top of page

నవ దుర్గల ఆరాధన - షష్టమ దుర్గ శ్రీ కాత్యాయనీ దేవి (Worship of the Nava Durgas – The Sixth Durga: Sri Katyayani Devi)

Writer: Prasad Bharadwaj
Prasad Bharadwaj
Oct 16
2 min read


🌹🔱 6. నవ దుర్గల ఆరాధన - షష్టమ దుర్గ శ్రీ కాత్యాయనీ దేవి - మహాలక్ష్మీదేవి విశిష్టత, ప్రార్థనా శ్లోకాలు, ఆరాధనా విధానం - పురాణ కధ, సాధన 🔱🌹

✍️ ప్రసాద్ భరద్వాజ


🌹🔱 6. Worship of the Nava Durgas (Nine Forms of Durga) – The Sixth Durga: Sri Katyayani Devi – Significance of Goddess Mahalakshmi, Prayer Verses, Rituals of Worship – Puranic Legend, Spiritual Practice 🔱🌹

✍️ Prasad Bharadwaj



ఆరాధనా దినం: ఆరవ రోజు | సంప్రదాయ రంగు: ఎరుపు


శ్రీ కాత్యాయనీ దేవి మహర్షి కాత్యాయనుని తపస్సుకు అనుగ్రహంగా అవతరించిన దివ్యశక్తిగా పురాణాల్లో వర్ణించబడుతుంది. మహిషాసురుని సంహరించిన దుర్గాదేవి పరాక్రమంలో ఈమె స్వరూపాన్ని కూడా దర్శిస్తారు.


నాలుగు హస్తాలతో, సింహవాహినిగా, ఖడ్గం, పద్మం వంటి వాటిని ధరించి దర్శనమిచ్చే ఈమె ధర్మరక్షణకు, ధైర్యానికి, న్యాయానికి ప్రతీక.


శ్రీకృష్ణుని భర్తగా పొందాలని వ్రతం చేసిన గోపికలు కాత్యాయనీ దేవిని ఆరాధించారని భాగవత పురాణం వివరిస్తుంది. అందువల్ల ఈమెను భక్తులు తమ మనోభీష్టాల సాధన కోసం కూడా ప్రార్థిస్తారు.


కాత్యాయనీ తత్త్వంతో సాధకుడి మనస్సు ఆజ్ఞా చక్రంలో స్థిరమవుతుంది. ఈ తత్వం అన్యాయాన్ని ఎదుర్కొనే ధైర్యం, ధర్మం పట్ల నిబద్ధత, లక్ష్యసాధనలో పట్టుదల కలిగి ఉండాలని బోధిస్తుంది.


🌼 కాత్యాయనీ ప్రార్థనా శ్లోకం


చంద్రహాసోజ్జ్వలకరా శార్దూలవరవాహనా ।

కాత్యాయనీ శుభం దద్యాద్ దేవీ దానవఘాతినీ ॥


భావం: ప్రకాశవంతమైన ఆయుధాన్ని ధరించి, శక్తివంతమైన వాహనంపై ఆసీనురాలై దుష్టశక్తులను సంహరించే కాత్యాయనీదేవి మాకు శుభాలను, ధైర్యాన్ని, ధర్మవిజయాన్ని ప్రసాదించుగాక.


అలంకారం: మహాలక్ష్మీదేవి – గులాబీ రంగు


మహాలక్ష్మీ అలంకారంలో అమ్మవారిని పద్మాలు, దివ్యాభరణాలు, అందమైన వస్త్రాలతో అలంకరిస్తారు. ధనసంపదతో పాటు ధర్మబద్ధమైన జీవనం, దానం, సంతృప్తి, కుటుంబక్షేమం కలగాలని ప్రార్థిస్తారు.


🌼 మహాలక్ష్మీ గాయత్రీ మంత్రం


ఓం మహాలక్ష్మ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి । తన్నో లక్ష్మీః ప్రచోదయాత్ ॥


భావం: సంపద, శ్రేయస్సు, ఐశ్వర్యానికి అధిష్ఠాన దేవత అయిన మహాలక్ష్మిని ధ్యానిస్తూ, ఆమె అనుగ్రహం మా జీవితాలను ధర్మబద్ధమైన సంపదతో, సంతృప్తితో నింపాలని ప్రార్థిస్తున్నాము.


నైవేద్యం: చక్కెర పొంగలి, క్షీరాన్నం లేదా సంప్రదాయానుసారమైన ప్రసాదం.


