భీష్మ - జయ ఏకాదశి విశిష్టత, ముహూర్తం, పూజ, భీష్మ కధ Bhishma - Jaya Ekadashi Significance
- Prasad Bharadwaj
- 1 hour ago
- 2 min read

🌹 భీష్మ - జయ ఏకాదశి విశిష్టత, ముహూర్తం, పూజ, భీష్మ కధ Bhishma - Jaya Ekadashi Significance 🌹
ప్రసాద్ భరద్వాజ
నమామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా
వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం
''శ్రీమన్నారాయణుని పాదకమలాలకు నమస్కారం. దేవదేవుని నిరంతరం పూజిస్తూ, ఆ పవిత్ర నామాన్ని జపిస్తూ, నిర్మలమైన మనసుతో, అవ్యయమైన ఆయన తత్వాన్ని స్మరిస్తున్నాను'' - అనేది ఈ శ్లోకానికి అర్ధం.
హిందూ ధర్మంలో ప్రతి నెల శుక్ల పక్షం, కృష్ణ పక్షం ఏకాదశి రోజున విష్ణువుని పూజించడం చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మాఘ మాసం శుక్ల పక్షం ఏకాదశి రోజున భీష్మ ఏకాదశి లేదా జయ ఏకాదశి జరుపుకుంటారు.
మాఘమాసంలో శుక్లపక్ష ఏకాదశి విష్ణుప్రీతికరమైన మహాపర్వం. ఈరోజున నారాయణార్చన, శ్రీవిష్ణు సహస్రనామ పారాయణ, జప ఉపవాసాదులు విశేష ఫలాలను ఇస్తాయి. భీష్మ నిర్యాణానంతరం వచ్చిన ఏకాదశి కనుక ఈ భాగవత శిఖామణి పేరున ఈ ఏకాదశిని 'భీష్మ ఏకాదశి" అని పిలుస్తారు.
ఈ ఏడాది ( 2026) భీష్మ ఏకాదశిని జనవరి 29 న జరుపుకుంటారు. హిందూ పంచాగం ప్రకారం భీష్మ ఏకాదశి మాఘమాసం శుక్ల పక్షం 11వ రోజున వస్తుంది. ఈ రోజున ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసుకుందాం. . .!
🍀 భీష్మ ఏకాదశి శుభ ముహూర్తం 🍀
ఏకాదశి తిథి ప్రారంభం: జనవరి 28 సాయంత్రం 4.35 గంటలకు
ఏకాదశి తిథి ముగింపు: జనవరి 29 మధ్యాహ్నం 01:55 గంటలకు.
జనవరి 29 వ తేదీ సూర్యోదయం నాటికి ఏకాదశి ఉన్న కారణంగా ఆరోజే భీష్మ ఏకాదశి వ్రత నియమాలు పాటించాలని పండితులు చెబుతున్నారు. ఈ రోజున ఉపవాస దీక్షను పాటిస్తారు. అలాగే శ్రీ మహా విష్ణువును, లక్ష్మీ దేవిని పూజిస్తారు.
దక్షిణ భారతీయులు భీష్మ ఏకాదశి అంటే.. ఉత్తర భారతదేశంలో జయ ఏకాదశి అంటారు. భీష్ముడు ఉత్తరాయణ పుణ్య కాలంలో తనువు చాలించాడు. భీష్ముడు చనిపోయే ముందు ధర్మరాజుకి విష్ణు సహస్ర నామాన్ని బోధించిన పవిత్రమైన తిథిని జయ ఏకాదశి అంటారు. ఆరోజు భీష్ముడికి తర్పణం చేసి మహా విష్ణువుని పూజించిన వారికి స్వర్గ ప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు. ఆరోజు ఏ కార్యం తలపెట్టినా కూడా అది ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. భీష్మ ఏకాదశి వ్రతం చాలా శక్తివంతమైనదని నమ్ముతారు. ఆ రోజు ఉపవాసం ఉంటే బ్రహ్మ హత్య పాపం నుంచి కూడా విముక్తి కలుగుతుందని విశ్వసిస్తారు.
