top of page

పోలిస్వర్గం పోలి పాడ్యమి శుభాకాంక్షలు భక్తులందరికి Polisvargam Poli Padyami Greetings to all the devotees

  • Writer: Prasad Bharadwaj
    Prasad Bharadwaj
  • 8 hours ago
  • 2 min read
ree

🌹 పోలిస్వర్గం పోలి పాడ్యమి శుభాకాంక్షలు భక్తులందరికి - పూజా విధానం, పురాణ గాధ 🌹

ప్రసాద్ భరద్వాజ



🌹 Polisvargam Poli Padyami Greetings to all the devotees - Puja method, Purana Gadha 🌹

Prasad Bharadwaja


కార్తీకమాసం కార్తీక నవంబరు 20 అమావాస్యతో ముగుస్తుంది. ఆ మరుసటి రోజు నుంచి మార్గశిరమాసం ప్రారంభమవుతుంది.


అయితే మొదటి రోజు వచ్చే పాడ్యమిని పోలి పాడ్యమి అంటారు. ఈ రోజునే పోలి స్వర్గం అని ప్రత్యేక పూజలు చేస్తారు. కార్తీకమాసంలో నియమాలు పాటించి నిత్యం స్నానం, దీపం నియమాలు పాటించిన వారు... పోలిస్వర్గం రోజు వేకువజామునే దీపాలు నీటిలో వదలడంతో వ్రతం పూర్తైందని భావిస్తారు.


నెల రోజులు కార్తీక మాస నియమాలు అనుసరించిన వారికి పోలిస్వర్గం ముగింపు రోజు అయితే... నెలరోజులూ నియమాలు పాటించనివారు ఆ కార్తీక వ్రత ఫలితాన్ని పొందేందుకు పోలిస్వర్గం రోజు దీపాలు నదిలో విడిచిపెడతారు.


ఈ ఏడాది పోలిస్వర్గం ఎప్పుడు?


సాధారణంగా కార్తీకమాసం అమావాస్య తర్వాత మార్గశిర పాడ్యమి రోజుని పోలి పాడ్యమి అంటారు. ఈ రోజే దీపాలు విడిచిపెట్టి కార్తీకవ్రతాన్ని ముగిస్తారు. అయితే పోలిస్వర్గం ఈ ఏడాది శుక్రవారం వచ్చింది. శుక్రవారం రోజు అమ్మవారిని ఇంటినుంచి పంపించకూడదని అందుకే ఈ ఏడాది కార్తీక వ్రతం ముగింపు శుక్రవారం కాకుండా శనివారం అనుసరించాలంటున్నారు.


సాధారణంగా పోలి పాడ్యమి శుక్రవారం వచ్చినప్పుడు ఆ రోజు పోలమ్మను స్వర్గానికి పంపించరు. బదులుగా శనివారం చేస్తారు. శుక్రవారం లక్ష్మీదేవి రోజు.. పోలమ్మను లక్ష్మీదేవిగా భావిస్తారు... అందుకే పోలమ్మను స్వర్గానికి శనివారం పంపించాలని చెబుతారు కొందరు పండితులు. ఈ విషయంపై స్థానికంగా మీరు విశ్వసించే పండితులు చెప్పిన విధానం, ఇంటిపెద్దల సలహాలు అనుసరించడం మంచిది..



🍀 ఇంతకీ పోలిస్వర్గం అని ఎందుకంటారు? దీని వెనుకున్న పురాణ కథేంటి? ఈ రోజు ఏం చేయాలి? 🍀


🍁 పోలి పాడ్యమి కథ 🍁


పూర్వకాలంలో ఓ గ్రామంలో ఉమ్మడి కుటుంబంలో ఐదుగురు కోడళ్లుండేవారు. వారిలో చిన్న కోడలి పేరు పోలి. ఆమెకు దైవభక్తి చాలా ఎక్కువ. కానీ ఆ భర్తే ఆమెకు శాపంగా మారింది. ఆ భక్తి చూసి అత్త ఓర్వలేకపోయింది..అందుకే నలుగురు కోడళ్లను ప్రేమగా చూసేది కానీ పోలిని బాధలు పెట్టేది. పూజలు చేయనిచ్చేది కాదు. కార్తీకమాసం రావడంతో నలుగురు కోడళ్లను తీసుకుని నిత్యం నదీ స్నానానికి వెళ్లి అక్కడ దీపాలు వెలిగించేది. చిన్న కోడలు నదికి రాకుండా ఇంట్లో పనులన్నీ చేయించేది. నిరాశచెందని పోలి..అత్త, నలుగురు తోడికోడళ్లు వెళ్లిపోయిన వెంటనే స్నానమాచరించి ఇంటి దగ్గరే తులసి మొక్క దగ్గర దీపం వెలిగించేది. ఇంటి పెరట్లో ఉన్న పత్తిని తీసి ఒత్తి చేసి..వెన్న రాసి దీపం వెలిగించేది. ఆ దీపం ఎవరికంటా పడకుండా బుట్ట బోర్లించేది. నెలరోజులూ క్రమం తప్పకుండా దీపం వెలిగించింది పోలి. ఆఖరి రోజైన మార్గశిర పాడ్యమి రోజు కూడా అంతా నదికి వెళ్లారు. వారు తిరిగి వచ్చేసరికి ఇంటి దగ్గర కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు. ఆ రోజు కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా దీపం వెలిగించి కార్తీక దామోదరుడిని ప్రార్థించింది పోలి. వెంటనే స్వర్గం నుంచి దిగి వచ్చిన దేవతలు పోలిని ప్రాణాలతోనే స్వర్గానికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇది చూసి ఆశ్చర్యపోయిన అత్త, నలుగురు తోడికోడళ్లు ఇదేంటి, నెల రోజులు తాము భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తే పోలిని తీసుకెళుతున్నారని. అందుకు పోలి చేసిన పూజల గురించి చెప్పారు దేవదూతలు. తాము కూడా పోలితో పాటూ స్వర్గానికి వెళ్లాలంటూ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. పూజలు చేయడం కాదు. కల్మషం లేని భక్తితో పూజలు చేసినప్పుడే ఆ పూజలు ఫలిస్తాయని చెప్పారు దేవదూతలు.


కార్తీక అమావాస్య మర్నాడు వచ్చే పోలి పాడ్యమి రోజు దేవుడి దగ్గర, తులసి మొక్క దగ్గర దీపం వెలిగించుకుని ఈ కథ చెప్పుకుంటే ఆమెలా స్వర్గ ప్రాప్తి లభిస్తుందని కార్తీక పురాణంలో ఉంది. నెల రోజులు నియమాలు పాటించని వారు ఈ రోజు 30 వత్తులు వెలిగిస్తే నెల రోజులు దీపారాధన చేసిన ఫలితం దక్కుతుందని నమ్మకం. ఈ రోజు దీపదానం ఆచరిస్తే మంచి జరుగుతుంది.


పోలిస్వర్గం కథ పూర్తిగా..తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకునే కథ... కార్తీకమాసంలో నిత్యం దీపారాధన, పూజలు చేయడం కాదు..కల్మషం లేకుండా భగవంతుడిని ఆరాధించినప్పుడే మీకు జరగాల్సిన మంచి జరుగుతుందన్నది ఈ కథలో ఆంతర్యం.


🌹🌹🌹🌹🌹



Comments


©2023 by Daily Bhakti Messages 3.
Proudly created with Wix.com

bottom of page