🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 359 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. మనసు స్వంత బుద్ధి లేనిది. నీకు వాస్తవానికి చెందిన అంతర్దృష్టి నివ్వదు. అది గ్రహించడానికి నీ హృదయం పని చేయాలి. ప్రేమ అంటే హృదయ స్పందన తప్ప మరొకటి కాదు. 🍀
ప్రేమించే హృదయమే అస్తిత్వ హృదయాన్ని స్పర్శిస్తుంది. మనసు బోలుది. పైపైది. మనసుకు లోతులు తెలీవు. ఎత్తులు తెలీవు. శిఖరాలూ తెలీవు. లోయలూ తెలీవు. మనసు బుద్ధి లేనిది. స్వంత బుద్ధి లేనిది. నీకు వాస్తవానికి చెందిన అంతర్దృష్టి నివ్వదు. అది గ్రహించడానికి నీ హృదయం పని చేయాలి. ప్రేమ అంటే హృదయస్పందన తప్ప మరొకటి కాదు. దాని పాట అది పాడటానికి హృదయాన్ని అనుమతించు. దాన్ని మనసు ఖండించినా లెక్క పెట్టకు. దాని పని ఖండించడమే. బాధా సందర్భంలో కూడా హృదయం గానం చెయ్యనీ. ఇది సందర్భమా? అట్లా పాడొచ్చా? అని మనసన్నా లెక్కపెట్టకు.
నీ హృదయం పాడనీ, ఆడనీ, పరవశించనీ మనసు నించీ కుక్కలు మొరగనీ. అది సహేతుకం కాదని అరచి గీపెట్టనీ. లెక్కపెట్టకు. అది లోపలి కవిత్వాన్ని ఖండిస్తుంది. లోపలి ప్రేమని ఖండిస్తుంది. నిన్ను హృదయం నించి లాగెయ్యడానికి ప్రయత్నిస్తుంది. దాని మాట వినకు. ఆడు, పాడు, ఆనందించు. అట్లా చేస్తూ వుంటే మనసు ఒకరోజు ఆశ్చర్యపోతుంది. కుక్కలు మొరగడం ఆపుతాయి. కుక్కలు అదృశ్యమవుతాయి. అది గొప్ప ఆశీర్వాదం అందిన రోజు. పూలు నీపై వర్షించిన రోజు. అస్తిత్వం అన్ని రకాలయిన ఆనందాల్ని నీ మీద వర్షిస్తుంది. నువ్వు సంపూర్ణతతో సంధానం చెందుతావు. అనంతంతో నీకు అనుబంధ మేర్పడుతుంది. నువ్వు రుషివవుతావు. అది నీకు అంతర్నేత్రాన్నిస్తుంది.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Comments