"Misunderstanding is the cause of sorrow" "అపోహయే దుఃఖ హేతువు"
- Prasad Bharadwaj
- Mar 26, 2024
- 1 min read

🌹 "అపోహయే దుఃఖ హేతువు" 🌹
ప్రసాద్ భరద్వాజ
ఒక సింహపు పిల్ల తప్పిపోయి, గొల్లవానికి దొరికింది. వాడు దానిని తన గొఱ్ఱెల మందలతో పాటు పెంచగా, కొంచెం కాలంలో పెరిగి అది పెద్దదైంది. అది గొఱ్ఱెలలో తాను ఒక గొఱ్ఱెను అనే అనుకునేది. అలాగే ప్రవర్తించేది. ఒకసారి అవన్నీ అడవిలో మేస్తుండగా, వేరే సింహం వచ్చి, ఈ మందపై పడింది. గొఱ్ఱెలన్నీ పారిపోయాయి. సింహం పిల్ల కూడ, వాటితో పాటు పారిపోసాగింది. అడవి సింహం దీనిని చూసి, ఆశ్చర్యపడి, ఎలాగో పరుగెత్తి దానిని ఆపింది. "చిన్న గొఱ్ఱెను నన్ను చంపకయ్యా" అంది వణికిపోతూ ఆ సింహం పిల్ల. అడివి సింహం నవ్వి, దానిని ఓ కొలను వద్దకు తీసుకెళ్ళి నీటిలో తమ ప్రతి బింబాలను చూపింది. మూతిపై మీసాలు చూపింది. పిల్ల సింహం తాను గొఱ్ఱెను కానని తెలుసుకుంది. తాను కూడా సింహమేనని తలచి, సింహంలా గర్జిస్తూ అలాగే సంచరించ సాగింది. ఐతే ఇక్కడ ఆ పిల్ల సింహానికి కొత్తగా వచ్చినది, స్వరూప జ్ఞానమే కాని, స్వరూపం కాదు. ( తన రూపం మారలేదు, కానీ తనెవరో తెలిసింది).
మహాత్ములు అందుకే మనలను, దివ్యాత్మ స్వరూపులుగానే సంబోధిస్తారు, కాని భక్తులుగా సంబోధించరు. ప్రాకృతమైన జీవితానికి అలవాటు పడి, మనలో ఉన్న పరమాత్మను, విస్మరిస్తున్నాము. జీవుడు, దేవుడు ఒకటే. మన స్వస్వరూపం ఆత్మయే.
Comments