top of page
Writer's picturePrasad Bharadwaj

🌹 19 NOVEMBER 2024 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు🌹

🍀🌹 19 NOVEMBER 2024 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు🌹🍀

1) 🌹సంకటహర చతుర్థి - అంగారక చతుర్థి - శ్రీ సంకటనాశన గణేశ స్తోత్రం 🌹

2) 🌹. కార్తిక పురాణం - 18 🌹

🌻. 18వ అధ్యాయము - సత్కర్మానుష్టాన ఫల ప్రభావము - చాతుర్మాస్య వ్రతము విశిష్టత 🌻

3) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 575,576 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 575,576 - 2 🌹

🌻 575, 576. 'మాధ్వీపానాలసా, మత్తా'- 2 / 575, 576. 'madhvipanalasa, matta' - 2 🌻


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹సంకటహరచతుర్థి - అంగారక చతుర్థి 🌹*

*ప్రసాద్‌ భరధ్వాజ*


*నారద మహర్షి చేసిన శ్రీ సంకట నాశన గణేశ స్తోత్రం సంకటహర చవితి రోజు 4 సార్లు చదవడం వలన గణపతి అనుగ్రహంతో మనం జీవితంలో సంకటాలు తోలగిపోతాయి.*


*ఓం గం గణపతయే నమః*


*🍀 శ్రీ సంకటనాశన గణేశ స్తోత్రం 🍀*


*నారద ఉవాచ*

*ప్రణమ్య శిరసా దేవం, గౌరీ పుత్రం వినాయకం |*

*భక్తావాసం స్మరేన్నిత్యం, ఆయుః కామార్ధసిద్ధయే | 1 |*

*

*ప్రధమం వక్రతుండం చ,ఏకదంతం ద్వితీయకం |*

*తృతీయం కృష్ణపింగాక్షం, గజవక్త్రం చతుర్ధకం | 2 |*

**

*లంబోదరం పంచమం చ, షష్ఠం వికటమేవ చ |*

*సప్తమం విఘ్నరాజం చ, ధూమ్రవర్ణం తధాష్టమం | 3 |*

**

*నవమం ఫాలచంద్రం చ, దశమం తు వినాయకం |*

*ఏకాదశం గణపతిం, ద్వాదశం తు గజాననం | 4 |*

**


*ద్వాదశైతాని నామాని, త్రిసంధ్యం యః పఠేన్నరః |*

*న చ విఘ్నభయం తస్య, సర్వసిద్ధికరం ప్రభో! | 5 |*

**

*విద్యార్ధీ లభతే విద్యాం, ధనార్ధీ లభతే ధనం |*

*పుత్రార్ధీ లభతే పుత్రాన్,మోక్షార్ధీ లభతే గతిం | 6 |*

**

*జపేత్ గణపతిస్తోత్రం, షడ్భిర్మాసైః ఫలం లభేత్ |*

*సంవత్సరేణ సిద్ధిం చ,లభతే నాత్ర సంశయః | 7 |*

*

*అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ, లిఖిత్వా యః సమర్పయేత్ |*

*తస్య విద్యా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదతః | 8 |*


*ఇతి శ్రీ నారదపురాణే సంకటనాశనం నామ గణేశ స్తోత్రం సంపూర్ణం*

*ఓం శాంతిః శాంతిః శాంతిః*


*సకల విఘ్నాలకు అధిపతి ఆదిదంపతుల కుమారుడైన వినాయకుడు, ఆయనను పూజీస్తే అన్ని సంకటాలు తొలగిపోతాయి. మన జీవితంలో ఎదురవుతున్న ఎలాంటి అడ్డంకునైనా తొలగించేందుకు, ఎలాంటి సమస్యనైనా పరిష్కరించేందుకు వినాయకుడి అనుగ్రహం చాలా అవసరం. ఆ వినాయకుడిని ప్రసన్నం చేసుకునేందుకు మన దగ్గర ఓ ఉపాయం ఉంది. అదే సంకటహర చతుర్థి!*


