ధనుర్మాసం విశిష్టత / The significance of Dhanurmasam
- Prasad Bharadwaj
- 3 hours ago
- 2 min read

🌹 ధనుర్మాసం విశిష్టత - దైవ ఆశీస్సులను పొందడానికి చేసే భక్తి సాధనలకు ఉత్తమ సమయం. లౌకిక శుభకార్యాలకు విరామం. 🌹
ప్రసాద్ భరద్వాజ
🌹 The significance of Dhanurmasam - It is the best time for devotional practices to receive divine blessings. A period of pause for worldly auspicious events. 🌹
Prasad Bhardwaj
కాలచక్రంలో పంటలు పండించే భూమికి కూడా రుతువుల మార్పులో కొంతకాలం విశ్రాంతి అవసరమైనట్టే.. గ్రహగతుల రీత్యా శుభకార్యాలకు కాస్త విరామం ఇవ్వాల్సిన సమయం ఉంటుంది. ఉత్తరాదిన దీన్ని ఖర్మాస్ అని పిలిస్తే... తెలుగు నాట ‘ధనుర్మాసం’ అంటారు. ధనుర్మాసం దైవారాధనకు ఇది అత్యంత పవిత్రమైన సమయమే అయినా, శుభకార్యాలకు మాత్రం నిషిద్ధం.
ధనుర్మాసం 2025 డిసెంబర్ 16న ప్రారంభమైంది. హిందూ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శుభకార్యాలకు విరామం ఇచ్చే కాలాన్ని సూచిస్తుంది. సూర్యదేవుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించినప్పుడు ధనుర్మాసం మొదలవుతుందని జ్యోతిష్య నమ్మకం. ఈ కాలంలో సూర్యుని ప్రభావం తగ్గుతుందని విశ్వసిస్తారు. అందుకే ప్రధాన వేడుకలు, నూతన ప్రారంభాలను ఈ సమయంలో వాయిదా వేస్తుంటారు.
సూర్యుడు ప్రతి ఏటా రెండుసార్లు ధనస్సు లేదా మీన రాశులలోకి ప్రవేశించినప్పుడు ఈ కాలం వస్తుంది. ఈ రెండు రాశులకు అధిపతి గురుడు (బృహస్పతి). ఈ సమయంలో సూర్యుడు గురుగ్రహ ప్రభావంతో విశ్రాంతి తీసుకుంటాడని గ్రంథాలు, జ్యోతిష్య సంప్రదాయాలు చెబుతున్నాయి. ఈ మాసంలో శుభకార్యాలు చేయకూడదు. ఆధ్యాత్మిక సాధనలు, దానధర్మాలకు ఈ కాలం ఎంతో అనుకూలమైనది.
గ్రహ దోషాలను తగ్గించి, దైవ ఆశీస్సులను పొందడానికి ఈ సమయం ఉత్తమమని నమ్ముతారు. ముఖ్యంగా సూర్యదేవుడు, బృహస్పతి అనుగ్రహం కోసం చేసే పూజలు విశేష ఫలితాలనిస్తాయి. జ్యోతిష్యుల ప్రకారం డిసెంబర్ 16న తెల్లవారుజామున 4:26 గంటలకు సూర్యదేవుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించడంతో ధనుర్మాసం ప్రారంభమైంది. సూర్యుడు ఈ రాశిలో 2026 జనవరి 14 వరకు ఉంటాడు. ఆ తర్వాత మకర రాశిలోకి మారతాడు. ఈ మార్పుతో మకర సంక్రాంతి రోజున ధనుర్మాసం ముగుస్తుంది. అప్పటి నుంచి శుభకార్యాలకు అనుకూల ముహూర్తాలు తిరిగి వస్తాయి.
ధనుర్మాసం సమయంలో కొన్ని ప్రధాన శుభకార్యాలు, ప్రారంభోత్సవాలకు దూరంగా ఉండాలని సూచిస్తారు. వీటిలో వివాహాలు, నిశ్చితార్థాలు, పిల్లల నామకరణం, శిరోముండనం, ఉపనయనం వంటి సంస్కారాలు కూడా ఈ కాలంలో చేపట్టడం మంచిది కాదని చెబుతారు. కొత్త ఇల్లు కట్టుకోవడం లేదా గృహప్రవేశం చేయడం, కొత్త వ్యాపారం లేదా భాగస్వామ్యాన్ని ప్రారంభించడం, ఆస్తి కొనుగోళ్లు, వాహనాలు కొనడం లేదా పెద్ద పెట్టుబడులు పెట్టడం వంటివి కూడా ఈ కాలంలో నివారించాలి. ధనుర్మాసం సమయంలో ఇలాంటి కార్యకలాపాలను ప్రారంభించడం ఆలస్యాలకు, ఆటంకాలకు లేదా ప్రతికూల ఫలితాలకు దారితీస్తుందని జ్యోతిష్య నమ్మకం.
భౌతిక కార్యకలాపాలకు పరిమితులు ఉన్నప్పటికీ, ఆధ్యాత్మిక వృద్ధికి, దోష నివారణలకు ధనుర్మాసం చాలా ప్రయోజనకరమైన సమయం. ప్రతిరోజూ ఉదయం రాగిపాత్రలో నీరు, కుంకుమ, ఎర్రటి పువ్వులు, బియ్యం కలిపి సూర్యదేవునికి అర్ఘ్యం ఇవ్వడం శ్రేష్ఠం. అలాగే, మంత్ర పఠనం, ధ్యానం, తపస్సు, దానధర్మాలు చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది.
వీలైతే గంగానదిలో లేదా ఏదైనా పవిత్ర నదిలో స్నానం చేయడం మంచిది. ఆవులు, బ్రాహ్మణులు, పేదల సేవలో పాల్గొనడం శ్రేష్ఠం. ఈ కాలంలో కనీసం ఒకసారైనా పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవడం ద్వారా గ్రహ దోషాలు తొలగిపోయి, దైవ ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు.
పండుగలకు అశుభకరమైనదిగా భావించినా, ధనుర్మాసం ఆధ్యాత్మికంగా శక్తివంతమైన సమయం. ఈ కాలంలో నిష్ఠతో కూడిన భక్తి, దానధర్మాలు, క్రమశిక్షణ దీర్ఘకాలిక శాంతి, స్థిరత్వం, సానుకూల మార్పులను తెస్తాయని జ్యోతిష్యులు పేర్కొన్నారు. ధనుర్మాసంలో భక్తులు తమ లౌకిక ఆకాంక్షలను తగ్గించుకుని, అంతర్ముఖులై విశ్వాసం మరియు ఆధ్యాత్మిక సమతుల్యతను పెంపొందించుకోవాలి.
🌹🌹🌹🌹



Comments