top of page
Writer's picturePrasad Bharadwaj

భారత గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు, Greetings on Bharat's Republic Day



🌹🍀 భారత గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అందరికి, Bharat Republic Day Greetings to All. 🍀🌹


ప్రసాద్ భరద్వాజ



🇮🇳. రిపబ్లిక్ డే.. జనవరి 26నే ఎందుకు? భారత చరిత్రలో ఆ రోజుకు ఎందుకంతటి విశిష్టత? 🇮🇳



దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది.. అలాగే 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది... కాబట్టి ఏటా అదే తేదీన రిపబ్లిక్ డే జరుపుకుంటున్నామని భావిస్తారు. ఇందులో కాస్త నిజం లేకపోలేదు. అయితే దీని వెనుక బలమైన కారణం ఉంది. వాస్తవానికి భారత రాజ్యాంగాన్ని 1949 నవంబరు 26నే ఆమోదించారు. దీనిని అమలు చేసే తేదీకి ఒక ప్రాముఖ్యత ఉండాలనే ఉద్దేశంతో రెండు నెలలు వేచి ఉన్నారు.



లాహోర్ వేదికగా 1930 జనవరి 26న కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశంలో తొలిసారిగా పూర్ణ స్వరాజ్యం తీర్మానం చేశారు. నెహ్రూ సారథ్యంలో రావీ నది ఒడ్డున త్రివర్ణ పతాకం ఎగురవేసి భారతీయుల స్వాతంత్ర సంకల్పాన్ని బ్రిటిషర్లకు గట్టిగా వినిపించారు. అప్పటి దాకా కేవలం రాజకీయ, ఆధ్యాత్మిక స్వాతంత్రం వస్తే చాలు, సంపూర్ణ అధికారం భ్రిటిష్ వారి చేతుల్లోనే ఉండి, దేశం సామంత రాజ్యంగా మిగిలిపోయినా ఫర్వాలేదనుకునేలా ఉన్న రాజకీయ నేతల వైఖరిని జలియన్‌వాలాబాగ్ ఉదంతం ఒక్కసారిగా కళ్లు తెరిపించింది.



నాడు సుభాష్ చంద్రబోస్, జవహర్‌లాల్ నెహ్రూ లాంటి నేతలు కాంగ్రెస్ పార్టీలో వేడి పుట్టించి పూర్ణ స్వరాజ్య తీర్మానం ప్రకటన చేయించడంలో సఫలమయ్యారు. ఆ రోజునే స్వాతంత్ర దినోత్సవంగా పరిగణించాల్సిందని కాంగ్రెస్ పార్టీ కూడా దేశ ప్రజలకు పిలుపు ఇచ్చింది. అంతటి చారిత్రక ప్రాధాన్యం ఉన్న తేదీకి చిరస్థాయి కల్పించాలన్న సదుద్దేశంతో నవభారత నిర్మాతలు రాజ్యాంగ రచన 1949లో పూర్తయినా.. మరో రెండు నెలలు ఆగి 1950 జనవరి 26 నుంచి దానిని అమల్లోకి తెచ్చారు.



జనవరి 26, 1950 నుంచి బ్రిటీష్ కాలంనాటి భారత ప్రభుత్వ చట్టం -1935 రద్దయ్యింది.. భారతదేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశ రాజ్యాంగ రచనకు ఎంతోమంది మేధావులు వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి, అధ్యయనం చేసి ప్రజాస్వామ్య విధానంలో రూపొందించారు. అనేక సవరణల అనంతరం, 1949 నవంబర్‌ 26న దీనిని రాజ్యాంగ పరిషత్‌ ఆమోదించింది.



భారత రాజ్యాంగానికి 1935 భారత ప్రభుత్వ చట్టం మూలాధారం అయినప్పటికీ, అందులోని అనేక అంశాలను ఇతర రాజ్యాంగాల నుంచి గ్రహించారు. బ్రిటీష్ పరిపాలన నుంచి విముక్తి పొందిన తరువాత భారత పౌరులందరిని ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో నడిపించడానికి, స్వాతంత్ర్య పోరాట ఆశయాలను నెరవేర్చడానికి, రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసి, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రూపొందించారు. ఇది జనవరి 26, 1950 నుంచి అమలులోకి వచ్చింది. ఈ రోజున భారత ప్రజలందరూ సంపూర్ణ స్వేచ్ఛ, సమానత్వం, లౌకికతత్వం, న్యాయాన్ని పూర్తి స్థాయిలో ఒక హక్కుగా పొందడం జరిగింది.



ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం వేళ గణతంత్ర పరేడ్‌కు పోటీగా అదేరోజున సాగు చట్టాలకు వ్యతిరేకంగా భారీఎత్తున రైతుల పరేడ్‌ నిర్వహించడం గమనార్హం. ప్రజలు పోరాడి సాధించిన ఈ గణతంత్రంలో రైతులు, కార్మికులు లేకుంటే కండపుష్టి వచ్చేది కాదని, ఆ రోజు స్వాతంత్య్రం తెచ్చిందీ రైతులే.. ఈ 74 ఏళ్ల స్వతంత్ర భారతం యొక్క మనుగడను కాపాడుతున్నదీ రైతులే అని ప్రజాస్వామ్యవాదులు అంటున్నారు. ఇలా 26 జనవరి నాడు, స్వతంత్ర దేశంగా పురుడు పోసుకుని ప్రపంచ దేశాల కూటమిలో సంపూర్ణ స్వతంత్ర దేశంగా భారత్ చేరింది.


🌹🌹🌹🌹🌹



Comments


bottom of page