🍀 మకర సంక్రాంతి, పొంగలి శుభాకాంక్షలు అందరికి, Pongal, Makar Sankranti Good Wishes to All 🍀
ప్రసాద్ భరద్వాజ
🌹🍀. మకర సంక్రాంతి 🍀🌹
సంక్రాంతి లక్ష్మి ఒంటరిగా రాదు. వణికించే చలిని, కురిసే మంచును తరిమికొట్టే మంటల కిరీటంతో మందు భోగిని, వెనుక కనుమను వెంటేసుకుని చెలికత్తెల మధ్య రాజకుమారిలా వస్తుంది.. సంక్రాంతి కాంతి నిచ్చే పండుగ. అందాల పండుగ. ఆనందాల పండుగ. పతంగుల పండుగ. ముగ్గుల పండుగ. గొబ్బెమ్మల పండుగ. హరిదాసుల పండుగ. గంగిరెద్దుల పండుగ. పాటల పండుగ. జానపదాల పండుగ. జనపదాల పండుగ. సర్వశుభాలను కలిగించే పర్వదినం.
హరిదాసుల సంకీర్తనలు, గంగిరెద్దుల సందడి ఇవన్నీ సంక్రాంతి పండుగనాళ్ళలో కనిపిస్తుంటాయి. భోగి, మకర సంక్రాంతి, కనుము అనే మూడు రోజుల పెద్దపండుగగా సంక్రాంతిని జరుపుకుంటారు. ప్రళయస్థితిలో భూమండలం సముద్రంలో మునిగి వుండేది. ఆదివరాహ రూపంలో శ్రీమహావిష్ణువు భూమిని మకర సంక్రాంతి రోజునే భూమిని ఉద్దరించాడన్నది పురాణ కథనం.
వామనావతారంలో విష్ణువు బలిచక్రవర్తి శిరస్సుపై కాలుపెట్టి పాతాళానికి తొక్కింది కూడా సంక్రాంతి రోజునే. మహాభారత యుద్ధంలో కురువృద్ధుడు భీష్ముడు అవసాన దశలో అంపశయ్యపై వుండి ఉత్తరాయణ పుణ్యకాలం వరకూ వేచివుండి అశువులు విడిచాడు. పుణ్యగతులు మకర సంక్రమణం రోజున సంప్రాప్తిస్తాయని, ఈ నెలలో వైకుంఠ ద్వారాలు తెరిచి వుంటాయని పెద్దలంటారు. ఇలా ఎన్నో విశేషాలు, పుణ్యఫలాలు మూటగట్టుకున్న పండుగ కనుకే ఇది పెద్దల పండగ అయ్యింది. పెద్ద పండుగగా మారింది. సంక్రాంతి రోజున సూర్యారాధనతోపాటు పూజలు, తర్పణాలు, దానాలు లాంటివి చేస్తుంటారు.
సంక్రాంతి నాడు పాలు పొంగించి, దానితో పరమాన్నం చేస్తారు. ఇదే కాదు- అరిసెలు, బొబ్బట్లు, జంతికలు, సకినాలు, పాలతాలికలు, సేమియా పాయసం, పులిహోర, గారెలు వంటి వంటకాలు తయారుచేస్తారు. ఇళ్ల ముందు తీర్చే ముగ్గుల ముచ్చట్ల విషయానికి వస్తే అలికిన వాకిళ్లు నిర్మలాకాశంతో సమానం.
🌹🌹🌹🌹🌹
Comments