*ఈ రోజు కనుక వినాయకుని పూజిస్తే ఎలాంటి గ్రహదోషాలైనా తీరిపోతాయట. పెళ్లి కాకపోవడం, పిల్లలు లేకపోవడం లాంటి కష్టాలూ తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలన్నీ దూరమైపోతాయి. ఈ పూజ చేసేవాళ్లు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. తలస్నానం చేసి పూజగదిని శుభ్రం చేసుకోవాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. పాలు, పండ్లు, పచ్చికూరలు మాత్రం తీసుకోవచ్చు.*


*ఇక సాయంత్రం సూర్యాస్తమ సమయానికి అంటే సుమారు ఆరుగంటలకు వినాయకుడి పటానికి గరికతో చేసిన దండ వేసి, ఉండ్రాళ్లను నైవేద్యంగా పెట్టి, దీపం వెలిగించాలి. ఆ తర్వాత చంద్రుడిని లేదా నక్షత్రాలని చూశాక కానీ ఉపవాసాన్ని విరమించకూడదు. ఇంట్లో పూజ ముగిసిన తర్వాత వీలైతే దగ్గరలో ఉన్న వినాయకుడి గుడికి వెళ్లి 3, 11 లేదా 21 ప్రదక్షిణలు చేయాలి.*


*🌻 అంగారక చతుర్థి 🌻*


*ఒకవేళ సంకష్ట హర చతుర్థి మంగళవారం కాని వస్తే దానిని అంగరక చతుర్థి అని అంటారు అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం, ఈ వ్రతం ఆచరించడం వల్ల జాతకములోని కుజదోష సమస్యలు తొలగడంతో పాటుగా, చేసే పనులలో సంకటములన్నీ తొలగి సఫలతో చేకూరునని ప్రతీతి.*


*"ఓం గం గణపతయే నమః"*


*పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను సంకష్టహర చతుర్థి / సంకటహర చతుర్థి వ్రతం అంటారు. సంకష్టహర చతుర్థి రోజున అరమీటరు పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రవికల గుడ్డముక్క తీసుకుని వినాయకుడి ముందు పెట్టి దానిని పసుపు, కుంకుమలతో అలంకరణను చేయాలి. మనస్సులోని కోరికను తలచుకొని మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తరువాత తమలపాకులో రెండు ఎండు ఖర్జూరాలు, రెండు వక్కలు, దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలచుకుని మూటకట్టాలి.*


*సంకటనాశన గణేశ స్తోత్రం, సంకట హర చతుర్థి వ్రత కథను చదవవలెను. ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి. తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి 3 లేక 11 లేక 21 ప్రదక్షిణాలు చేయాలి. శక్త్యానుసారము గరిక పూజను కాని, గణపతి హోమమును కాని చేయిన్చుకోనవచ్చును.*


*సూర్యాస్తమయం వరకూ పూజ చేసిన వినాయకుడిని కడపరాదు. సూర్యుడు అస్తమించిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి. నియమం పూర్తయిన తరువాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి. ఈ వ్రతం చేయటం వలన ధనప్రాప్తి, పుత్రప్రాప్తి, ఆరోగ్యప్రాప్తి, విద్యాప్రాప్తి అంతేకాకుండా చాలా పుణ్యం పొందుతారని భావన. ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా స్వనంద లోకానికి వెడతారని అక్కడ భగవంతుని ఆశిస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు. ఈ వ్రతం వల్ల ఏది కొరినా సిద్దిస్తుందని ప్రతీతి. ఈ మొత్తం ఆచరించడం కష్టమని భావించేవారు, ఉపవాసం చేసి, సంకటనాశన గణేశ స్తోత్రం చదివి, దగ్గరలో ఉన్న గణపతి ఆలయాన్ని సందర్శించినా సరిపోతుంది. ఉపవాసం కూడా చేయలేనివారు, కనీసం 4 సార్లు శ్రీ సంకటనాశనగణేశ స్తోత్రం పఠించడం ఉత్తమం.*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. కార్తిక పురాణం - 18 🌹*

