top of page

నేడు పోలాల అమావాస్య (Polala Amavasya)

  • Writer: Prasad Bharadwaj
    Prasad Bharadwaj
  • Sep 2, 2024
  • 3 min read

నేడు పోలాల అమావాస్య


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


పోలాల అమావాస్య - (పోలాంబ వ్రతం) నాడు పాటించవలసిన ముఖ్య నియమములు ఏమిటి ?


పోలేరమ్మ అమ్మవారు గ్రామదేవతగా పూజలందుకుంటూ ఉన్న దేవత. దాదాపు ప్రతి గ్రామం , పట్టణాల్లో పొలిమేర్లలో ఈ అమ్మవారి ఆలయాలు కొలువుదీరి పూజలందు కుంటూ ఉండడం చూడవచ్చు.


ఆమె సంతానం లేనివారికి సంతానం ప్రసాదిస్తుందనీ , సంతానం కలిగినవారికి కడుపు చలువ చేస్తుందని విశ్వాసం. అటువంటి దేవతను పూజిస్తూ చేసే వ్రతమే ఇది.



పోలాల అమావాస్య


వ్రతాలమాసంగా ప్రసిద్ధి చెందినది శ్రావణమాసంలోని వ్రతాలలో “పోలాల అమవాస్య వ్రతం” ఒకటి.


దీనిని శ్రావణ మాసంలోని బహుళ పక్ష అమవాస్యనాడు ఆచరిస్తారు. ఈ అమవాస్యకు ‘పోలామావాస్య’ అని పేరు. దీనికే ‘పోలాల అమావాస్య , పోలాలమావాస్య , పోలాంబవ్రతం’ వంటి పేర్లు కూడా ఉన్నాయి.


ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల పిల్లలకు ‘అపమృత్యు భయం’ తొలగిపోయి ఆయురారోగ్యాలు వర్ధిల్లుతాయని చెప్పబడుతూ ఉంది.


ఈ వ్రతమునకు సంబంధించి ఆసక్తికరమైన ఒకగాథ ప్రచారంలో ఉంది.


పూర్వం బ్రాహ్మణ దంపతులు ఒక గ్రామంలో నివసిస్తూ ఉండేవారు. వారికి ఏడుగురు కుమారులు కలిగారు. యుక్త వయస్సు రాగానే వారందరికీ వివాహాలు చేశారు.


వారికి సంతానం కూడా కలిగింది. ఆ ఏడుమందీ తల్లిదండ్రుల వద్ద నుంచి వేరై… అదే గ్రామంలో విడివిడిగా నివాసాలను ఏర్పాటు చేసుకుని నివసిస్తూ ఉండేవారు.


తమ సంతానం బాగా ఉండాలంటే ‘పోలాంబ’ అమ్మవారిని శ్రావణమాసంలో అమవాస్య నాడు పూజిస్తూ వ్రతం చేయడం మంచిదని ఎవరో చెప్పగా విన్న ఆ ఏడుమంది శ్రావణ అమవాస్య కోసం ఎదురుచూడ సాగారు.


శ్రావణమాసం వచ్చింది. అనేక వ్రతాలను ఆచరించారు. చివరిరోజు అయిన అమవాస్యనాడు పోలాంబవ్రతం ఆచరించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నారు.


ఏడుగురు కోడళ్ళ ఉత్సాహంగా వ్రతం చేసేందుకు సిద్ధమయ్యారు. వ్రతం నాటి ఉదయాన్నే ఏడో కోడలి బిడ్డ మరణించింది.


ఫలితంగా ఆ రోజు వ్రతం చేయలేకపొయ్యారు. మరుసటి సంవత్సరం వ్రతం చేయడానికి ప్రయత్నం చేశారు.


కానీ మళ్ళీ ఆ సంవత్సరమూ ఏడవ కోడలి మరో బిడ్డ చనిపోవడంతో వ్రతానికి ఆటంకం ఏర్పడింది. ఈ విధంగా ప్రతి సంవత్సరం వ్రతం చేయడానికి ఏర్పాట్లు చేసుకోవడం ఆ దినం ఉదయం ఏడవ కోడలి బిడ్డ మరణించడం వ్రతంచేయలేకపోవడం…


ఈ విధంగా ఏడు సంవత్సరాలు జరిగింది. మిగతా ఆరుమంది కోడళ్ళు ఏడవ కోడలి వల్ల వ్రతం చెడిపోతూ ఉంది అని తిట్టుకోసాగారు. ఆమెకు ఎక్కడలేని దుఃఖం కలుగుతూ ఉండేది.


మరుసటి సంవత్సరం అంటే ఎనిమిదో సంవత్సరం నోముకు అవసరమైన ఏర్పాట్లు అన్నీ చేసుకున్నారు.


అయితే ఆ రోజు ఉదయమే ఏడో కోడలి బిడ్డ చనిపోయింది. ఈ విషయం తెలిస్తే అందరూ నిందిస్తారని , వ్రతం తన వల్ల ప్రతి సంవత్సరం చెడిపోతూ ఉందని కోప్పడతారని భావించిన ఏడో కోడలు ఆ విషయాన్ని బయటకు చెప్పకుండా.


