మాఘమాసం The Month of Magh (of Indian Calendar)
- Prasad Bharadwaj
- 2 days ago
- 3 min read

🌹 మాఘమాసం విశిష్టత - మాఘమాసంలో సముద్ర, నదీస్నానం, జపం, దానధర్మం, పురాణ పఠనం పుణ్యప్రదం🌹
ప్రసాద్ భరధ్వాజ
🌹 The significance of the month of Magha - Taking a bath in the sea or a river, chanting mantras, performing acts of charity, and reading Puranas during the month of Magha are considered meritorious. 🌹
Prasad Bharadwaj
చంద్రుడు మఖ నక్షత్రంలో కూడిన మాసం "మాఘమాసం". మఘం అంటే యజ్ఞం అని అర్థం. అఘం అనే పదానికి సంస్కృతంలో పాపం అని అర్థం. ఇక మాఘం అంటే పాపాలను నశింప జేసేది. ఇది విష్ణువునకు అత్యంత ప్రీతికరమైనది. అమ్మ వారికి కూడా అత్యంత ప్రీతికరం. శ్యామలా దేవి నవరాత్రులు అని చేస్తారు. ఈ మాఘమాసంలో ఆచరించే సముద్ర స్నానం, నదీస్నానం, జపం, దానధర్మం, పురాణ పఠనం ఎంతో పుణ్యప్రదంగా భావిస్తారు. ఇది పాప ప్రక్షాళనకు, ఆత్మ శుద్ధికి, మరియు దైవిక అనుగ్రహం పొందడానికి లభించిన అద్భుతమైన అవకాశం. మాఘ మాసం ఆధ్యాత్మిక ప్రగతికి, మానసిక శాంతికి, అనందానికి మరియు ఆరోగ్యానికి మార్గం సుగమం చేస్తుంది. మాఘమాసం త్రిమూర్త్యాత్మకం. పూర్ణిమ, అమావాస్య బ్రహ్మ స్వరూపాలు. శుక్లపక్షం పాడ్యమి నుండి చతుర్దశి వరకు ఉన్న 14రోజులు విష్ణుస్వరూపం. కృష్ణపక్షం పాడ్యమి నుండి చతుర్దశి వరకు ఉన్న 14రోజులు శివస్వరూపం. మాసం మొత్తం జగన్మాత స్వరూపం.
ఈ మాఘమాసంలో సూర్యుడు మకరరాశిలో సంచరిస్తాడు. మాఘ మాసం భగవంతుడితో మన సంబంధాన్ని బలపరచుకొని, పుణ్యాన్ని సంపాదించి, ప్రగతిశీలమైన జీవితాన్ని నిర్మించుకోవడానికి అనుకూలమైన సమయం. ఈ మాసంలో ప్రప్రథమం చేయాల్సింది నదీ స్నానం. ఈ నదీ స్నానంతో పాపాలు హరిస్తాయని పురాణోక్తి.
మాఘ స్నానం: ఈ స్నానాలకి అధిపతి సూర్య భగవానుడు. కార్తీక గాలుల్లో చంద్రుడు ఓషది కారకుడై ఆరోగ్యం ఎట్లు కలిగించునో అట్లే రవి కూడా ఈ కాలమందు ఆయన కిరణాలతో ఆరోగ్యాన్నిస్తాడు. అందుకే స్నానానంతరం సూర్యునికి ఆర్గ్యం ఇస్తారు. ఇక ఈ స్నానాలు అఘమర్షణ స్నానఫలాన్ని ఇస్తాయి. పుష్కర స్నానం ఫలాన్ని ఇస్తాయి. శతగుణ ఫలాన్ని ఇస్తాయి.
"దుఃఖ దారిద్ర్య నాశాయ శ్రీ విష్ణోస్తోషనాయ చl
ప్రాతః స్నానం కరోమ్యద్య మాఘే పాపవినాశనంll
మకరస్థే రవౌ మాఘే గోవిందాచ్యుత మాధవl
స్నానేనానేనమే దేవ యథోక్త ఫలదోభవll"
అనే శ్లోకం చదువుతూ మాఘ స్నానం చేయాలి. ఈ మాసం ఏ పారాయణ చేసిన అది అద్భుత ఫలితాన్ని ఇస్తుంది.
అరుణోదయేతు సంప్రాప్తే, స్నానకాలే విచక్షణః
మాధవాంఘ్రి యుగం ధ్యాయన్ యః స్నాతి సురపూజితః
ఇలా బ్రహ్మ పురాణం చెబుతున్నది. అనగా, సూర్యోదయంలో నారాయణుని ధ్యానిస్తూ స్నానం చేస్తే దేవతలచేత పూజితుడుఅవుతాడు. ఇక, నక్షత్రాలు ఉండగా చేయడం ఉత్తమం. లేనప్పుడు చేయడం మధ్యమం. సూర్యోదయం తదుపరి చెస్తే అధమం.