*🌻. 18వ అధ్యాయము - సత్కర్మానుష్టాన ఫల ప్రభావము - చాతుర్మాస్య వ్రతము విశిష్టత 🌻*

*ప్రసాద్ భరద్వాజ*


"ఓ మునిచంద్రా! మీ దర్శనము వలన ధన్యుడనైతిని సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశము చేసితిరి. నేటి నుండి మీ శిష్యుడనైతిని. తండ్రి - గురువు - అన్న - దైవము సమస్తము మీరే, నా పూర్వ పుణ్య ఫలితమువలనే కదా మీబోటి పుణ్యపురుషుల సాంగత్యము తటస్థించెను. లేనిచో నేను మహా పాపినయి మహారణ్యములో ఒక మొద్దు బారిన చెట్టునైయుండగా, తమ కృపవలననే నాకు మోక్షము కలిగినది కదా! మీ దర్శన భాగ్యము లేని యెడల ఈ కీకారణ్యములో తరతరాలుగా చెట్టు రూపమున వుండవలసినదే కదా! అట్టి! నేనెక్కడ! మీ దర్శన భాగ్యమెక్కడ! నాకు సద్గతి యెక్కడ? పూణ్యఫలప్రదాయియగు యీ కార్తీకమాసమెక్కడ! పాపాత్ముడనగు నేనెక్కడ? ఈ విష్ణ్యాలయమందు ప్రవేశించుటెక్కడ? యివి యన్నియును దైవికమగు ఘటనలు తప్ప మరొకటి కాదు. కాన, నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడెట్లు అనుసరించవలయునో, దాని ఫలమెట్టిదో విశదీకరింపు"డని ప్రార్ధించెను.


"ఓ ధనలోభా! నీ వడిగిన ప్రశ్నలన్నియు మంచివే. అవి అందరికి వుపయోగార్ధమైనట్టివి కాన, వివరించెదను. శ్రద్దగా ఆలకింపుము. ప్రతి మనుజుడును ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడగుచున్నాడు. ఈ భేదము శరీరమునకే గాని ఆత్మకు లేదు. అట్టి ఆత్మ జ్ఞానము కలుగుటకే సత్కర్మలు చేయవలెనని, సకల శస్త్రములు ఘోషించుచున్నవి. సత్కర్మ నాచరించి వాటి ఫలము పరమేశ్వరార్పిత మొనరించిన జ్ఞానము కలుగును. మానవుడే, జాతివాడో, యెటువంటి కర్మలు ఆచరించావలెనో తెలుసుకొని అటువంటివి ఆచరింపవలెను. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక, సత్కర్మల నచారించినను వ్యర్ధమగును. అటులనే కార్తీకమాసమందు సూర్య భగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగాను వైశాఖమాసములో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగాను, మాఘమాసములో సూర్యుడు మకర రాశి యందుండగాను అనగా నీ మూడు మాసముల యందయిననూ తప్పక నదిలో ప్రాతః కాల స్నానము చేయవలెను. అటుల స్నానము లాచరించి దేవర్చన చేసిన యెడల తప్పక వైకుంట ప్రాప్తి కలుగును. సూర్యచంద్రగ్రహణ సమయములందును తదితర పుణ్యదినముల యందు, స్నానము చేయవచ్చును. ప్రాతఃకాలమున స్నానము చేసిన మనుజుడు సంద్యావందనం సూర్యనమస్కారములు చేయవలెను. అట్లు ఆచరించని వాడు కర్మభ్రష్టుడగును. కార్తీక మాసమందు అరుణోదయ స్నానమాచరించరించిన వారికీ చతుర్విధ పురుషార్ధములు సిద్దించును. కార్తీక మాసముతో సమానమైన మాసము, వేదములతో సరితూగు శాస్త్రము, గంగ గోదావరి నదులకు సమాన తీర్ధములు, బ్రాహ్మణులకు సమానమైన జాతీయు, భార్యతో సరితూగు సుఖమునూ, ధర్మముతో సమానమైన మిత్రుడనూ, శ్రీ హరితో సమానమైన దేవుడునూ లేడని తెలుసుకోనుడు. కార్తీక మాసమందు విధ్యుక్తధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోవుదురు". అని అంగీరసుడు చెప్పగా విని మరల ధనలోభుడిటుల ప్రశ్నించెను.


"ఓ మునిశ్రేష్టా! చాతుర్మాస్యవ్రతమని చెప్పితిరే! ఏ కారణం చేత దానిని నాచరించవలెను? ఇదివరకెవ్వరయిన నీ వ్రతమును ఆచరించియున్నారా? ఆ వ్రతము యొక్క ఫలితమేమి? విధానమెట్టిది? సవిస్తర౦గా విశదికరింపు"డని కోరెను. అందులకు ఆంగీరసుడిటుల చెప్పెను.


