top of page

కలియుగంలో భగవన్నామ స్మరణమే మోక్షసాధనం / In the Kali Yuga, chanting the name of God is the means to salvation

  • Writer: Prasad Bharadwaj
    Prasad Bharadwaj
  • 7 days ago
  • 2 min read
ree

🌹 కలియుగంలో భగవన్నామ స్మరణమే మోక్షసాధనం. భక్తి తత్త్వమే తరుణోపాయం. - నారద మహర్షి 🌹

ప్రసాద్ భరద్వాజ


🌹 In the Kali Yuga, chanting the name of God is the means to salvation. Devotion is the only way to liberation. - Sage Narada 🌹

Prasad Bhardwaj


నారద మహర్షి భూలోక పర్యటన చేస్తూ, చాలా పుణ్యక్షేత్రాలు సందర్శించి, యమునా తీరంలో సంచరిస్తున్న సమయంలో, కొంచెం దూరంలో ఒక యువతి ఖిన్నురాలై, దు:ఖిస్తూ కూర్చుంది. ఆమె ముందు ఇద్దరు వ్యక్తులు, చాలా నీరసంతో, అచేతనంగా పడి ఉన్నారు. ఆ యువతి వారికి సేవ చేస్తూ కూర్చొని, మేలుకొలపడానికి ప్రయత్నం చేస్తోంది. ఎవరైనా వచ్చి రక్షిస్తారేమోనని నాలుగు దిక్కులా చూస్తోంది. ఆ యువతి చుట్టూ కొంతమంది స్త్రీలు వింజామరలు వీస్తూ, ఆమెకు సేవ చేస్తున్నారు.


నారద మహర్షి చూసి, కుతూహలంతో, ఆమెను సమీపించి, "దేవీ! నువ్వు ఎవరివి? ఎందుకు దు:ఖిస్తూ ఉన్నావు? ఆ పడిపోయిన ముసలి వాళ్ళు ఎవరు? నీకు చుట్టూ ఉండి నీకు సేవ చేస్తున్న వీళ్ళు ఎవరు? అని అడగ్గానే, ఆ యువతి "మహాత్మా! మీరైనా నా బాధ తొలగించండి. తమరి దర్శనంవల్ల సమస్త పాపములు పటాపంచలై పోయాయి.


మహర్షీ! నా పేరు 'భక్తి'. ఈ ఇరువురు నా కుమారులు. వారి పేర్లు జ్ఞానము, వైరాగ్యము. కలి ప్రభావంతో వీరి అంగాలు శిథిలమయ్యాయి. నా చుట్టూ ఉన్న నన్ను సేవిస్తున్న వారు గంగ, యమున, తపతి, సరస్వతి మున్నగు పవిత్ర నదులే. స్త్రీ రూపంలో నన్ను ఆరాధిస్తున్నారు. సాక్షాత్తు దేవతలచే ఆరాధింపబడుతున్నా కూడా, నాకు సుఖ సంతోషాలు కరువైపోయాయి. నన్ను గౌరవించే వారే కరువై పోయారు.


తపోధనా! కలియుగ ప్రభావం వల్ల పాషాండులు నా అంగములన్నింటినీ భంగపరిచారు. అందువల్ల, నేను, నా కుమారులు తేజో విహీనులమై పోయాం. అచేతనత్త్వంతో అల్లాడుతున్నాము. వీరిద్దరి పరిస్థితి చూస్తే నా మనస్సు వికలమైపోతోంది. దు:ఖంతో విలవిలలాడుతున్నాము." అని చెప్పగానే, నారద మహర్షి, "సాధ్వీ! నా జ్ఞానదృష్టిచే నీ దు:ఖానికి గల కారణం పరిశీలించి చెపుతాను. నీకు మేలు చేకూరుతుంది." అని చెప్పి కొద్ది క్షణాలు ధ్యానంలో ఉండి, ఆమె బాధకు కారణం తెలుసుకొని, "దేవీ ! ఇది కలియుగం. అతి భయంకరమైనది.


సదాచారాలు లోపించాయి. ధర్మం లేదు. ప్రజలు మూఢులై, అజ్ఞానంతో, వంచకులై, దుష్కర్మలు చేస్తూన్నారు. కేవలం ధనార్జన పట్ల మమకారంతో జీవిస్తున్నారు. తమ జీవన విధానానికి ముఖ్యమైన భగవంతుని మర్చిపోతున్నారు. బాలా! నీ దు:ఖం దూరం కాగలదు. శ్రీ కృష్ణ భగవానుడు ఏనాడు ఈ భూలోకాన్ని వదిలి తన పరంథామానికి వెళ్ళాడో, ఆ నాటి నుండే కలి ప్రభావం చూపుతోంది. ఈ కలియుగంలో తపస్సు, యోగము చేత లభించని ఫలం కూడా శ్రీమన్నారాయణ కీర్తనము చేతనే సంపూర్ణంగా లభిస్తుంది.


సత్యయుగము, త్రేతాయుగం, ద్వాపర యుగములలో జ్ఞానము, వైరాగ్యం ముక్తికి సాధనాలై ఉన్నాయి. కానీ కలియుగంలో కేవలం "భక్తి"యే బ్రహ్మ సాయుజ్యము పొందుటకు ఏకైక మార్గం."


సుముఖీ! కలియుగంలో ప్రతీ ఇంటిలో, ప్రతీ వ్యక్తి యొక్క హృదయంలో నిన్ను నేను ప్రతిష్ఠించెదను. ధర్మములన్నటిని త్రోసిరాజని భక్తి దేవికి పట్టం కట్టేటట్లు, మహోత్సవ సంబరాల తీరుగా ప్రచారం చేస్తాను. అలా చేయని పక్షంలో నేను శ్రీ నారాయణ దాసుడును కానేకాదు. కాబట్టి నిన్ను ఆసరా చేసుకుని జీవించడం ఆవశక్యమై ఉంటుంది.


భగవన్నామస్మరణ చేయగానే నీ ద్వారానే ప్రజలు అదే భక్తులు శ్రీ కృష్ణ పరంథామం చేరుకొంటారు. భక్తి శ్రద్ధలతో ఉరకలు వేస్తూ ఆ శ్రీకృష్ణుని తలపోస్తూ ఉంటారు. భగవంతుడు దేనివల్ల వశుడు కాడు. కేవలం ఒక భక్తి అంటే నీ ద్వారానే వశుడు కాగలడు అని ప్రజల్లో భక్తిని కలిగించే మార్గాలు విశదీకరించాడు. అలా నారదుని మాటలు వినేసరికి ఆమెలో చైతన్యం వచ్చింది. కానీ కుమారులైన జ్ఞానము, వైరాగ్యం కదలక ఉంటే, నారదమహర్షి వారి చెవిలో భగవన్నామస్మరణ చేయగానే చైతన్యవంతులయ్యారు. ఇలా కలియుగంలో మనం ఎంతోకొంత భక్తి తత్త్వాన్ని కలిగి ఉన్నామంటే, మహాత్ములే కారణం. భగవన్నామ స్మరణ మాత్రమే ఈ యుగంలో మోక్షసాధనం.

🌹 🌹 🌹 🌹 🌹


Comments


©2023 by Daily Bhakti Messages 3.
Proudly created with Wix.com

bottom of page