసీయతాం నిజగృహాత్తూర్ణం వినిర్గమ్యతామ్
నిత్యము వేదము చదువుము. వేదము చెప్పిన కర్మలను చేయుము. ఈశ్వరుని పూజింపుము. కోరికలను విడిచిపెట్టుము. పాపములను పరిహరించుము. సంసారము నందలి దోషము తెలిసి కొనుము. ఆత్మజ్ఞాన మునకు ప్రయత్నించుము. ఇంటిని విడిచి బయటకు వెళ్ళుము.
2వ శ్లోకం :
సంగః సత్సు విధీయతాం భగవతో భక్తిర్ధృఢా ధీయతాం
శాంత్యాదిః పరిచీయతాం దృఢతరం కర్మాశు సంత్యజ్యతామ్
సద్విద్వాను పసర్ప్యతాం ప్రతిదినం తత్పాదుకా సేవ్యతామ్
బ్రహ్మైవాక్షరమర్ధ్యతాం శ్రుతిశిరోవాక్యం సమాక ర్ణ్యతామ్|
సత్పురుషుల స్నేహము చేయుము. భగవంతుని యందు దృఢమయిన భక్తిని నిలుపుము. శాంతిని సాధింపుము. దుష్ట కర్మలను విడిచి పెట్టుము. పండితుల దగ్గరకు వెళ్ళుము. వారి పాదములను సేవించుము. ఏకాక్షరమయిన ప్రణవమును, యాచింపుము. వేదాంత శ్రవణము చేయుము.
3వ శ్లోకం :
వాక్యార్థశ్చ విచార్యతాం శ్రుతిశిరః పక్షస్సమాశ్రీయతాం
దుస్తర్కాత్స్యు విరమ్యతాం శ్రుతిమత స్తర్కోను సంధీయతాం
బ్రహ్మైవస్మి విభావ్యతా మహరహో గర్వః పరిత్యజ్యతామ్
దేహో హమ్మతి రుజ్ఝ్యతాం బుధజనైర్వాదః పరిత్యజ్యతామ్!
వేదాంత వాక్య విచారము చేయుము. వేదాంత పక్షమును ఆశ్రయించుము. దుష్టమయిన తర్కమును విడిచి వేద విహితమయిన తర్కమును చేయుము. రాత్రిం బవళ్ళు బ్రహ్మను అని భావన చేయుము. గర్వము విడిచి పెట్టుము. శరీరము నందు ఆత్మ బుద్దిని విడిచి పెట్టుము. పండితులతో వాదన చేయకుము.
4వ శ్లోకం :
క్షుద్వ్యాధిశ్చ చికిత్స్య తాం ప్రతిదినం భిక్షౌషధం భుజ్యతాం
స్వాద్వన్నం నచ యాచ్యతాం విధివశాత్ప్రా ప్తేనసంతుష్యతామ్
శీతోష్ణాది విషహ్యతాం న తు వృధావాక్యం సముచ్చార్యతాం
ఔదాసీన్య మభీప్స్యతాం జనకృపానైష్ఠుర్య ముత్సృజ్యతామ్
ఆకలియను రోగము పోవుటకు భిక్షయను మందును తినుము. రుచికరములయిన అన్నమునకు ఆశ పడకుము. దైవ వశమున లభించినచో సంతసింపుము. వేడిని చలిని సహించుము. వ్యర్థముగా మాట్లాడకుము. ఉదాసీనుడవయి యుండుము. జనుల దయకు ఆశ పడకుము.
5వ శ్లోకం :
ఏకాంతే సుఖమాస్యతాం పరతరే చేతస్సమాధీయతాం
పూర్ణాత్మా సుసమీక్ష్యతాం జగదిదం తద్బాధితం దృశ్యతామ్
ప్రాక్కర్మ ప్రవిలాప్యతాం చితిబలా న్నాప్యుత్తరైః శ్లిష్యతాం
ప్రారబ్ధ స్త్విహ భుజ్యతా మధ పరబ్రహ్మాత్మ నాస్థీయ తామ్
ఏకాంతము నందు సుఖము గానుండుము. బ్రహ్మ యందు చిత్తము నిలుపుము. ఈ జగత్తును ఆత్మ స్వరూపముగా భావించుము జగత్తు నశించునది అని తెలియుము. పూర్వకర్మను, జ్ఞానబలము వలన నాశనము చేసుకొనుము. ఆగామి కర్మల యందు కోరికను విడిచి పెట్టుము. ప్రారబ్ధము అనుభవించుము. పరబ్రహ్మ యందు స్థిరముగా నుండుము.
ఫలశ్రుతి :
యః శోక పంచకమిదం పఠతే మనుష్య:
సంచింత యత్యను దినం స్థిర తాముపేత్య
తస్యాశు సంసృతి దవానల తీవ్ర ఘోర
తాపః ప్రశాంతి ముపయాతి చితి ప్రభాదాత్
ఈ అయిదు శ్లోకములను ప్రతిదినము స్థిరమయిన సమ బుద్ధితో చదివి ఆలోచించిన వారికి అత్మ సాక్షాత్కారము వలన సంసారమనెడు, దావాగ్ని నశించి శాంతి లభించును.
ఇతి శ్రీ ఆది శంకరాచార్య విరచిత సాధనా పంచకమ్ సంపూర్ణమ్.
జైగురుదేవ్.
🌹🌹🌹🌹🌹
Commentaires