🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 358 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. మనసన్నది ధ్యానం లేని స్థితి. నువ్వు మనసు గుండా జీవిస్తావు. మనసుగా జీవిస్తావు. కాబట్టి సమస్య అదొక్కటే. నువ్వు ధ్యానంలో ప్రవేశించిన క్షణం మనసు మాయమవుతుంది. 🍀
ఆలోచనలు చీకటిలాంటివి. అవి చీకటి వచ్చినట్టే వస్తాయి. నిజమనిపిస్తాయి. కాంతి రంగవేశం చేస్తే మాయమవుతాయి. అవి వున్నట్లనిపిస్తాయి. అది భ్రాంతి. కాబట్టే నువ్వు చీకటిని సరాసరి ఎదుర్కోలేవు. తరిమెయ్యలేవు. అట్లాగే నువ్వు చీకటిని తీసుకురాలేవు. అది లేనిది గనుక ముక్కు సూటిగా వ్యవహరించలేవు. అది కేవలం కాంతి లేకపోవడమే. అక్కడికి కాంతిని తీసుకు రావడమొక్కటే నువ్వు చేయాలి. మనసుకు సంబంధించిన విషయం కూడా అలాంటిదే. మనసన్నది ధ్యానం లేని స్థితి. నువ్వు ధ్యానంలో ప్రవేశించిన క్షణం మనసు మాయమవుతుంది. చీకటిలా మాయమవుతుంది.
మనం మనసనే భ్రమలో బ్రతుకుతూ వుంటాం. నిజమైన ప్రపంచం దూరంగా వుంటుంది. అది వాస్తవ ప్రపంచాన్ని అడ్డుకుంటుంది. తన ప్రపంచాన్ని ముందుకు తెచ్చి అదే నిజమైన ప్రపంచమని భ్రమపెడుతూ వుంటుంది. వాస్తవాన్ని చూడనియ్యడు. నిన్ను నువ్వు కూడా చూడాలంటే అడ్డుపడుతుంది. అంతర్భహి: ప్రపంచాల్ని అదృశ్యం చేస్తుంది. పునాది లేని ప్రపంచమే సర్వస్వం అవుతుంది. అది నీపై అజమాయిషీ చేస్తుంది. నువ్వు మనసు గుండా జీవిస్తావు. మనసుగా జీవిస్తావు. కాబట్టి సమస్య అదొక్కటే. భ్రమలో జీవించడం నిష్ఫలం అక్కడ అభివృద్ధి వుండదు. పరిణితి వుండదు. సంపన్నత వుండదు. అవగాహన వుండదు. ఆనందముండదు. సత్యముండదు. అందముండదు.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Kommentare