top of page

జయ ఏకాదశి భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు అందరికి Jaya Ekadashi & Bheeshma Ekadashi Greetings to All

Writer's picture: Prasad BharadwajPrasad Bharadwaj

జయ ఏకాదశి భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు అందరికి Jaya Ekadashi & Bheeshma Ekadashi Greetings to All



🌹భీష్మ ఏకాదశి 🌹


🍀 భీష్మ ఏకాదశి అని ఎందుకంటారు ? 🍀


మాఘ మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు. ఈ రోజునే కురుకుల యోధుడు భగవంతుడిలో ఐక్యమైన రోజు. బీష్ముడు పాండవులకు చేసిన మహోపదేశం విష్ణు సహస్రనామం.


కురుక్షేత్ర సంగ్రామం పూర్తయిన తర్వాత భీష్మపితామహుడు అంపశయ్యపైనే ఉన్నాడు. నెల రోజులు గడిచాక ఒకనాడు పాండవులతో పాచికాలుడుతు గోపాలుడు హఠాత్తుగా ఆగిపోయాడు. దీనికి కలవరపడిన పాండవులు ఏమైందని శ్రీకృష్ణుడిని ప్రశ్నించారు.


మాంధ్యాతి భగవాన్ భీష్మః తపోమే తద్గతం మనః"

కురుక్షేత్రంలో అంపశయ్యపై పవళించి ఉన్న భీష్మపితామహుడు నన్ను స్మరించుకుంటున్నాడని ఆ జగన్నాటక సూత్రధారి సమాధానం ఇస్తాడు. అందుకే నా మనసు అక్కడికి వెళ్లిపోయింది, మీరు కూడా నాతో రండని పాండవులకు తెలిపాడు. ఎందుకంటే భీష్ముడు ఆస్తికాగ్రేసరుడు, ధర్మశాస్త్రాలను అవపోశణం పట్టి పూర్తిగా ఆకలింపు చేసుకున్న మహనీయుడు. ఏ ధర్మ సందేహాన్నైనా ప్రామాణికంగా తీర్చగలిగిన ఏకైక మహానుభావుడు దేహం నుంచి నిష్క్రమించే సమయం ఆసన్నమవుతోంది, ఆయన అస్తమిస్తే లోకంలో ధర్మ సంశయాలని తీర్చే వ్యక్తులు ఎవ్వరూ ఉండరు కాబట్టి సూక్ష్మ విషయాలను తెలుసుకోడానికి రండి' అని భీష్మపితామహుడి చెంతకు తీసుకు వచ్చాడు. సుమారు మూడు పక్షాల నుంచి అంపశయ్యపై పడి ఉన్నాడు. దేహమంతా బాణాలు గుచ్చుకుని పూర్తిగా శక్తి క్షీణించిపోయింది. మాఘమాసంలో ఎండకు ఎండుతూ, మంచుకు తడుస్తూ, నీరు, ఆహారం స్వీకరించకుండా ఉన్నాడు. తాను కోరుకుంటే మరణం చెంతకు వస్తుంది, కానీ ఇన్ని బాధలను భరిస్తూ ఉత్తరాయణం వరకు ఉండాలి అని కోరుకున్నాడు. ఒక ఏకాదశి నాడు దేహం నుంచి నిష్క్రమించాలని భగవంతుడిని తలచుకున్నాడు.


తన హృదయ మందిరంలోనే శ్రీకృష్ణుడితో మాట్లాడగలిగే వాడు. అంతటి జ్ఞానం కలిగిన మహనీయులకు ఈరోజు ఆరోజు అనే నియమం ఉండదు అని ఉపనిషత్తు చెబుతుంది. అలాంటి వాళ్లు ఏ రోజు నిష్క్రమించినా వైకుంఠం ప్రాపిస్తుంది. భీష్ముడు తనకి మాతా పితా బ్రాతా నివాసః శరణం సుహ్రుత్ గతిః గమ్యం సర్వం నారాయణః అని అనుకున్న మహనీయుడు. ఆయనకు సర్వం శ్రీకృష్ణుడే అని విశ్వసించేవాడు. అయితే తాను చేసిన దోషం ఒకటి స్పష్టంగా గాంగేయుడికి జ్ఞాపకం ఉంది. చేసిన ప్రతి పాపం శరీరం పైనే రాసి ఉంటుందట! అది తొలగితే తప్ప సద్గతి కలగదట. ఇంతకీ భీష్మపితామహుడు చేసిన దోషం ఏంటంటే ? పాండవ పత్ని ద్రౌపదికి నిండు సభలో అంతటి అవమానం జరుగుతున్నా ఏమీ చేయలేక పోయాడు. ద్రౌపదికి శ్రీకృష్ణుడంటే అత్యంత ప్రేమ. తన గురువైన వసిష్ఠుడు ఆమెతో ఇలా చెప్పారట "మహత్యాపది సంప్రాప్తే స్మత్తవ్యః భగవాన్ హరిః" హే ద్రౌపతి! ఇతరులు తొలగించలేని ఆపదలు కలిగినపుడు శ్రీహరిని స్మరించుకోమన్నారు.