చనిపోయిన బిడ్డ శరీరాన్ని ఇంట్లో ఉంచి , మిగతా కోడళ్ళందరి తో కలిసి వ్రతంలో పాల్గొంది.


అందరూ ఆనందంతో వ్రతం చేస్తూన్నా… తాను మాత్రం ఏదో పాల్గొంటూ ఉన్నట్లుగా యూంత్రికంగా వ్రతంలో పాల్గొంది. రాత్రి వరకూ అలా గడిచింది.


చీకటిపడి గ్రామం సదుమణిగిన అనంతరం చనిపోయిన బిడ్డను భుజాన వేసుకుని గ్రామ పొలిమేరలో ఉన్న ‘పోలేరమ్మ’ గుడికి వెళ్ళి బిడ్డను గుడిమెట్ల మీద ఉంచి , తన పరిస్థితిని తలుచుకుని దుఃఖించసాగింది. ఎలా ఖననం చేయాలి ? అని ఏడ్వసాగింది.


ఇలాంటి స్థితిలో గ్రామదేవత అయిన పోలేరమ్మ గ్రామ సంచారం ముగించుకుని , అక్కడికి చేరుకుని ఆమెను చూసి ఆ సమయంలో ఏడుస్తూ అక్కడ కూర్చొనడానికి కారణం అడిగింది.


దీనితో ఆమె గత ఎనిమిది సంవత్సరాలుగా జరుగుతున్నదంతా వివరించింది.


వీటన్నింటిని విన్న పోలేరమ్మ అమ్మవారు కరుణించి ఆమెకు అక్షతలు యిచ్చి పిల్లలను కప్పిపెట్టిన చోట వాటిని చల్లి పిల్లలను వారి వారి పేర్లతో పిలువవలసిందిగా చెప్పింది.


ఏడవకోడలు అదేవిధంగా చేసింది. ఫలితంగా చనిపోయిన పిల్లలందరూ నిద్ర నుంచి లేచి వచ్చినట్లుగా లేచి వచ్చారు. వారందరినీ తీసుకొని పోలేరమ్మ అమ్మవారికి నమస్కరించి , ఇంటికి చేరుకుంది.


మరుసటి రోజు ఉదయం తన ఆరుగురు తోడి కోడళ్ళతోపాటూ గ్రామంలోని వారందరికీ ఈ విషయాన్ని వివరించింది.


వారందరూ ఎంతో సంతోషించారు. అంతే కాకుండా అప్పటి వరకూ కేవలం కొద్ది మందికి మాత్రమే పరిమితమైన ఈ వ్రతం అప్పటి నుంచి అందరూ చేయడం ప్రారంభించినట్లు చెప్పబడుతూ ఉంది.


కాగా , ‘పోలేరమ్మ అమ్మవారు’ గ్రామదేవతగా పూజలందుకుంటూ ఉన్న దేవత. దాదాపు ప్రతి గ్రామం , పట్టణాల్లో పొలిమేర్లలో ఈ అమ్మవారి ఆలయాలు ఉండడం గాని , లేదంటే బహీరంగంగా కొలువుదీరి పూజలందుకుంటూ ఉండడం గానీ చూడవచ్చు.


ఆమె సంతానం లేనివారికి సంతానం ప్రసాదిస్తుందనీ , సంతానం కలిగినవారికి కడుపు చలువ చేస్తుందని విశ్వాసం. అటువంటి దేవతను పూజిస్తూ చేసే వ్రతమే ఇది.


పాటించవలసిన ముఖ్య నియమములు


తెల్లవారు ఝామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని , తలస్నానంచేసి , ఇంటిని శుభ్రపరచుకుని మహిళలు తమ పిల్లలను వెంటబెట్టుకుని పోలేరమ్మ ఆలయానికి వెళ్ళి పూజలు చేసి , ఇంటికి చేరుకుని పూజాగదిలో పోలేరమ్మను పసుపుకొమ్ముతో గానీ , పసుపుతోగాని చేసుకొని ప్రతిష్టించుకుని పూజ చేయాలి. ఈ పూజావిధానములో పార్వతీ దేవి అష్ణోత్తరం చదవుతూ ఉండడం విశేషం. పూజ ముగించిన అనంతరం పసుపు పూసిన దారానికి పసుపుకొమ్మ కట్టి తయారుచేసుకున్న తోరము’ ఒకదానిని తీసుకుని పోలేరమ్మకు సమర్పించడంతో పాటూ , మిగతా తోరములను పిల్లల మెడలో వేయాలి.


ఈ విధంగా పూజచేసి ‘పెరుగు అన్నం’ ను నైవేద్యంగా సమర్పించి పూజ ముగించాలి. పెరుగన్నమును ప్రసాదంగా స్వీకరించి వ్రతాన్ని ముగించాలి.


ప్రతి సంవత్సరం శ్రావణ బహుళ అమవాస్య రోజు వ్రతాన్ని ఆచరించడం వల్ల సంతానభాగ్యం కలుగుతుందనీ , సంతానానికి అపమృత్యు భయం తొలగిపోయి ఆయురారోగ్యాలు వర్ధిల్లుతాయని శాస్రాలు చెబుతున్నాయి.


Recent Posts

See All

Comments


©2023 by Daily Bhakti Messages 3.
Proudly created with Wix.com

bottom of page