⚜️ భీష్మ ఏకాదశి పూజా విధానం. ⚜️
భీష్మ ఏకాదశి నాడు తెల్లవారుజామున లేచి స్నానం చేసి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి.
ఆ తరువాత పీటపై పసుపు రంగు కొత్త గుడ్డను ఉంచి కొద్దిగా బియ్యం పోసి వాటిపై తమలపాకు పెట్టి..విష్ణుమూర్తి.. లక్ష్మీ దేవి విగ్రహాలను లేదా చిత్రపటాన్ని ప్రతిష్ఠించుకోవాలి.
సంకల్పం చెప్పుకుని ఉపవాస దీక్ష చేపట్టి, విష్ణువును పూజించండి.
షోడశపచార పూజలు చేసి పసుపు.. కుంకుమ.. గంధం సమర్పించండి. పూలలో పసుపురంగు పూలు ఉండే విధంగా చూసుకోండి.
విష్ణు సహస్రనామం చదవండి. లేకపోతే శ్రద్దగా.. భక్తితో వినండి. అలాగే లక్ష్మీ దేవిని పూజించండి. తులసి చెట్టు వద్ద దీపం వెలిగించి.. ధూప .. దీప.. నైవేద్యం సమర్పించండి. పాలు.. కొబ్బరితో చేసిన స్వీట్లను నైవేద్యంగా సమర్పించండి.
రోజంతా ఉపవాసం ఉండి, రాత్రి జాగరణ చేయడం వల్ల అపరిమితమైన పుణ్యం లభిస్తుంది.
మరుసటి రోజు (ద్వాదశి) పేదలకు దానధర్మాలు చేసిన తర్వాతే ఉపవాసాన్ని విరమించాలి.
ఒక సందర్భంలో మహాశివుడు ''విష్ణు సహస్రనామం ఎలాంటి కష్టాల నుండి అయినా కాపాడుతుందని, సర్వవిధాలుగా రక్షిస్తుందని'' పార్వతీదేవికి చెప్పి, ''ఒకవేళ విష్ణు సహస్రనామం గనుక పారాయణం చేయలేకపొతే కనీసం
''శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే''
శ్లోకాన్ని మూడుసార్లు ఉచ్చరించినట్లయితే అంతే ఫలితం కలుగుతుంది'' అంటూ వివరించాడు.
ఈ భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. అవకాశం లేకపోతే ''శ్రీరామ రామ...'' శ్లోకాన్ని మూడుసార్లు భక్తిగా జపించండి.
🌻 భీష్ముని జన్మ వృత్తాంతం 🌻
గంగామాత స్త్రీరూపంలో గర్భధారిణియై వసువులను కుమారులుగా కన్నది. అలా వాళ్ళు మనుష్యులై జన్మించారు. జలరూపంలో ఆమె వాళ్ళను మళ్ళీ తనలోకి తీసేసుకున్నది. అంటే గంగాదేవి జగన్మాత్రు స్వరూపిణి కాబట్టి ఆమె గర్భవాసాన జన్మించిన తరువాత ఎవరికీ పాపం ఉండదు. అయితే ఏ కారణం చేతనో ఆమె గర్భాన ఎనిమిదవవాడుగా జన్మించిన భీష్ముడిని ఆమె గంగలో పారవేయబోతుంటే ఆమె భర్త అయిన శంతన మహారాజు ఆమెను వారించాడు. అందుకని ఆ పిల్లవాడిని ఆయననే పెంచుకోమని అప్పగించి ఆమె వెళ్ళిపోయింది. అలా శంతనుడి చేత శాపవిముక్తుడు కాకుండా నివారింపబడిన భీష్ముడు పెరిగి పెద్దవాడయినాడు. ఆయన బోధించిన విజ్ఞాన సంపద, ఆయన బోధించిన ప్రతి వాక్యము అనాదికాలం నుంచీ వచ్చినటువంటి సత్యానికి అతి సన్నిహితంగా ఉంటుంది. సత్యాన్ని అది ధరించి ఉంటుంది.
🌹🌹🌹🌹🌹



Comments