కురుసభలో వస్త్రాపహరం జరుగుతుంటే అతి పరాక్రమవంతులైన అయిదుగురు భర్తలు ఆమె గౌరవాన్ని కాపాడలేకపోయారు. వారు కేవలం సామాన్య ధర్మాన్నే పాటించారు, కాని సాటి మనిషిగా ఆమెను కాపాడాలనే విశేష ధర్మాన్ని పక్కనబెట్టారు. కృష్ణుడు తన భక్తులకి జరిగే అవమానాన్ని సహించలేడు. కాబట్టే అలా చేసినందుకు కౌరవులను మట్టు పెట్టాడు. పాండవులకూ కూడా అదే గతి పట్టేది. కానీ అలా చేస్తే చివర తను ఎవరిని రక్షించాలనుకున్నాడో ఆమెకే నష్టం జరుగుతుందని భావించాడు. ఈ విషయాన్ని సాక్షాత్తు ఆ భగవంతుడే అర్జునుడితో చెప్పాడట. ద్రౌపదికి ఎప్పుడు అవమానం జరిగిందో అప్పుడే వారిని తీసి పాడేశాను, ఇప్పుడు వారు కేవలం కాలిపోయిన కాగితంలా ఉన్నారే తప్ప, ఆ గౌరవాన్ని నీకు కట్టబెట్టాలని యుద్ధం చేయమంటున్నాంటూ అర్జునుడితో శ్రీకృష్ణుడు అన్నాడట.


భీష్ముడు ఆనాడు ధర్మరాజుకు లేవనెత్తిన సందేహాలను తీరుస్తుంటే, పక్కనే ఉన్న ద్రౌపది నవ్వుతూ 'తాతా! ఆనాడు నాకు అవమానం జరుగుతుంటే ఏమైయ్యాయీ ధర్మాలు' అని ప్రశ్నించిదట. అందుకు భీష్ముడు 'అవును తల్లీ! నా దేహం నా అధీనంలో లేదు, అది ధుర్యోదనుడి సొంతం. నీకు అవమానం జరుగుతుందని తెలిసినా, నా దేహం నా మాట వినలేదని అన్నాడు. అంతటి ఘోరమైన పాపం చేశాను కాబట్టే ప్రక్షాళన కోసం ఇన్ని రోజులు అంపశయ్యపై ఉన్నానని చెప్పాడు. కురు వంశాన్ని కాపాడుతానని తన తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడిపోయిన భీష్ముడు, పరిస్థితుల ప్రభావంతో విశేష ధర్మాన్ని త్వజించాడు. ' హే ద్రౌపతీ! కృష్ణ భక్తిలో ఎలాంటి కల్మషం లేదు, కానీ శరీరం దుష్టమైపోయింది. దాన్ని పరిశుద్ధం చేసుకోడానికే అంపశయ్యపై పడి ఉన్నాను, అందుకు ఈనాడు నేను ధర్మాలను బోధించవచ్చని పాండవులకు ఎన్నో సూత్రాలను బోధించాడు. శ్రీకృష్ణుడు భీష్ముడికి నొప్పి నుంచి ఉపశమనం కలిగేలా వరాన్ని ప్రసాందించి ధర్మసూత్రాలను చెప్పించాడు.


నాకెందుకు శక్తినిచ్చి చెప్పిస్తున్నావు, నీవే చెప్పొచ్చుకదా అని భీష్ముడు ప్రశ్నించాడు. నీలాంటి అనుభవజ్ఞుడు చెబితే వచ్చే స్పష్టత నేను చెబితే ఉండదని కృష్ణుడు బదులిచ్చాడు. నేను చెబితే అది తత్వం, నీవు చెబితే అది తత్వ ద్రష్టం. తత్వాన్ని చూసినవాడు దాని గురించి చెప్పాలే తప్ప తత్వం తన గురించి తాను చెప్పుకోదు. నేల తన సారాన్ని చెప్పగలదా! అందులో పండిన మొక్క చెబుతుంది ఎంత సారమో. అలాగే అనుభవజ్ఞుడవైన


నీవు ఉపదేశంచేస్తే అది లోకానికి శ్రేయస్సు. భగవంతుడు సముద్రం లాంటి వాడు, నీరు ఉంటుంది కానీ పాన యోగ్యం కాదు. అదే నీటిని మేఘం వర్షిస్తే పనయోగ్యమవుతుంది. అందుకే భగవత్ జ్ఞానం నేరుగా కాకుండా తత్వం తెలిసిన భీష్ముడి ద్వారా అది అందితే లోకానికి హితమని జగన్నాటక సూత్రధారి భావించాడు. అలా శ్రీకృష్ణుడు వరం ఇచ్చి, భీష్ముడి ద్వారా ధర్మ సారాన్ని పాండవులకు ఉపదేశం చేయించాడు. భగవద్గీత ఆయనే నేరుగా చెప్పాడు, విష్ణు సహస్రనామాల్ని భీష్ముడి ద్వారా చెప్పించాడు. కాబట్టి విష్ణు సహస్రనామాల వల్ల సులభంగా మోక్షం కలుగుతుంది.

🌹🌹🌹🌹🌹


Comments


©2023 by Daily Bhakti Messages 3.
Proudly created with Wix.com

bottom of page