top of page

002 కార్తీక పురాణం ప్రారంభం కార్తీకపురాణం 1 అధ్యాయం Beginning of Kartika Purana - Kartika Purana Chapter 1

  • Writer: Prasad Bharadwaj
    Prasad Bharadwaj
  • 1 day ago
  • 3 min read
ree

🌹. కార్తీక పురాణం ప్రారంభం🌹


🌴. కార్తీకపురాణం 1 అధ్యాయం 🌴


🌻. కార్తీక మాసం విశేషం🌻


📚. ప్రసాద్ భరద్వాజ



🌹.  Beginning of Kartika Purana🌹


🌴. Kartika Purana Chapter 1 🌴


🌻. Special features of Kartika month🌻


📚. Prasad Bharadwaja



ఒకరోజు నైమిశారణ్యంలో శౌనకాది మహామునులు కలిసి గురుతుల్యులైన సూతమహర్షితో ఇలా కోరారు… ”ఓ మహాత్మా… మీ ద్వారా ఎన్నో పురాణేతిహాసాలను, వేదవేదాంగాల రహస్యాలను గ్రహించాము. కార్తీక మాసం మహత్యాన్ని కూడా వివరించండి. ఆ మాసం పవిత్రత, కార్తీకపురాణ ఫలితాలను కూడా వివరించండి..” అని కోరారు.


శౌనకాది మహామునుల కోరికను మన్నించిన సూతమహర్షి ఇలా అంటున్నాడు… ”ఓ పునిపుంగవులారా… ఒకప్పుడు ఇదే కోరికను త్రిలోకసంచారి అయిన నారదమహాముని బ్రహ్మదేవుడిని కోరాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అతనికి ఈ పురాణ విశేషాలను వివరించారు. అదే సమయంలో లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువు, పార్వతీదేవికి పరమశివుడు ఈ పురాణాన్ని వివరించారు. అలాంటి పరమ పవిత్రమైన పురాణాన్ని మీకు వివరిస్తాను. ఈ కథను వినడం వల్ల మానవులకు ధర్మార్థాలు ప్రాప్తిస్తాయి. ఈ పురాణగాథను విన్నంతనే ఇహలోకంలో, పరలోకంలో సకలైశ్వర్యములు పొందగలరు. కాబట్టి శ్రద్ధగా వినండి” అని చెప్పసాగాడు.


పూర్వం ఒకరోజు పార్వతి పరమేశ్వరులు ఆకాశమార్గంలో విహరిస్తుండగా… పార్వతి దేవి పరమశివుడితో ”ప్రాణేశ్వరా… సకల ఐశ్వర్యాలను కలుగజేసి, మానవులంతా కులమత తారతమ్యం లేకుండా, వర్ణభేదాలు లేకుండా ఆచరించే వ్రతమేదైనా ఉంటే వివరించండి” అని కోరింది.


అంతట పరమశివుడు ఆమె వైపు చిరునవ్వుతో చూసి ఇలా చెబుతున్నాడు ”దేవీ! నీవు అడిగే వ్రతమొక్కటి ఉంది. అది స్కంధపురాణంలో ఉప పురాణంగా విరాజిల్లుతోంది. దానిని వశిష్ట మహాముని మిథిలాపురాధీశుడైన జనక మహారాజుకు వివరించారు. అటు మిథిలానగరం వైపు చూడు….” అని ఆ దిశగా చూపించాడు.


మిథిలానగరంలో వశిష్టుడి రాకకు జనకమహారాజు హర్షం వ్యక్తం చేస్తూ అర్ఘ్యపాద్యాలతో సత్కరించారు. ఆపై కాళ్లు కడిగి, ఆ నీటిని తన తలపై జల్లుకుని ఇలా అడుగుతున్నాడు ”ఓ మహామునివర్యా… మీ రాకవల్ల నేను, నా శరీరం, నా దేశం, ప్రజలు పవిత్రులమయ్యాము. మీ పాద ధూళితో నా దేశం పవిత్రమైంది. మీరు ఇక్కడకు రావడానికి కారణమేమిటి?” అని కోరగా…. వశిష్ట మహాముని ఇలా చెబుతున్నాడు ”జనక మహారాజ! నేనొక మహాయజ్ఞము చేయాలని నిర్ణయించాను. అందుకు కావాల్సిన ధన, సైన్య సహాయానికి నిన్ను కోరాలని వచ్చాను” అని తాను వచ్చిన కార్యాన్ని వివరించారు.


దీనికి జనకుడు ”మునిపుంగవా… అలాగే ఇస్తాను. స్వీకరించండి. కానీ, ఎంతో కాలంగా నాకొక సందేహమున్నది. మీలాంటి దైవజ్ఞులైనవారిని అడిగి సంశంయం తీర్చుకోవాలని అనుకునేవాడిని. నా అదృష్టం కొద్ది ఈ అవకాశం దొరికింది. ఏడాదిలోని మాసాలన్నింట్లో కార్తీక మాసమే ఎందుకు పరమ పవిత్రమైనది? ఈ నెల గొప్పదనమేమిటి? కార్తీక మహత్యాన్ని నాకు వివరిస్తారా?” అని ప్రార్థించారు.