"ఓయీ! వినుము. చతుర్మాస్యవ్రతమనగా శ్రీమహావిష్ణువు మహాలక్షితో ఆషాడ శుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమున శేషుని పాన్పుపై శయనించి కార్తీకశుద్ధ ఏకాదశినాడు నిద్రనుండి లేచును. ఆ నాలుగు మాసములకే చాతుర్మాస్యమని పేరు. అనగా ఆషాడ శుద్ధ ఏకాదశి 'శయన ఏకాదశి' అనియు, కార్తీక శుద్ధ ఏకాదశి 'ఉత్థాన ఏకాదశి' అనియు, ఈ వ్రతమునకు, చాతుర్మాస్య వ్రతమనియు పేర్లు. ఈ నాలుగు మాసములలో శ్రీ హరి ప్రీతి కొరకు స్నాన, దాన, జప, తపాది సత్కార్యాలు చేసినచో పూర్ణఫలము కలుగును. ఈ సంగతి శ్రీమహావిష్ణువు వలన తెలిసికొంటిని కాన, ఆ సంగతులు నీకు తెలియచేయుచున్నాను".


తొల్లి కృతయుగంబున వైకుంఠ మందు గరుడ గంధర్వాది దేవతలచేత, వేదములచేత సేవింపబడుచున్న శ్రీ మన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమున కూర్చుండి యుండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రు౦డును, చతుర్బాహు౦డును, కోటి సూర్య ప్రకాశమానుండును అగు శ్రీ మన్నారాయణునకు నమస్కరించి ముకుళిత హస్తాలతో నిలబడియుండెను. అంత శ్రీ హరి నారదుని గాంచి ఏమియు తెలియనివానివలె మందహాసముతో నిట్లనెను. "నారదా! నీవు క్షేమమే గదా! త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయములు లేవు. మహామునుల సత్కర్మానుష్టానములు యెట్టి విఘ్నములు లేక సాగుచున్నావా? మానవులందరు ధించవారికి విధించబడిన ధర్మముల నాచరించుచున్నారా? ప్రపంచమున నే అరిష్టములు లేక యున్నవి కదా?" అని కుశలప్రశ్నలడిగెను. అంత నారదుడు శ్రీహరికీ ఆదిలక్ష్మికీ నమస్కరించి "ఓ దేవా! ఈ జగంబున నీ వెరుగని విషయమున లేవియునూ లేవు అయినను నన్ను వచింపుమనుటచే విన్నవించుచుంటిని ప్రపంచమున కొందరు మనుష్యులు - మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుట లేదు. వారెట్లు విముక్తులగుదురో యెరుగ లేకున్నాను. కొందరు భుజించ కూడదనిన పదార్దములు భుజించుచున్నారు. కొందరు పుణ్య వ్రతములు చేయుచు, అవి పూర్తిగాక మునుపే మధ్యలో మానివేయుచున్నారు. కొందరు సదాచారులుగా, మరి కొందరు అహంకార సహితులుగా, పరనిందా పరాయణులుగా జీవించుచున్నారు. అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ముల నొనర్చి రక్షింపు"మని ప్రార్ధించెను. జగన్నాటక సూత్రధారుడయిన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడగంధర్వాది దేవతలతో వేలకొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి, ముసలి బ్రాహ్మణరూపంతో ఒంటరిగా తిరుగుచుండెను.


ప్రపంచమంతను తన దయావలోకమున వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను. పుణ్యనదులు, పుణ్యాశ్రమములు తిరుగుచుండెను. ఆ విధముగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలి వాడని యెగతాళి చేయుచుండిరి. కొందరు "యీ ముసలి వానితో మనకేమి పని"యని ఊరకు౦డిరి. కొందరు గర్విష్టులైరి మరి కొందరు కామార్తులై శ్రీహరిని కన్నేతియైనను చూడకుండిరి. వీరందిరినీ భక్తవత్సలుడగు శ్రీహరిగాంచి "వీరినెట్లు తరింపజేతునా?"యని అలోచించుచు, ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖ, చక్ర, గదా, పద్మ, కౌస్తుభ, వనమాలాద్యలంకారయుతుడై నిజరూపమును ధరించి, లక్ష్మి దేవితోడను, భక్తులతోడను ముని జన ప్రీతికరమగు నైమిశారణ్యమునకు వెడలెను.


