అశ్వినీ దేవతలు - తధాస్తు దేవతలు Ashwini Deities - Tadastu Deities
- Prasad Bharadwaj
- 1 hour ago
- 2 min read

🌹 అశ్వినీ దేవతలు - తధాస్తు దేవతలు 🌹
ప్రసాద్ భరధ్వాజ
అశ్వినీ దేవతలు సూర్యపుత్రులు. వీరిని ఆది వైద్యులుగా పురాణాలు వర్ణించాయి. వీరినే తధాస్తు దేవతలు అని కూడా అంటారు. వేదాలలో వీరి గురించి దాదాపు నూరు సూక్తాల వరకు ఉంది. వీరిని ఆది వైద్యులుగా పురాణాలు వర్ణించాయి. వీరు దయార్ద్ర హృదయులు, ధర్మపరులు, సత్యసంధులు. వీరి ఆయుధాలలో అత్యంత ప్రభావితమైన మహా ఔషధాలు ఉంటాయి. వైద్యశాస్త్రానికి అధిపతులైన ఈ దేవతలు కుడిచేతిలో అభయముద్ర, ఎడమచేతిలో ఆయుర్వేద గ్రంథం కుడిపక్కన మృతసంజీవిని, విశల్యకరణి లాంటి ఔషధీ లతలు ఉంటాయని పురాణ వర్ణితం.
వీరు విరాట్పురుషుని నాసికాభాగంలో ఉంటారు. వీరి సోదరి ఉష. వీరు ప్రయాణించే రథం పేరు హిరణ్యవర్తం. అది హిరణ్యయానమనే దోవలో వాయువేగ మనోవేగాలతో ప్రయాణిస్తుంది. ఆ రథం చాలా బృహత్తరమైనది. అది హిరణ్యం అంటే బంగారంతో నిర్మితమైనది. ఆ రథాన్ని అధ్వరాశ్వాలనే మూడు గుర్రాలు నడుపుతుంటాయి. అవి తెల్లగా నున్నగా ఎల్లప్పుడూ యవ్వనంతో అత్యంత ఉత్సాహంతో ఉంటాయి. ఈ రథానికి చక్రాలూ మూడే. సారథి కూర్చోవడానికి త్రిఫలకాలు, త్రిబంధురాలు అనే పేర్లు కలిగిన మూడు ఆసనాలు ఉంటాయి.
ఆ రథంలో ఒకవైపు ధనం మరొకవైపు తేనె, సోమరసం మరొకవైపు ఆయుధాలు ఉంటాయి. రథం పైభాగంలో వేయిపతాకాలు సుందరం గా రెపరెపలాడుతూ ఉంటాయి. అశ్వినీ దేవతల కంఠధ్వని... శంఖనాదంలా మధురంగా ఉంటుంది. ఈ దేవతలను అంతా వేదమంత్రాలతో ఆహ్వానిస్తుంటారు. వీరి చేతిలో తేనె, సోమరసం, మంచుతో అద్దిన బెత్తంతో యజ్ఞం చేసే ప్రదేశానికి విచ్చేసి అధిపతులను యజ్ఞ ద్రవ్యాలను బెత్తంతో సుతిమెత్తగా తాకి వారిని అనుగ్రహిస్తుంటారు.
🌻 అశ్విని దేవతా మంత్రాలు 🌻
ఓం అశ్విని కుమారాభ్యాం నమః
ఓం అశ్విన్యౌవైద్యౌ తే నమః
ఓం అశ్విని దేవతాయై నమః
వేదాలలో ‘అనుమతి’ అనే ఒక దేవతా వర్గం ఉన్నారు. యజ్ఞయాగాది సత్కర్మలు ఆచరించేటప్పుడు ఈ దేవతను స్మరిస్తే వారికి కార్యసిద్ధి లభించే లాగ సహకరిస్తుందని యజ్ఞ ప్రకరణంలో పేర్కొన్నారు. ఆ అనుమతి దేవతలనే సామాన్య భాషలో తథాస్తు దేవతలు అంటున్నారు. సత్కర్మలు జరిగే పవిత్ర ప్రదేశాలే వారి నివాస స్థానం. అశ్వినీ దేవతలే తథాస్తు దేవతలు. వీరు సూర్యుని కుమారులు. అశ్వ రూపంలో నున్న సూర్యుడు, ఛాయాదేవిలకు వీరు జన్మించారు.
మహాభారతంలో పాండురాజు భార్య మాద్రికి మంత్ర ప్రభావంతో నకుల, సహదేవులు గా జన్మించారు. అంతేకాదు ఆయుర్వేదాన్ని దక్ష ప్రజాపతి నుంచి అభ్యసించి ఇంద్రునికి నేర్పించారు. వీరి సోదరి ఉష. ఆమె ప్రతిరోజూ వీరిని బ్రహ్మ ముహూర్తంలో మేల్కొల్పుతుంది. ఆ తర్వాత వారు తమ సోదరి ఉషను ముందు కూర్చోబెట్టుకుని రథాన్ని అధిరోహించి తూర్పు నుంచి పడమటకు ప్రయాణిస్తారని పురాణ వర్ణన.
ఏం మాట్లాడినా తథాస్తు దేవతలుంటారు జాగ్రత్త అని మనల్ని పెద్దలు హెచ్చరిస్తుంటారు ముఖ్యంగా సంధ్యా సమయంలో ఈ దేవతలు సంచరిస్తారని అంటారు. పదే పదే చెడు మాటలు వ్యక్తం చేస్తే అదే జరిగిపోతుందట. 'తథాస్తు' అనేది స్వవిషయంలోనే వర్తిస్తుంది. ధర్మానికి విరుద్ధంగా ఉచ్చరించ కూడని మాటలను పదే పదే అంటే దేవతలు వెంటనే తథాస్తు అనేస్తారు. వీరినే తథాస్తు దేవతలు అంటారు.
ఒకరికి చెడు జరగాలని కోరుకోవడం లేదా మనకు జరుగుతుందేమోనని భయపడటం వల్ల తథాస్తు దేవతల ప్రభావంతో అవి ఫలిస్తాయి. మరికొన్ని దుష్పలితాలు చోటు చేసుకోవడంతో ఇక్కట్లు పెరుగుతాయి.
కాబట్టి ఎప్పుడూ మంచి ఆలోచనలుతో మంచి కోరుకుంటే, భగవత్ చింతనలో ఉంటే అంతా మంచే జరుగుతుంది...
🌹🌹🌹🌹🌹



Comments