🌷 పురాణ కధ - సాధన

దుర్గామాత ఆరవ స్వరూపం కాత్యాయని. పూర్వం ‘కత’ అనే పేరుగల ఒక గొప్ప మహర్షి ఉండేవాడు. అతని కుమారుడు ‘కాత్య’ మహర్షి. ఈ కాత్యగోత్రజుడే విశ్వవిఖ్యాతుడైన ‘కాత్యాయన’ మహర్షి. ఇతడు ‘పరాంబా’ దేవిని ఉపాసిస్తూ, ఎన్నో సంవత్సరాలు కఠినమైన తపస్సును ఆచరించాడు. భగవతీదేవి లేదా దుర్గాదేవి పుత్రికగా తన ఇంట జన్మించాలని అతని కోరిక. భగవతీ మాత ఆయన ప్రార్థనను అంగీకరిస్తుంది. కొంతకాలం తరువాత ‘మహిషాసురుడు’ అనే రాక్షసుని అత్యాచారాలతో భూలోకం పెచ్చరిల్లిపోతుంది. ఈ మహిషాసురుని సంహరించడానికై బ్రహ్మవిష్ణు మహేశ్వరులు తమ తమ తేజస్సుల అంశలతో ఒక దేవిని సృష్టిస్తారు. మొట్ట మొదట కాత్యాయన మహర్షి ఈమెను పూజిస్తారు. అందువలన ఈమె ‘కాత్యాయని’ అని ప్రసిద్ధికెక్కింది.


ఈమె ‘కాత్యాయన’ మహర్షి ఇంట పుత్రికగా అవతరించిందని మరి ఒక కథ. ఈమె అమాంత భాద్రపద బహుళ చతుర్దశినాడు జన్మించింది. ఈమె ఆశ్వీయుజ శుక్ల సప్తమి, అష్టమి, నవమి తిథులలో కాత్యాయన మహర్షి పూజలందుకొని విజయదశమినాడు మహిషాసురుని వధించింది.


ఈమె సాక్షాత్తూ గాయత్రీ అవతారమేనని చెప్పబడింది. కాత్యాయనీ ఉపాసన వల్ల సంతాపాలు, భయాలు, అనుమానాలు దూరమవుతాయి. వేదవిద్య అబ్బుతుంది .


కాత్యాయనీ దేవి అమోఘ ఫలదాయిని. కృష్ణుడిని పతిగా పొందటానికి గోకులంలో గోపికలందరూ యమునానదీ తీరాన ఈమెనే పూజించారని భాగవతం చెబుతుంది. ఈమె గోకులానికి అధిష్ఠాత్రిగా వెలిసినది. ఈమె స్వరూపము దివ్యమూ, భవ్యమూ. ఈమె శరీరకాంతి బంగారు వన్నెతో తళతళ మెరుస్తూ ఉంటుంది. ఈమె నాలుగు భుజాలతో విరాజిల్లుతూ ఉంటుంది. ఈమె కుడిచేతులలో ఒకటి అభయముద్రనూ, మరొకటి వరదముద్రనూ కలిగి ఉంటుంది. ఈమె ఒక ఎడమ చేతిలో ఖడ్గమూ, మరొక ఎడమ చేతిలో పద్మమూ శోభిల్లుతూ ఉంటాయి. సింహవాహన.


దుర్గా నవ రాత్రులలో ఆరవరోజున కాత్యాయనీ స్వరూపం పూజింపబడుతుంది. ఆ దినాన సాధకుడి మనస్సు ఆజ్ఞా చక్రంలో స్థిరమవుతుంది. యోగసాధనలో ఈ ఆజ్ఞా చక్రం యొక్క స్థానం ప్రముఖమైనది. ఈ చక్రంపై స్థిర మనస్సుగల సాధకుడు తన సర్వస్వమును కాత్యాయనీ దేవి చరణాలలో సమర్పిస్తాడు. పరిపూర్ణంగా ఆత్మసమర్పణము చేసిన భక్తుడికి సహజంగానే కాత్యాయనీ మాత దర్శనం లభిస్తుంది.


ఈ దేవిని భక్తితో సేవించిన వారికి ధర్మ, అర్థ, కామమోక్షాలనే చతుర్విధ పురుషార్థముల ఫలములు లభిస్తాయి. అతడు ఈ లోకంలో అలౌకిక తేజస్సులను, ప్రభావములను పొందగలడు. రోగములు, శోకములు, సంతాపములు, భయము మొదలైనవి అతడినుండి సర్వదా దూరమవుతాయి.


జన్మజన్మాంతరాల పాపాలు నశించటానికి ఈ దేవి ఉపాసనకంటె సులభమైనా, సరళమైన మార్గం మరొకటి లేదు. ఈమెను ఆరాధించేవారు నిరంతరం ఈమె సాన్నిధ్యం నుండీ, పిమ్మట పరమపదప్రాప్తికీ అర్హులవుతారు. కాబట్టి మనము అన్ని విధాలా ఈ తల్లిని శరణుజొచ్చి, ఈమె పూజలందూ, ఉపాసనయందూ తత్పరులము కావాలి.


✍️ ప్రసాద్‌ భరధ్వాజ


🌹 🌹 🌹 🌹 🌹


Comments


©2023 by Daily Bhakti Messages 3.
Proudly created with Wix.com

bottom of page