ముఖ్యంగా ఈ మాఘమాసంలో నువ్వులు, వస్త్రాలు, అన్నదానం చేయడం ఎంతో శ్రేష్ఠమని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా మాఘమాసంలో మాఘపురాణం చదవడం వల్ల సమస్త పాపాలు తొలగుతాయని విశ్వాసం. అలాగే ఆధ్యాత్మిక చింతనకు ఈ మాఘమాసం ఎంతో విశిష్టమైనది.
ఉత్తరాయణంలో ముఖ్యమైన పండుగలన్నీ ఈ మాఘమాసంలోనే వస్తాయి. ఈ మాసం శ్యామలా నవరాత్రులతో ప్రారంభం అవుతుంది. ఆపై వసంత పంచమి , రథ సప్తమి పండుగతో పాటు.. మహాశివరాత్రి వంటి పుణ్య పర్వదినాలు ఉన్నాయి. ఈ మాసంలో శ్రీమహావిష్ణువు, సూర్య భగవానుడితో పాటు లింగోద్భవం కూడా ఈ నెలలోనే ఏర్పడంటంతో శివుడికి కూడా ఈ మాసం అత్యంత కీలకం. ఈ మాఘమాసంలో వచ్చే ఆదివారాలు చాలా విశిష్టమైనవి. ఈ రోజున తరిగిన కూరలు తినరు. అలాగే ఈ నెలలో మాఘ గౌరి నోము, మాఘ ఆదివారం నోము వంటివి విశేషంగా ఆచరిస్తారు.
అలాగే, మాఘ శుద్ధ చతుర్థి అనగా వరచతుర్ధి, పగలు ఉపవాసం ఉండి గణపతిని పుజించి రాత్రి భుజించాలి. సాయంత్రం శివుని పూజ చేయాలి.
ఇక, మాఘశుద్ద పంచమి శ్రీ పంచమి. సరస్వతి అవిర్భవించిన రోజు. ఆనాడు అక్షరాభ్యాసం చేసుకున్నవారు అదృష్టవంతులు.
తదుపరి మాఘ శుద్ధ సప్తమి -రథ సప్తమి యనబడును. బ్రాహ్మీ ముహూర్తంలో నక్షత్రాలు రథం ఆకారాన్ని కలిగి యుండునని పురాణ వచనం. రవి విశాఖ నక్షత్రంలో జన్మించిన రోజు. ఆనాటి నుండి రవికి భూమి దగ్గరవడం మొదలు ఆపై వేసవికాలం మొదలు. ఆనాడు ఆయన్ని పూజిస్తే రాజయోగాలు, ఆరోగ్యం, అదృష్టం కలుగుతుంది.
ఆపై మాఘ శుద్ధ అష్టమి భీష్మాష్టమి. ఆయన పరమపదించిన రోజు.
తదుపరి, మాఘ శుక్ల ఏకాదశి భీష్మ ఏకాదశి. కృష్ణుడిచే సత్యవ్రతుడు వరం పొందినరోజు. ఆనాడు ఆయన మోక్షం పొందిన రోజు. ఆనాడు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం విష్ణువునకు ప్రీతి.
మరునాడు భీష్మ ద్వాదశి. ఆనాడు కృష్ణుడిలో లీనమైన రోజు.
ఆపై, మాఘ శుద్ధ పూర్ణిమ అంటే మహా మాఘి. దేవి శక్తి అపారమైనదిగా మారే రోజు.
ఆపై, మాఘ బహుళ చతుర్థి. సంకష్టహర చతుర్థి. ఆపై, మాఘ బహుళ చతుర్దశి. మహా శివరాత్రి పర్వదినం.
మాఘ మాసంలో సాధించే ఆధ్యాత్మిక పునరుద్ధరణ మన జీవితాన్ని మెరుగుపరుస్తుంది. మనకు ఎదురయ్యే అన్ని విఘ్నాలను అంగీకరించి, ఈ పవిత్ర మాసాన్ని గౌరవంగా జరుపుకోవడం అనేక పుణ్యాలను సంపాదించడానికి మరియు మన ఆధ్యాత్మిక జీవితం బలపడే దిశగా ముందుకు తీసుకెళ్లే మార్గం. మనం ఈ నెలలో నిరంతరం ధ్యానిస్తూ, పూజలు నిర్వహిస్తూ, భగవంతుని ఆశీస్సులు పొందే అవకాశాన్ని సంపూర్ణంగా ఉపయోగించుకోవాలి.
🌹🌹🌹🌹🌹



Comments