🌹 . శ్రీ శివ మహా పురాణము - 583 / Sri Siva Maha Purana - 583 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 02 🌴
🌻. కుమారస్వామి జననము - 3 🌻
బ్రహ్మ ఇట్లు పలికెను--
ఓ మునీ! శివపత్నియగు పార్వతి ఇట్లు అగ్నిని శపించి వెంటనే దుఃఖముతో శివునితో గూడి తన గృహములోనికి వెళ్లెను (22). ఓ మహర్షీ! లోపలకు వెళ్లి పార్వతి శ్రద్ధతో శివునకు చక్కగా భజించి గణేశుడనే మరియొక పుత్రునకు జన్మనిచ్చెను (23).
ఓ మునీ!ఆ వృత్తాంతమునంతనూ ముందు ముందు వర్ణించగలను. ఇపుడు గుహుని జన్మను చెప్పెదను. ప్రీతితో వినుము (24). దేవతలు అగ్ని భుజించిన అన్నము మొదలగు వాటిని భుజించెదరు గదా! వేదవాక్కు అట్లు నిర్దేశించు చున్నది. ఆ దేవతలందరు గర్భమును ధరించిరి (25).
పార్వతి యొక్క శాపముచే భ్రష్టమైన బుద్ధులు గల విష్ణువు మొదలగు దేవలందరు ఆ తేజస్సును సహించ లేనివారై మిక్కిలి పీడితులైరి (26). అపుడు మోహమును పొందిన విష్ణువు మొదలగు దేవలందరు దహింపబడు చున్నవారై వెంటనే పార్వతీపతిని శరణుజొచ్చిరి (27). దేవతలందరు శివుని గృహద్వారము వద్దకు వెళ్లి వినయముతో చేతులు జోడించి పార్వతితో గూడియున్నశంభుని ప్రీతితో స్తుతించిరి (28).
దేవతలిట్లు పలికిరి--
ఓ దేవ దేవా! మహాదేవా! పార్వతీ పతీ! మహాప్రభూ! నాథా! మాకు ఇపుడేమైనది? నీ మాయా దాటశక్యము కానిది (29). మేము గర్భములను ధరించి యున్నాము. నీ తేజస్సు మమ్ములను దహించుచున్నది. ఓ శంభూ! దయను చూపుము. ఈ దశను తొలగించుము (30).
బ్రహ్మ ఇట్లు పలికెను--
ఓ మునీ! దేవతల ఈ స్తుతిని విని పార్వతీ పతి యగు పరమేశ్వరుడు వెంటనే దేవతలు నిలబడి యున్న ద్వారము వద్దకు వచ్చెను (31). ద్వారము వద్దకు వచ్చిన భక్తవల్సలుడగు శంకరునకు అచ్యుతునితో సహా సర్వదేవతలు ప్రణమిల్లి స్తుతించి ఆనందముతో నర్తించిరి (32).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
Comments