top of page

గ్రహణాల సమయంలో తెరవని దేవాలయాలు Temples that remain open during eclipses

  • Writer: Prasad Bharadwaj
    Prasad Bharadwaj
  • Feb 24
  • 2 min read

🌹 గ్రహణం రోజుల్లో కూడా తెరిచి ఉండే ఆలయాలు ఇవే.. వీటి ప్రత్యేకతలు. 🌹

ప్రసాద్ భరద్వాజ


🌹 These are the temples that remain open even during eclipses.. Their special features. 🌹

Prasad Bharadwaja



సాధారణంగా గ్రహణాల సమయంలో దేవాలయాలు మూసివేయడం అనేది ఆనవాయితీ. కానీ కొన్ని ప్రత్యేక నమ్మకాలు, ఆచారల కారణంగా గ్రహణ సమయంలో సూతక కాలంలో కూడా కొన్ని దేవాలయాలు తెరిచి ఉంటాయి.


Usually, it is customary for temples to close during eclipses. But due to some special beliefs and rituals, some temples remain open even during the Sutaka period during eclipses.



🔱 శ్రీకాళహస్తి శివాలయం, అరుణాచల క్షేత్రం 🔱


ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తి శివాలయం, అరుణాచల క్షేత్రం ప్రధానమైనవి. ఈ దేవాలయాల్లో గ్రహణ కాలంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు. అరుణాచలం, శ్రీకాళహస్తిలోని శివాలయాల్లోని శివలింగాలు స్వయంభువులు కావడం, ఇవి నవగ్రహాలను తమ ఆధీనంలో ఉంచుకోవడం కారణంగా పండితులు చెబుతారు. దైవిక శక్తి ఈ క్షేత్రాలను గ్రహణాల ప్రభావం నుంచి రక్షిస్తుందని ప్రగాఢ నమ్మకం.


మన పురాణాల ప్రకారం శ్రీకాళహస్తిలో కొలువై ఉన్న వాయులింగేశ్వరుడు సూర్యచంద్రులు, అగ్నిభట్టారడితో పాటు నవగ్రహాలు, 27 నక్షత్రాలతో కవచాన్ని ఏర్పాటు చేసుకుని దర్శనమిస్తాడు. అందువల్ల ఈ శివ క్షేత్రానికి రాహువు, కేతువుల వల్ల ఎలాంటి నష్టం ఉండదు. వాస్తవానికి గ్రహణాల సమయంలో రాహుకేతువులు బలమైన శక్తిని కలిగి ఉంటారని నమ్మకం.


అయినా కూడా గ్రహణం రోజు శ్రీకాళహస్తీశ్వరాలయం తెరిచే ఉంటుంది. అంతే కాకుండా శ్రీజ్ఞాన ప్రసునాంబిక దేవి సమేత శ్రీకాళహస్తీశ్వరునికి గ్రహణ కాల అభిషేకాలు నిర్వహించడం కూడా సంప్రదాయంగా కొనసాగుతోంది. ఇక ఈ క్షేత్రంలోని స్వామి వారిని, అమ్మవారిని ఒక్కసారి దర్శనం చేసుకుంటే రాహుకేతు దోషాలే కాకుండా నక్షత్ర దోషాలు, నవ గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఇక్కడ రాహు కేతు, సర్ప దోష నివారణ పూజలకు దేశ విదేశాల నుంచి భక్తులు విచ్చేస్తారు.


🍀 మహాకాళేశ్వర ఆలయం - ఉజ్జయిని 🍀


శివుడి యొక్క 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఉజ్జయినిలోని శ్రీ మహాకాళేశ్వర ఆలయం గ్రహణ సమయంలో కూడా తెరిచే ఉంటుంది. ఇక్కడ శివుడు స్వయంభు మహాకాళ రూపంలో కొలువై ఉంటాడు. ఈ ఆలయంపై గ్రహణం ప్రభావం ఉండదని పండితులు చెబుతారు. అందుకే గ్రహణం సమయంలో కూడా ఆలయం తలుపులు తెరిచే ఉంటారు.