వశిష్ట మహాముని చిరునవ్వు నవ్వి ”రాజ! తప్పక నీ సందేహాన్ని తీర్చగలను. నేను చెప్పబోయే వ్రతకథ సకలమానవాళి ఆచరించదగినది. సకల పాపాలను హరించేది. ఈ కార్తీకమాసం హరిహర స్వరూపం. ఈ నెలలో ఆచరించే వ్రత ఫలితం ఇదీ… అని చెప్పలేం. వినడానికి కూడా ఆనందదాయకమైనది. అంతేకాదు.. ఈ కార్తీక మాస కథను విన్నవారు కూడా నరక బాధలు లేకుండా ఈ లోకంలోనూ, పరలోకంలోనూ సౌఖ్యంగా ఉంటారు. నీలాంటి సర్వజ్ఞులు ఈ కథను గురించి అడిగి తెలుసుకోవడం శుభప్రదం. శ్రద్ధగా ఆలకించు….” అని చెప్పసాగాడు.



🌻. కార్తీక వ్రతవిధానం 🌻


”ఓ జనక మహారాజా! ఎవరైనా, ఏ వయసువారైనా పేద-ధనిక, తరతమ తారతమ్యాలు లేకుండా కార్తీక మాస వ్రతం ఆచరించవచ్చు. సూర్యభగవానుడు తులారాశిలో ఉండగా…. వేకువ జామున లేచి, కాలకృత్యాలు తీర్చుకుని, స్నానమాచరించి, దానధర్మాలు, దేవతాపూజలు చేసినట్లయితే… దానివల్ల అనన్యమైన పుణ్యఫలితాన్ని పొందగలరు. కార్తీకమాసం ప్రారంభం నుంచి ఇలా చేస్తూ… విష్ణుసహస్రనామార్చన, శివలింగార్చన ఆచరిస్తూ ఉండాలి. ముందుగా కార్తీక మాసానికి అధిదేవత అయిన దామోదరుడికి నమస్కారం చేయాలి. ‘ఓ దామోదర నేను చేసే కార్తీక మాస వ్రతానికి ఎలాంటి ఆటంకం రానీయక నన్ను కాపాడు’ అని ధ్యానించి ప్రారంభించాలి” అని వివరించార


వ్రతవిధానం గురించి చెబుతూ… ”ఓ రాజా! ఈ వ్రతాన్ని ఆచరించే రోజుల్లో సూర్యోదయానికి ముందే నిద్రలేచి, కాలకృత్యాలు తీర్చుకుని, నదికిపోయి, స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారయణ, పరమేశ్వరులకు, బైరవుడికి నమస్కరించి సంకల్పం చేసుకోవాలి. ఆ తర్వాత నీటిలో మునిగి, సూర్యభగవానుడికి అర్ఘ్యపాదాలను సమర్పించి, పితృదేవతలకు క్రమప్రకారం తర్పణలు చేయాలి. గట్టుపై మూడు దోసిళ్ల నీరు పోయాలి. ఈ కార్తీక మాసంలో పుణ్య నదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరీ, తుంగభద్ర, యుమన తదితర నదుల్లో ఏ ఒక్కనదిలోనైనా స్నానం చేసినట్లయితే… గొప్ప ఫలితం లభిస్తుంది. తడి బట్టలు వీడి మడి బట్టలు కట్టుకొని, శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన పూలను తానే స్వయంగా కోసి తీసుకొచ్చి, నిత్యధూప, దీప, నైవేద్యాలతో భగవంతుని పూజచేయాలి.



🌹 🌹 కార్తీక పురాణం - 1


గంధము తీసి, భగవంతునికి సమర్పించి, తానూ బొట్టు పెట్టుకోవాలి. ఆ తర్వాత అతిథిని పూజించి, వారికి ప్రసాదం పెట్టి, తన ఇంటివద్దగానీ, దేవాలయంలోగానీ, రావిచెట్టు మొదటగానీ కూర్చొని కార్తీకపురాణం చదవాలి. ఆ సాయంకాలం సంధ్యావందనం చేసి, విశాలయంలోగానీ, విష్ణు ఆలయంలోగానీ, తులసికోట వద్దగానీ, దీపారాధన చేసి, శక్తిని బట్టి నైవేద్యం తయారు చేసి, స్వామికి నివేదించాలి. అందరికీ పంచి, తానూ భుజించాలి. తర్వాతిరోజు మృష్టాన్నంతో భూతతృప్తిచేయాలి. ఈ విధంగా వ్రతం చేసిన మహిళలు, మగవారు గతంలో, గతజన్మలో చేసిన పాపాలు, ప్రస్తుత జన్మలో చేసిన పాపాలను పోగొట్టుకుని మోక్షాన్ని పొందుతారు. ఈ వ్రతం చేయడానికి అవకాశం లేనివారు, వీలు పడనివారు వ్రతాన్ని చూసినా, వ్రతం చేసినవారికి నమస్కరించినా… వారికి కూడా సమాన ఫలితం వస్తుంది.


ఇది స్కాంద పురాణంలోని వశిష్టమహాముని చెప్పిన కార్తీక మహత్యంలోని మొదటి అధ్యాయం సమాప్తం. మొదటిరోజు పారాయణం సమాప్తం.


🌹 🌹 🌹 🌹 🌹




Comments


©2023 by Daily Bhakti Messages 3.
Proudly created with Wix.com

bottom of page