ఆ వనమందు తపస్సు చేసుకోనుచున్న మునిపుంగవులు స్వయముగా తమ ఆశ్రమముల కరుదెంచిన సచ్చిదానంద స్వరుపుడగు శ్రీమన్నారయణుని దర్శించి భక్తి శ్రద్దలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆదిదైవములగు నా లక్ష్మినారాయణులనిట్లు స్తోత్రము గావించిరి.


శ్లో|| శాంతకారం! భజగాశయనం! పద్మనాభం! సురేశం!

విశ్వాకారం! గగనసదృశం! మేఘవర్ణం శుభాంగం! |

లక్ష్మికాంతం! కమలనయనం! యోగిహృద్ద్యానగమ్యం!

వందేవిష్ణుం!భవభయహారం! సర్వలోకైకనాథం ||


శ్లో|| లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీ రంగదామేశ్వరీం

దాసి భూత సమస్త దేవా వనితాం లోకైక దీపంకురాం |

శ్రీ మన్మంద కటాక్షలబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం

త్వాం త్రైలోక్య కుటుంబినీ౦ సరసిజాం వందే ముకుంద ప్రియం||


ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి అష్టాదశాధ్యాయము - పద్దెనిమిదో రోజు పారాయణము సమాప్తం.

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 575, 576 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam  - 575, 576 - 2 🌹*

*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*

*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*

*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*


*🍀 116. పరాశక్తిః, పరానిష్ఠా, ప్రజ్ఞాన ఘనరూపిణీ ।*

*మాధ్వీపానాలసా, మత్తా, మాతృకా వర్ణ రూపిణీ ॥ 116 ॥ 🍀*


*🌻 575, 576. 'మాధ్వీపానాలసా, మత్తా'- 2 🌻*


*భక్తుల హృదయమందు జనించు మధువును భ్రమరము వలె శ్రీమాత గ్రోలును గనుక ఆమెను భ్రమరాంబిక అని కీర్తింతురు. ఏయే పుష్పముల యందు మధువు యేర్పడు చున్నదో పర్యవేక్షించుచూ తేనెటీగ మధువు స్రవించు పుష్పములపై వ్రాలి ఆ మధువును గ్రోలును. అట్లే శ్రీమాత కూడ భక్తుల హృదయములందు జనించు భక్తిరసమును గ్రోలును. అట్టి మాధ్వీపానమందు అనురక్తి కలిగియున్నది శ్రీదేవి. మానవ హృదయములు కఠినములై కల్మషములతో కూడి యున్నప్పుడు వానిని పుష్పములతో పోల్చలేము. తమ కల్మషములను హరించి, కఠినత్వమును దమించి కారుణ్య హృదయులుగ తీర్చిదిద్దమని శ్రీమాతను ప్రార్థింప వలయును.*


*సశేషం...*

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 575, 576 - 2 🌹*

*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*

*✍️ Prasad Bharadwaj*


*🌻 116. Parashaktih paranishta pragynana ghanarupini*

*madhvipanalasa matta matrukavarna rupini  ॥116 ॥ 🌻*


*🌻 575, 576. 'madhvipanalasa, matta' - 2 🌻*


*The Mother Divine, who relishes this devotion like a bee relishes nectar from flowers, is also glorified as Bhramarambika. Just as a bee identifies flowers that exude nectar, hovers over them, and savors the nectar, the Mother Divine too seeks the essence of devotion that blossoms in the hearts of her devotees. Her love for this divine nectar of devotion reflects her deep attachment to madhveepana (the act of drinking the nectar of devotion). However, human hearts that are hardened and filled with impurities cannot be compared to such blossoming flowers. Therefore, one must pray to the Mother Divine to cleanse their impurities, soften their hearts, and transform them into compassionate beings.*


*Continues...*

🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Follow My 🌹Chaitanyavijnanam YouTube channel Facebook WhatsApp Channel 🌹

#నిత్యసందేశములు #DailyMessages

Join and Share

🌹. Chaitanya Vijnaanam YouTube FB Telegram groups 🌹

*Like, Subscribe and Share 👀*

コメント


bottom of page