🌿 కల్కాజీ ఆలయం- ఢిల్లీ 🌿


ఢిల్లీలో ఉన్న కల్కాజీ ఆలయం కూడా గ్రహణ సమయంలోనూ తెరిచే ఉంటుంది. ఈ ఆలయంలో కొలువై ఉన్న కల్కా దేవి కాలచక్రానికి అధిపతి అని ప్రగాఢంగా నమ్ముతారు. గ్రహాలు, నక్షత్రాలు ఆమె గుండా కదులుతాయని విశ్వాసం. కాబట్టి గ్రహణం కల్కా దేవిని ప్రభావితం చేయదని నమ్ముతారు. అంతే కాకుండా గ్రహణం సమయంలో ప్రత్యేక పూజల నిమిత్తం భక్తులు ఈ ఆలయానికి వస్తారు.


🌴 కల్పేశ్వర్ ఆలయం - ఉత్తరాఖండ్ 🌴


ఉత్తరాఖండ్‌లోని కల్పేశ్వర్ ఆలయం గ్రహణం సమయంలో కూడా తెరిచి ఉంటుంది. ఈ ఆలయంలో కొలువై ఉన్న శివుడు గంగామాత ప్రవాహాన్ని తగ్గించాడని చెబుతారు. ఈ ఆలయంలో గ్రహణ సమయంలో కూడా యథావిథిగా దర్శనాలు కొనసాగుతాయట.


🌺 తిరువరప్పు శ్రీకృష్ణ ఆలయం - కొట్టాయం 🌺


కేరళ రాష్ట్రం కొట్టాయంలోని తిరువరప్పులో శ్రీకృష్ణుడి ఆలయం ఉంది. ఇక్కడ శ్రీకృష్ణుడికి రోజుకు పదిసార్లు ఆహారం నైవేద్యంగా పెడతారు. ఇక్కడ స్వామి వారికి ఆకలి బాగా ఎక్కువగా ఉంటుందట. ఆకలి కారణంగా స్వామి వారి విగ్రహం సన్నగిల్లుతుందని నమ్ముతారు. దీంతో గ్రహణ సమయంలో కూడా ఈ ఆలయం తలుపులు మూసివేయకుండా స్వామి వారికి నైవేద్యాలు సమర్పిస్తూనే ఉంటారు.


🕉 విష్ణుపాద ఆలయం - గయ 🕉


ఈ ఆలయంలో గ్రహణం సమయంలో పిండ ప్రధానం చేయడం మంచిదని విశ్వసిస్తారు. అందుకే గయలోని విష్ణుపాద ఆలయం గ్రహణం సమయంలో కూడా తెరిచే ఉంటుందట.


🌻 లక్ష్మీనాథ్ ఆలయం - బికనీర్‌ 🌻


రాజస్థాన్‌ రాష్ట్రం బికనీర్‌లోని లక్ష్మీనాథ్ ఆలయాన్ని కూడా గ్రహణాల సమయంలో మూసివేయరట. ఎందుకంటే ఓసారి గ్రహణం సమయంలో ఆలయం తలుపులు మూసివేసి దేవుడికి నైవేద్యం పెట్టలేదట. అప్పుడు ఆలయ సమీపంలోని మిఠాయి దుకాణంలోని వ్యాపారికి ఓ కల వచ్చిందట. ఆ కలలో దేవుడు ప్రత్యేక్షమై తనకు బాగా ఆకలిగా ఉందని చెప్పాడట. అప్పటి నుంచి గ్రహణం సమయంలో కూడా ఈ ఆలయం తెరిచే ఉంటుంది.

🌹 🌹 🌹 🌹 🌹


Comments


©2023 by Daily Bhakti Messages 3.
Proudly created with Wix.com

bottom of page